
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరఫు లాయర్ అన్నారు. నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. సీఎం ప్రెస్‌మీట్ పెట్టి నివేదికను బయటకు ఇచ్చారన్నారు.
కేసీఆర్ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ డొమైన్‌లో కమిషన్ రిపోర్టు ఉందని.. ప్రజెంటేషన్ ద్వారా వివరాలు బయటకు ఇచ్చారని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఘోష్ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్‌లో లేదన్న ఏజీ.. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని.. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్‌లో పెడతామన్నారు. కౌంటర్ మరిన్ని వివరాలు పొందుపరుస్తామని.. ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొదన్న ఏజీ.. అసెంబ్లీలో చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ కోరారు.
కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు?. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా? ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అన్న హైకోర్టుకు.. రేపు సమాధానం చెబుతామంటూ ఏజీ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం తెలుసుకున్న విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. రేపే సమాధానం చెబుతామంటూ ఏజీ తెలపడంతో తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది.
