రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ సకాలంలో వైద్యం అందక కన్నుమూసిన ఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష (26) రెండోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటలకు పెద్దపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి పరిశీలించి సాధారణ ప్రసవం అవుతుందని వేచిచూశారు. రాత్రి 11గంటల వరకు వేచి చూసినా ప్రసవం జరగకపోవడం.. పురిటి నొప్పులు తీవ్రం కావడం.. అనూష కన్నీరు పెట్టడంతో కుటుంబసభ్యులు ఆపరేషన్ చేయాలని వైద్య సిబ్బందిపై ఒత్తిడి చేశారు. దీంతో వైద్యులు 11 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సిజేరియన్ చేసి పండంటి బాబుకు పురుడుపోశారు.
బాలింతను పట్టని వైద్య సిబ్బంది
ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే అనూష పాలిట శాపంగా మారింది. పురుడు పోసిన వైద్యులు.. అనంతరం పట్టించుకోకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. తీవ్ర రక్తస్రావం అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. తీరా అర్ధరాత్రి దాటాక గమనించే సరికి అనూష పరిస్థితి విషమించింది. కుటుంబసభ్యులకు తెలపకుండానే వైద్య సిబ్బంది ఆమెను అంబులెన్స్‌లో కరీంనగర్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కుటుంబ సభ్యులు గమనించి నిలదీయగా.. జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. అందరూ కలిసి అనూషను కరీంనగర్‌కు తీసుకెళ్లేసరికి అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు అదే అంబులెన్సులో మృతదేహంతో పెద్దపల్లి ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే అనూష చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యులను సస్పెండ్ చేయాలంటూ..
విషయం తెలుసుకున్న అనూష బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అనూషకు ఆపరేషన్ చేసి నిర్లక్ష్యం చేసిన వైద్యులు రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి, స్టాఫ్‌నర్స్ నిర్మలతను సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కుమార్ గౌడ్, స్వామి వివేక్ పటేల్, శ్రావణ్ దిలీప్, అశోక్, కృష్ణ, పెద్దబొంకూర్ సర్పంచ్ మానస, ముత్తారం సర్పంచ్ కుమారస్వామి, మిట్టపల్లి వెంకటేశం డిమాండ్ చేశారు.
ఆందోళన విషయం తెలుసుకున్న పెద్దపల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు రాజేష్, మహేందర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనూష మృతిపై చేపట్టిన విచారణ ప్రాథమిక నివేదికను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసుదేవ రెడ్డి కలెక్టర్ సంగీతకు అందించారు. అయితే సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు గోదావరిఖని ఏరియా ఆసుపత్రి వైద్యుడిని నియమించారు. అనూషకు భర్త శ్రీకాంత్, కూతురు ఉంది. మృతురాలి అత్త స్వరూప ఫిర్యాదు మేరకు వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
చదవండి: Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..?
Comments
Please login to add a commentAdd a comment