రవికుమార్
జవహర్‌నగర్: ‘డాడీ బై.. బై..! నాకు ఊపిరి ఆడక గుండె ఆగిపోయేలా ఉంది. వెంటిలేటర్ పెట్టమని బతిమిలాడినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు..’అంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన ఓ వ్యక్తి.. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు.. ఓ కరోనా మృతుడి హృదయ విదారక సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో నివాసముండే వెంకటేశ్ గౌడ్ కుమారుడు రవికుమార్ (35) తన భార్య ఇద్దరు పిల్లలతో కలసి మల్కాజిగిరి నియోజక వర్గంలోని నేరేడ్‌మెట్ వినాయక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 6 నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు.
ఈ క్రమంలో లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ నెల 22న రవికుమార్‌కు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక వైద్యుల సలహా మేరకు నిమ్స్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యులు ముందుగా కరోనా టెస్ట్ చేయించాలని చెప్పడంతో సమీపంలోని ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్‌లో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అప్పటికే తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్న రవికుమార్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 24న చేరి చికిత్స పొందుతూ 26న ఉదయం మృతి చెందాడు. వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని బీజేఆర్‌నగర్‌కు మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయించారు. అంత్యక్రియల్లో దాదాపు 30 మంది పాల్గొన్నట్లు సమాచారం. మరుసటిరోజు మృతుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ రిపోర్ట్ రావడంతో వైద్యులు, పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను ఆదివారం క్వారంటైన్ చేశారు.
భయం గుప్పిట్లో జవహర్‌నగర్ ప్రజలు
మృతదేహం ఖనన అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో జవహర్‌నగర్ ప్రజల్లో భయం మొదలైంది. అసలు అంత్యక్రియల్లో కుటుంబసభ్యులతో పాటు బంధువులు ఇతర వ్యక్తులు ఎందరు పాల్గొన్నారు. వారు ఎవరెవరిని కలిశారు అనే ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమై అంత్యక్రియల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
కరోనా వల్లే మృతి..: ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్
వెంగళరావునగర్: కరోనా పాజిటివ్ అవడం వల్ల గుండెకు ముప్పు వాటిల్లి తద్వారా యువకుడు మృతి చెందాడని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ చెప్పారు. వెంటిలేటర్‌ను బలవంతంగా తొలగించామనేది వాస్తవం కాదని, అతనిని కాపాడటానికి శతవిధాలా తమ సిబ్బంది ప్రయత్నించారన్నారు. కరోనా గుండెకు చేరి తద్వారా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment