అన్నాచెల్లెళ్లు రిషి, దీక్షిత (ఫైల్)
సాక్షి, ఉండవెల్లి (మహబూబ్‌నగర్): ముక్కుపచ్చలారని చిన్నారులు.. తండ్రితో కలిసి నాన్నమ్మ, తాతయ్యలను చూసేందుకు బైక్‌పై ఎంతో ఆనందంగా బయలుదేరారు. మరికొద్దిసేపట్లో వారిని చేరుకుంటామనగా. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన డీసీఎం వారి ఆశలను ఆవిరి చేసింది. క్షణకాలంలో ఊపిరిని అనంత వాయువులో కలిపేసింది. కళ్లెదుటే కన్నబిడ్డలు ఇద్దరూ కాలం చెందడంతో ఆ తండ్రి విలవిలలాడిపోయాడు. ఈ హృదయ విదారకరమైన సంఘటన పుల్లూరు శివారులో చోటుచేసుకుంది.
ట్రాక్టర్ ఎదురుగా రావడంతో..
మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన రవికుమార్, పుష్పలత దంపతులకు ముగ్గురు సంతానం. అఖిల్(12), రిషి(10), దీక్షిత(6) ఉన్నారు. వీరిలో చిన్నకొడుకు రిషి, దీక్షితలను రవికుమార్ తల్లిదండ్రులు ఉన్న ఈ.తాండ్రపాడులో వదిలిపెట్టి.. తాను ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతుండగా ట్రాక్టర్ ఎదురుగా వచ్చింది. దీంతో ట్రాక్టర్‌కు కుడివైపు బైక్‌ను తిప్పడంతో డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న చిన్నారులు కింద పడటంతో వారి తలపై డీసీఎం టైర్లు పోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రికి ఎలాంటి గాయాలు కాలేదు. నేషనల్ హైవే సిబ్బంది మృతదేహాలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను చెన్నిపాడుకు తరలించారు. ఈ ఘటనపై రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment