మానకొండూర్: ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.
ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్ (6) సంతానం. సాయికుమార్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్‌లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్ వేసుకుని సాయికుమార్ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.
నిద్రలో ఉన్న సాయికుమార్ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.
చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్ ఇన్‌చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment