పట్టపగలే యువకుడి హత్య.. | Young man murder in Anantapur | Sakshi
Sakshi News home page

తిట్టాడని.. చంపేశాడు!

Published Sun, Feb 25 2018 12:00 PM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

Young man murder in  Anantapur - Sakshi

పట్టపగలే ఓ యువకుడి హత్య జరిగింది. తనను తిట్టాడని కక్ష పెంచుకున్న వెల్డింగ్‌ వర్కర్‌ అందరూ చూస్తుండగా కొడవలితో విచక్షణారహితంగా నరకడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక సంఘటన స్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు.

గార్లదిన్నె: వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన గార్లదిన్నెలో కలకలం రేపింది. పో లీసులు తెలిపిన మేరకు.. రాజశేఖర్‌ (26) కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి మం జూరైంది. సకాలంలో పూర్తి చేసుకుంటేనే బిల్లు మంజూరు చేస్తామంటూ అధికారులు చెబుతుండటంతో రాజశేఖర్‌ నిర్మాణ పనులు చకచకా చేయిస్తున్నాడు. పైకప్పు రేకులకు సంబంధించి వెల్డింగ్‌ పని కోసం రఫీ అనే వర్కర్‌కు ఒప్పించాడు. అతడు వస్తానని చెప్పి మూడు రోజులుగా తిప్పుకుంటున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన రాజశేఖర్‌ శుక్రవారం వెల్డింగ్‌ పనులు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావంటూ వాగ్వాదానికి దిగాడు.

మాటామాటా పెరగడంతో వెల్డర్‌ను తిట్టాడు. ‘రేపు వచ్చి పని పూర్తి చేస్తా’ అంటూ వెల్డర్‌ తెలిపాడు. సరేనని వెళ్లిపోయిన రాజశేఖర్‌.. శనివారం ఉదయాన్నే ద్విచక్రవాహనంలో వెల్డింగ్‌షాపు వద్దకు వెళ్లాడు. సామాన్లు ఇంటివద్ద ఉన్నాయని చెప్పి రాజశేఖర్‌ బైక్‌లోనే రఫి కలిసి వెళ్లాడు. ముందు రోజు తనను తిట్టాడన్న కసితో రగిలిపోతున్న రఫి ఇంటివద్ద ఉన్న కొడవలి తీసుకుని ఒక్కసారిగా రాజశేఖర్‌పై విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా నరకడంతో రోడ్డుపైనే కుప్పకూలాడు.

రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. భీతావహ దృశ్యం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహంపై పడి బంధువులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ శివనారాయణస్వామి, ఎస్‌ఐ రామ్‌ప్రసాద్‌ తెలిపారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement