
శైలజ(ఫైల్)
సాక్షి, బల్మూర్ (మహబూబ్‌నగర్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు చివరకు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని తోడేళ్లగడ్డకు చెందిన శైలజ (20), వెంకటేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది క్రితం కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కాగా, శైలజ కొండనాగుల డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది.
ఇటీవల గ్రామానికి వచ్చిన ప్రియుడితో పెళ్లి విషయం ప్రస్తావనకు తేగా నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి మంగళవారం ఉదయం ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదే అర్ధరాత్రి మృతి చెందింది. ఈ విషయమై బుధవారం మృతురాలి అన్న వెంకటయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజు కేసు దర్యాప్తు జరుతున్నారు.