jawaharnagar
-
ఆడపిల్లనని బాధపడకండి..
హైదరాబాద్: ‘ఆడపిల్ల.. ఆడపిల్ల అని బాధపడకండని మా అమ్మానాన్నలకు చెప్పు. మరో జన్మంటూ ఉంటే వారి కడుపున మగపిల్లాడినై పుడతాను’ అని ఓ యువతి తన స్నేహితురాలికి ఫోన్లో మెసేజ్ పెట్టి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన జవహర్‌నగర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ అనిల్‌కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ కారి్మకనగర్‌కు చెందిన మనోహర్, లావణ్య దంపతులు. కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు చిత్ర శివాని (18) ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం ఆమె కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో దమ్మాయిగూడలో బస్సు దిగింది. సాయినగర్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వెళ్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత స్నేహితురాలికి ఫోన్లో ‘ఆడపిల్ల.. ఆడపిల్ల అని బాధపడకండి అని మా తల్లిదండ్రులకు చెప్పు.. మరో జన్మంటూ ఉంటే మగపిల్లాడినై వారి కడుపులో పుడతా’నంటూ మెసేజ్ పెట్టింది. సదరు స్నేహితురాలు వెంటనే ఫోన్ చూసుకోలేదు. ఈ క్రమంలోనే చిత్ర శివాని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వారు ఘటన స్థలికి చేరుకున్నారు. చిత్ర శివాని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రా అమ్మాయి... జవహర్‌నగర్ మేయర్
బాపట్ల టౌన్: బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన శాంతి తెలంగాణ రాష్ట్రంలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎంపికయ్యారు. ఆమె బాపట్ల మండలం, ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్య అభ్యసించారు. 2000లో తెనాలి మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన కోటేష్గౌడ్తో వివాహమైంది. గడిచిన 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ కార్పొరేటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ముత్తాయపాలెం గ్రామానికి చెందిన మహిళ శాంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
Hyderabad: నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడలో లింక్ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని రహదార్లకు మహద్భాగ్యం కలుగనుంది. నగరానికి తూర్పున ఉన్న మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, ఘట్కేసర్ స్థానికసంస్థల పరిధిలో 4 లేన్లు, 6 లేన్లతో విశాలమైన రహదారులు రానున్నాయి. ఇన్నర్ రింగ్‌రోడ్, ఔటర్‌రింగ్ రోడ్‌కు అనుసంధానంగా ప్రజల సాఫీ ప్రయాణానికి లింక్, స్లిప్రోడ్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల 104 రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. వాటిల్లో 50 రోడ్ల పనుల్ని ప్రాధాన్యతతో చేపట్టాల్సిందిగా సూచించింది. ఐదు ప్యాకేజీలుగా.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులకు నిధులు మంజూరు చేయగా వాటిల్లో మూడో ప్యాకేజీలోని 13 కారిడార్ల (రోడ్ల) పనులు చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) టెండర్లు ఆహ్వానించింది. వీటి అంచనా వ్యయం రూ.293.55 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి పనులు లేని ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరగనున్నాయి. వీటికి అవసరమైన నిధుల్ని హెచ్ఎండీఏ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టెండర్లు పిలిచిన రోడ్ల వివరాలు.. దమ్మాయిగూడ మునిసిపాలిటీలో.. ► దమ్మాయిగూడ రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్ నుంచి నాగారం రోడ్ (ఈసీఐఎల్‌ను కలుపుతూ): 2.80 కి.మీ.లు. ► చీర్యాల జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్‌గూడ: 1.70 కి.మీ.లు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో.. ► ఫైరింగ్ కట్ట నుంచి ఎన్టీఆర్ విగ్రహం రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి దమ్మాయిగూడ రోడ్ (మునిసిపల్ పరిధి వరకు ): 1.90 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ వరకు: 2.35 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్ వరకు: 1.20 కి.మీ.లు నాగారం మునిసిపాలిటీలో.. ► రాంపల్లి క్రాస్‌రోడ్స్ నుంచి సర్వే నెంబర్ 421 వరకు(హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర) : 3.90 కి.మీ.లు. ► సర్వే నెంబర్ 421 (హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర)నుంచి యామ్నాంపేట (నాగారం మునిసిపాలి టీ సరిహద్దు వరకు): 3.10 కి.మీ.లు. ► చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్ వరకు( వయా కరీంగూడ ): 3.80 కి.మీ.లు ► యామ్నాంపేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు: 2.60 కి.మీ.లు ► చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు: 3.30 కి.మీ.లు పోచారం మునిసిపాలిటీలో.. ► యామ్నాంపేట నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ఘట్కేసర్ మునిసిపాలిటీలో.. ► శివారెడ్డిగూడ నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి : 2.50 కి.మీ.లు. ప్రయోజనాలు ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే నగరంనుంచి శివారు ప్రాంతాలకు సాఫీ రవాణా సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రయాణదూరం, సమయం, ఇంధనవ్యయం తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గడంతో ప్రయాణాల వల్ల తలెత్తే ఆరోగ్య ఇబ్బందులూ తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం) -
Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!
జవహర్‌నగర్: మైనర్ బాలికకు మాయమాయటు చెప్పిన ఓ యువకుడు లైంగికదాడి చేశాడు. ఆ తరువాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ఏప్రిల్ నెలలో బాలిక ఇంట్లో నిద్రిస్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి పక్కన ఉన్న యువకుడు రవి (22) ఇంట్లోకి వెళ్లి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో, తల్లి కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. కొద్ది రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో స్ధానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించారు. వైద్యపరీక్షలు నిర్వహించడంతో బాలిక గర్భవతి అయినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో 14 ఏళ్ల మైనర్ బాలికకు 20 సంవత్సరాలు ఉన్నట్లు వయస్సు అధికంగా వేయించి స్కానింగ్ చేయించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ రవి కుటుంబ సభ్యులు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించి గర్భం తీయించారు. కాగా గురువారం బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: (భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం.. పిల్లలు అమ్మా అని...) -
అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు.. కానీ తెలంగాణకు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. డంప్‌యార్డ్‌ను క్యాపింగ్ చేయడం ద్వారా కొంతమేర సమస్యలు తీర్చగలిగామని, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పలువురు కార్పొరేటర్లు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘‘జవహర్‌నగర్ నగరానికి పెద్ద దిక్కుగా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం. ప్రత్యేక నిధుల మంజూరు అంశంపై దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నారు. మనకు రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు.. అదే విధంగా కేసీఆర్ సర్కారు చేపడుతన్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ... ‘‘కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం. ప్రతి వర్గానికి, ప్రతి పేదవాడికి లబ్ది చేకూరేలా ప్రభుత్వం పని చేస్తోంది. భవిష్యత్తులో కూడా కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా ఎదురొడ్డి సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపిస్తాం. ప్రజలు తప్పకుండా పనిచేసేవారిని, ఆ నాయకుడిని గెలిపించుకుంటారు. వారికి అండగా ఉంటారు. 2014 నాటి నుంచి కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా.. మళ్లీ ఆయనను సీఎం చేసుకున్నారు. ఎవరెన్ని కుప్పిగంతలు వేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. సందర్భం ఏదైనా, ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉంటారు. గతంలో చెప్పాను.. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు కాబట్టి... తప్పకుండా వారి నాయకత్వమే మనకు శ్రీరామరక్ష. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
డాడీ.. ఊపిరాడట్లేదు!
జవహర్‌నగర్: ‘డాడీ బై.. బై..! నాకు ఊపిరి ఆడక గుండె ఆగిపోయేలా ఉంది. వెంటిలేటర్ పెట్టమని బతిమిలాడినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు..’అంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన ఓ వ్యక్తి.. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు.. ఓ కరోనా మృతుడి హృదయ విదారక సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. జవహర్‌నగర్ కార్పొరేషన్లో నివాసముండే వెంకటేశ్ గౌడ్ కుమారుడు రవికుమార్ (35) తన భార్య ఇద్దరు పిల్లలతో కలసి మల్కాజిగిరి నియోజక వర్గంలోని నేరేడ్మెట్ వినాయక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 6 నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు. ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ నెల 22న రవికుమార్‌కు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక వైద్యుల సలహా మేరకు నిమ్స్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యులు ముందుగా కరోనా టెస్ట్ చేయించాలని చెప్పడంతో సమీపంలోని ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అప్పటికే తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్న రవికుమార్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 24న చేరి చికిత్స పొందుతూ 26న ఉదయం మృతి చెందాడు. వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని బీజేఆర్‌నగర్‌కు మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయించారు. అంత్యక్రియల్లో దాదాపు 30 మంది పాల్గొన్నట్లు సమాచారం. మరుసటిరోజు మృతుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ రిపోర్ట్ రావడంతో వైద్యులు, పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను ఆదివారం క్వారంటైన్ చేశారు. భయం గుప్పిట్లో జవహర్‌నగర్ ప్రజలు మృతదేహం ఖనన అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో జవహర్‌నగర్ ప్రజల్లో భయం మొదలైంది. అసలు అంత్యక్రియల్లో కుటుంబసభ్యులతో పాటు బంధువులు ఇతర వ్యక్తులు ఎందరు పాల్గొన్నారు. వారు ఎవరెవరిని కలిశారు అనే ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమై అంత్యక్రియల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కరోనా వల్లే మృతి..: ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంగళరావునగర్: కరోనా పాజిటివ్ అవడం వల్ల గుండెకు ముప్పు వాటిల్లి తద్వారా యువకుడు మృతి చెందాడని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ చెప్పారు. వెంటిలేటర్‌ను బలవంతంగా తొలగించామనేది వాస్తవం కాదని, అతనిని కాపాడటానికి శతవిధాలా తమ సిబ్బంది ప్రయత్నించారన్నారు. కరోనా గుండెకు చేరి తద్వారా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందాడని తెలిపారు. -
బాధలు భరించలేకే..
జవహర్‌నగర్: వంపుగూడలోని బ్యాంక్ కాలనీలో జరిగిన హత్య కేసులో మిస్టరీ వీడింది. వ్యసనాలకు బానిసైన పెద్ద కుమారుడిని చంపాలని తల్లిదండ్రులు కోరినందునే స్వయాన అతని సోదరుడే స్నేహితులతో కలిసి అన్నను దారుణంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. బుధవారం జవహర్‌నగర్ సీఐ సైదులు వివరాలు వెల్లడించారు. వంపుగూడలో ఉంటునన్న శ్రీనివాస్, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. శ్రీనివాస్ దంపతులు మున్సిపాలిటీలో దినసరి కూలీలుగా పనిచేసేవారు. వీరి పెద్ద కుమారుడు సాయికుమార్ (25) పెయింటింగ్ పని చేసేవాడు. మద్యానికి బానిసైన సాయికుమార్ తల్లిదండ్రులు, తమ్ముడిని తరచూ వేధించేవాడు. అతడి వేధింపులు తాళలేక కుటుంబసభ్యులు అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పనిని చిన్న కుమారుడు సందీప్‌తో చెప్పారు. ఏప్రిల్ 26న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సాయికుమార్ తల్లి మణెమ్మను తీవ్రంగా కొట్టాడు. దీనిని గుర్తించిన సందీప్ ఆగ్రహానికి లోనయ్యాడు. అనవతరం తన స్నేహితులైన ఫయాజ్, ఇబ్రహీం, గిద్యాల సందీప్‌లను కలిసి సాయికుమార్ వేధింపులు తాళలేక పోతున్నామని అతడిని అడ్డు తొలగించాలని కోరడంతో వారు అందుకు అంగీకరించారు. అనంతరం వంపుగూడలోని బ్యాంక్‌కాలనీలో పథకం ప్రకారం సాయికుమార్‌ను మద్యం తాగించి మత్తులో ఉన్న అతడి తలపై బండరాయితో మోది బీరుసీసాలతో గొంతును కోసి హత్య చేశారు. అనంతరం మే 3న శ్రీనివాస్, మణెమ్మ పోలీసులను కలిసి తమ కుమారుడు సాయికుమార్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే నిందితుల్లో ఒకరు ఈ విషయాన్ని స్ధానిక నాయకుడు పత్తి కుమార్‌కు చెప్పడంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మే 10న వంపుగూడ ప్రాంతంలో పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకుని పరిశోధన నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. నివేదిక ఆధారంగా మృతుడు సాయికుమార్‌కు గుర్తించారు. నిందితులు సందీప్, శ్రీనివాస్, మణెమ్మ, షేక్ ఫయాజ్, గిద్యాల సందీప్‌లను బుధవారం అరెస్ట్ చేఇ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు. -
డెంగీతో బాలిక మృతి
జవహర్‌నగర్: డెంగీతో ఓ బాలిక మృతిచెందిన ఘటన జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండల కేంద్రానికి చెందిన గోపి, మల్లీశ్వరీ దంపతులు బతుకుదెరువు కోసం వలస వచ్చి జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో నివాముంటున్నారు. వీరి పెద్దకూతురు గాయత్రి (4) నెలరోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా దమ్మాయిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించి డెంగీ సోకిందని వైద్యులు గుర్తించారు. అనంతరం తీవ్ర జ్వరం, వాంతులు రావడంతో ఏఎస్‌రావునగర్‌లోని అంకూర్ ఆస్పత్రికి..అక్కడి నుంచి పంజగుట్టలోని అంకూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో బాలిక గాయత్రి గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. నాలుగేళ్లకే.. నూరేళ్లు నిండాయా తల్లి.. ఈ సంవత్సరమే పాఠశాలకు వెళ్లి ఏబీసీడీలు నేర్చుకుంటున్న తమ కూతురుని చూసిమెంతో మురిసిపోయామనే.. అంతలోనే ఇలా మృత్యువాత పడుతుందను కోలేదని బాలిక తల్లిదండ్రులు గోపి, మల్లీశ్వరి రోదనలు మిన్నంటాయి. నాలుగేళ్లకే నీకు నూరేళ్లు నిండాయా... నా బంగారు కొండా.. అంటూ మల్లీశ్వరి గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. -
పర్యావరణ పరిరక్షణపై లఘుచిత్రం చిత్రీకరణ
పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై ఆదివారం జవహర్‌నగర్‌లో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే పేదల స్థితిగతులను కళ్లకుకట్టేలా కొన్ని సన్నివేశాలను చిత్ర డైరెక్టర్ వాసు చిత్రీకరించారు. బాలాజీనగర్‌లోని సబ్‌స్టేషన్ ఆవరణలోని చెత్త కుప్పలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వాసు తెలిపారు. - జవహర్‌నగర్ -
పట్టాల కోసం పోరుబాట
♦ కదం తొక్కిన జవహర్‌నగర్‌వాసులు ♦ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శామీర్‌పేట్ / జవహర్‌నగర్: ప్రభుత్వాలు మారినా పేదల జీవితాల్లో వెలుగులు లేవని ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్‌నగర్‌లోని ఇళ్లను క్రమబద్ధీకరించి, జీవో 58, 59ను అమలుపర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాలాజీనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని ఎన్నో పోరాటాలు చేశారని.. నివసించే గూడు కోసం పోరాటం చేయాల్సి రావడం విచారకరమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చి భయంగుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. నివాసహక్కు కల్పించాలని ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని ప్రకటనలు చేసి జీవో 58,59ను అమల్లోకి తెచ్చారని, జవహర్‌నగర్‌లో నివసించే పేదల ఇళ్లకు పట్టాలిచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వయంగా చెప్పడం టీఆర్ఎస్ పాలనకు అద్దం పడుతోందన్నారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేయడమే కాకుండా మరోవైపు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మిగులు భూములను స్థానికుల అవసరాలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మేడ రవి, కన్వీనర్ మస్తాన్‌బీ, కో చైర్మన్లు జి.అనురాధ, శివబాబు, వి.కిరణ్, డాక్టర్ వెంపటి బాస్కర్, సునీత, ఎండీ జావెద్, కోశాధికారి జి.చంద్రమౌళి, మీడియా ప్రతినిధులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, ఎస్కె మీరా, పాకాల డానియేల్, కోకన్వీనర్లు షేక్షావలి, సీహెచ్ బాలనర్సింహ, లక్ష్మీబాయి, రాజ్యలక్ష్మి, బి.మోహన్, అనంతలక్ష్మి, పాషామియా, పలు ప్రజా సంఘాల, కాలనీల నాయకులు పాల్గొన్నారు.