
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గీసుకొండ(వరంగల్): చెల్లెలు పెళ్లి కుదిరిందని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు.. దీంతో మాటముచ్చట కోసం ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. ఈ మేరకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ప్రమాదవశాత్తు వివాహిత కింద పడి మృతి చెందిన ఘటన ఇది. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన సిరబోయిన గణేశ్ రెండో కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఇదే విషయాన్ని నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లిలో అత్తవారింటి వద్ద ఉండే తన పెద్దకూతురు నరెట్ల ఉషారాణికి తెలిపిన గణేష్ వివరాలు మాట్లాడుకునేందుకు రమ్మని చెప్పాడు.
దీంతో మంగళవారం ఉదయం ఆమె తన భర్త రమేశ్‌తో కలిసి బైక్‌పై తూర్పుకోటకు బయలుదేరింది. ఉదయం 6.30 గంటలకు గీసుకొండ మండలంలోని వంచనగిరి రోడ్డు సాయిబాబా గుడి వద్ద బైక్ పైనుంచి ఉషారాణి కింద పడగా తల వెనక భాగంలో బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108 వాశనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా తన అల్లుడు అజాగ్రతగా, అతివేగంగా బైక్ నడపడం వల్లే ఉషారాణి మృతి చెందిందని ఆమె తండ్రి గణేశ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు గీసుకొండ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment