University of Delhi
-
సై‘కాలేజీ’కి డిమాండ్!
టెక్నాలజీ పెరిగింది.. జీవన విధానం మారుతోంది.. అన్ని రంగాల్లో ఒత్తిడి పెరిగింది.. ఫలితంగా మానసిక, పని ఒత్తిడితో ‘సైకాలజీ’ సమస్యలతో బాధపడేవారు అధికమయ్యారు. ప్రతీ ఏడుగురిలో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చెబుతోందంటే ఏ స్థాయిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయో స్పష్టమ వుతోంది. అయితే, దీనికి తగ్గట్లు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, చికిత్స చేసేందుకు ఆ స్థాయిలో సైకాలజిస్టులు మాత్రం లేరు. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి ఏడుగురు మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. దీంతో వారి కొరత పెరిగింది. అయితే ప్రస్తుతం సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య ఏకంగా 50 శాతం పెరిగింది. సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో సైకాలజీ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిష్టాత్మక కాలేజీలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ గ్రాడ్యుయేట్, డిప్లొమో, పీజీ కోర్సులు అంది స్తున్నాయి. డిగ్రీలో ఏ గ్రూపు చదివినా పీజీలో సైకాలజీని ఎంచుకో వచ్చు. గతంలో ఢిల్లీలోని రామానుజన్ కాలేజీతో పాటు యూని వర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో సైకాలజీకి 30–40 వేల అప్లికేషన్లు మాత్ర మే వచ్చేవి. 2020–21లో 50–60వేల దరఖాస్తులు వచ్చాయి. 20 22లో 60వేలు దాటాయి. విద్యార్థులు ఎక్కువగా సైకాలజీపై ఆసక్తి చూపడంతో సైకాలజీ సీట్ల సంఖ్యను కూడా ఢిల్లీ యూని వర్సిటీ పెంచింది. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూని వర్శిటీ)లో ఏటా 4–5వేల మంది చేరేవారు. ఇప్పుడు 10 వేల మంది అడ్మిషన్లు పొందుతున్నారు. అంటే సైకాలజీ చదివేవారి సంఖ్య రెట్టింపు అయింది. బెంగళూరు జైన్ డీమ్డ్ యూనివర్శిటీ, అమిటి, పూణేలోని సింబయాసిస్, యూనివర్శిటీ ఆఫ్ లక్నో, బెనారస్‌తో పాటు అన్ని వర్సిటీల్లో కూడా అడ్మిషన్లు 50% తక్కువ కాకుండా పెరిగాయి. కొన్నింటిలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఆంధ్రా, తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఈ కోర్సు ఉంది. దేశ వ్యాప్తంగా 9వేల మంది మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. కోవిడ్– 19 తర్వాత సైకాలజిస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీరికి భారీగా వేతనాలు కూడా ఇస్తున్నారు. దీంతో చాలామంది ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు. అటు వర్సిటీలు కూడా క్లినికల్ సైకాలజీ, కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, కల్చరల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, ఎడ్యు కేషన్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, న్యూరో సైకాలజీ పేరుతో ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. ► పాతికేళ్ల కిందట మానసిక రోగం అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు 10మంది ఆస్పత్రికి వెళ్తే వారిలో నలుగురిని డాక్టర్లు సైకాలజిస్టుకు సిఫార్సు చేస్తున్నారు. ► అభద్రత, ఆత్రుత, తదితర బాధలు పెరుగు తున్నాయి. దీంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. ► కార్పొరేట్ విద్య వచ్చాక పిల్లలను ఉద్యోగం సాధించే యంత్రాలుగా మాత్రమే యాజమాన్యాలు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లే శిక్షణనిస్తున్నాయి. దాంతో వారిపైనా తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ► ముఖ్యంగా కోవిడ్–19 తర్వాత భర్త లను కోల్పోయిన భార్యలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మా, నాన్నను కోల్పోయిన పిల్లలున్నారు. వీరందరూ మానసిక ఒత్తిడికి గురవు తున్నారు. అలాగే, కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి. రకరకాల కారణాలతో.. ప్రతీ కాలేజీలో సైకాలజిస్టు తప్పనిసరిగా ఉండాలని 2008లోనే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కేరళలో స్కూలు స్థాయి నుంచే సైకాలజిస్టులు ఉన్నారు. అందుకే వారి చదువు, జీవన విధానం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైకాలజీ కోర్సుకు డిమాండ్ పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. – సిరిగిరెడ్డి జయరెడ్డి, సైకాలజిస్టు, కర్నూలు -
జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్ ఆనంద్ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు అయితే సాయిబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. -
‘భగత్‌సింగ్’ కేసు తిరిగి తెరవాలి
నవన్‌షహర్: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్‌ను లాహోర్‌లో ఉరి తీసిన కేసును తిరిగి తెరిపించాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ ప్రేమ్‌సింగ్ చందుమజ్రా శనివారం కేంద్రాన్ని కోరారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్‌సింగ్ లాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకున్నా భగత్‌సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉగ్రవాదులనే నెపంతో బ్రిటిష్ అధికారులు 1931లో లాహోర్‌లో విచారించి ఉరితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పాఠ్యపుస్తకంలో భగత్‌సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సూర్య సేన్లు విప్లవాత్మక ఉగ్రవాదులంటూ ప్రచురితం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
నిరసనలతో ఇరానీ గైర్హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీ వర్సిటీలో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో.. అక్కడ శుక్రవారం తాను ప్రారంభించాల్సిన ఉర్దూ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరుకాలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో ఇరానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సదస్సును ప్రారంభించేందుకు ఆమె హాజరుకావాల్సి ఉండగా.. వేలాది మంది విద్యార్థులు సదస్సు వేదిక వద్దకు చేరి నిరసన చేపట్టారు. పునర్నియామకానికి మాంఝీ ఖండన పట్నా: రోహిత్ వేముల మృతికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌సీయూ వీసీ అప్పారావును కేంద్రం ఆ పదవిలో తిరిగి నియమించినట్లు వార్తలు వచ్చాయని.. ఆయన నియామకాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బిహార్‌లో బీజేపీ మిత్రపక్షమైన హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితన్‌రామ్ మాంఝీ మీడియాతో పేర్కొన్నారు. -
డూసూ ఎన్నికలు హాస్టల్ వసతే ప్రధాన ఎజెండా
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో హాస్టల్ వసతే తమ ప్రధాన ఎజెండా అని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ప్రకటించింది. డీయూ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ ఎజెండాను నిర్ణయించింది. ఎన్ఎస్యూఐ అందజేసిన ఫారాలను స్వీకరించిన దాదాపు 20 వేలమంది విద్యార్థులు హాస్టల్ వసతినే అందులో ప్రస్తావించారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని లేవనెత్తాల్సిందిగా తమను కోరారు. ఈ విషయాన్ని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు రోజి ఎం జాన్ వెల్లడించారు. దేశంలోని అత్యంత ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన డీయూలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రతి ఏడాది లక్షలమంది చేరుతుంటారన్నారు. అయితే అందులో కొందరికి హాస్టల్ వసతి లభించడం లేదన్నారు. డీయూ సెక్షన్ 33 చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ డీయూ వెలుపల 15 హాస్టళ్లు ఉన్నాయన్నారు. ఇంకా తొమ్మిది కళాశాలల్లో బోర్డింగ్ వసతి ఉందన్నారు. డీయూలో మొత్తం 1.8 లక్షలమంది విద్యార్థులు ఉండగా కేవలం తొమ్మిది వేల హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కారణంగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్లనే ఈ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా నిర్ణయించామని వివరించారు. లాటరీ ద్వారా కేటాయింపుకోసం కోర్టుకు బ్యాలట్ క్రమసంఖ్యలను లాటరీ ద్వారా కేటాయించాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్ఏ) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. సంబంధిత అధికారులకు తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సదరు పిటిషన్లో కోరామని ఏఐఎస్ఏ నాయకుడు అమన్ గౌతం పేర్కొన్నారు. కాగా సెప్టెంబర్ 12వ తేదీన డూసూ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఆయా విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అదే నెల మూడో తేదీలోగా అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. -
మాదకద్రవ్యాల జోలికెళ్లం
60 వేల మంది డీయూ విద్యార్థుల ప్రతిన న్యూఢిల్లీ: ప్రాంగణంలో మాదకద్రవ్యాలు, ర్యాగింగ్ జోలికెళ్లబోమంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 60 వేల మంది విద్యార్థులు ప్రతినబూనారు. నగర పోలీసుల సహకారంతో ఓ స్వచ్ఛంద సంస్థ డీయూలో విద్యార్థులకోసం ప్రత్యేకంగా రెండురోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. ‘లీడర్స్ ఫర్ టుమారో (ఎల్ఎఫ్టీ)’ అనే స్వచ్ఛంద సంస్థ ....‘ది యాంటీ డ్ర గ్స్, యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ (అడార్)’ పేరిట ఈ శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో పాల్గొన్నవారిలో ఎనిమిది వేలమంది విద్యార్థులు ఎల్ఈటీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయమై ఎల్ఈటీ దక్షిణ విభాగం అధిపతి సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ యువనాయకత్వాన్ని ప్రోత్సహించడమే తమ సంస్థ ముఖ్యోద్దేశమని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై కొత్తగా ఆయా కళాశాలల్లో చేరేవారితోపాటు ప్రస్తుత విద్యార్థులకు అవగాహన పెంపొందించడంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవిధంగా తాము ప్రోత్సహిస్తామన్నారు. ఇదే విషయమై ఎల్ఈటీ దక్షిణ ప్రాంగణం క్యాంపస్ మేనేజర్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్‌లకు దూరంగా ఉంటామంటూ 60 వేల మంది విద్యార్థులు ఈ శిబిరంలో ప్రతినబూనారన్నారు. మూడు విడతలుగా నగరంలోని మరో 150 కళాశాలల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తామన్నారు. తొలి విడతలో డీయూలో ఈ శిబిరాన్ని నిర్వహించామని, మరో రెండు శిబిరాలను కూడా నిర్వహిస్తామన్నారు. అవి ఇంద్రప్రస్థ, జామియామిలియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతాయన్నారు. -
వివాదాల వర్సిటీ!
సంపాదకీయం: మనకు ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు లేవనీ, మన చదువులు సమాజం గురించి ఆలోచించగల మేథస్సులను రూపొందించడం మాట అటుంచి...కనీసం పొట్టనింపడానికి పనికొచ్చే జ్ఞానాన్ని కూడా అందించలేకపోతున్నాయని అందరూ వాపోతుంటే హస్తినలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వేదికగా నాలుగైదు రోజులనుంచి పెద్ద ప్రహసనం సాగుతున్నది. ఒకరేమో విశ్వవిద్యాలయానికి ఉండగల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న హీరోగా కనబడుతుంటే మరొకరు ఆ స్వయంప్రతిపత్తిని కబళించబోతున్న దుష్టపాత్రలా దర్శనమిస్తున్నారు. విషాదమేమంటే...కనిపిస్తున్న ఈ రెండు పాత్రలూ నిజమైనవి కాదు. ఆ పాత్రల మధ్య సాగుతున్న పోరాటమూ వాళ్లు చెబుతున్న విలువలకు సంబంధించినది కాదు. దేశంలో మనకున్న అతి కొద్ది ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి. ఆ యూనివర్సిటీ ఏడాదిక్రితం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న వివాదానికి కేంద్ర బిందువు. ఆ కోర్సుపై అప్పట్లోనే నిరసనలు వెల్లువెత్తాయి. దాన్ని ప్రవేశపెట్ట వద్దంటూ ఆందోళనలు జరిగాయి. విద్యార్థులు మాత్రమే కాదు...విద్యా రంగ నిపుణులు సైతం ఇది సరైన నిర్ణయం కాదని ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్ల కోర్సులో చివరి సంవత్సరం ఉపాధితో ముడిపడి ఉండే ఐటీ, డాటా అనాలిసిస్ వంటి 12 రకాల కోర్సుల్లో దేనిలోనైనా ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుకల్పిస్తారు. అమెరికావంటి దేశాల్లో అమల్లో ఉంటున్న ఈ విధానాన్ని భవిష్యత్తులో దేశమంతటా పెట్టాలన్నది అప్పటి యూపీఏ సర్కారు ఆలోచన. జాతీయస్థాయిలో అమలవుతున్న 10+2+3 విద్యావిధానానికి భిన్నంగా ఢిల్లీ వర్సిటీలో దీన్ని ఎలా ప్రారంభిస్తారన్నది విద్యార్థి సంఘాల, విద్యావేత్తల అభిప్రాయం. కేవలం అమెరికా యూనివర్సిటీల వ్యాపారానికి పనికొచ్చేవిధంగా దీన్ని రుద్దుతున్నారని, పేద విద్యార్థులకు దీనివల్ల అదనపు భారం తప్ప ప్రయోజనం ఉండదని వారి వాదన. ఢిల్లీ యూనివర్సిటీ పాలక మండలిలోగానీ, పిల్లలకు చదువు చెబుతున్న అధ్యాపకులతో గానీ చర్చించ కుండా వైస్ చాన్సలర్ దినేష్ సింగ్ యూనివర్సిటీ పరిధిలో ఉండే దాదాపు 70 కళాశాలల్లో ఆ కోర్సును ప్రవేశపెట్టారు. అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆశీస్సులతో, ఆయన సలహాతో ఇదంతా జరిగిపోయిందని అందరికీ తెలుసు. ఆయన ఆశీస్సులు ఉండబట్టే విద్యార్థిలోకంనుంచి వెల్లువెత్తిన నిరసనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అప్పుడు పట్టించుకోలేదు. పైగా విశ్వవిద్యాలయానికి స్వయంప్రతిపత్తి ఉంటుందని, ఎలాంటి కోర్సులను ఉంచాలో తొలగించాలో దాని ఇష్టమని, అందులో తాము జోక్యం చేసుకోబోమని అన్నది. ఢిల్లీ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థ స్వతంత్రతకు ఆటంకం కల్పించే పాపానికి తాము ఒడిగట్టబోమని గంభీరమైన పలుకులు పలికింది. యూజీసీ పాలకమండలి సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తబోయిన యోగేంద్ర యాదవ్, ఎంఎం అన్సారీ వంటివారిని బేఖాతరు చేసింది. సరే... ఆ కోర్సు మొదలై ఏడాది దాటిపోయింది. ఈ విద్యా సంవత్సరం కూడా అడ్మిషన్లు మొదలుకావలసి ఉన్న తరుణంలో హఠాత్తుగా యూజీసీకి జ్ఞానోదయమైంది. ఆ కోర్సును రద్దుచేసి అంతకు ముందున్న మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించాలని ఢిల్లీ యూనివర్సిటీకి హుకుం జారీచేసింది. పర్యవసానంగా రెండురోజుల క్రితం ప్రారంభించాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోయింది. 2 లక్షల 70వేలమంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఆ కోర్సుకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు వీధికెక్కారు. తాము యూజీసీ హుకుంనే అంగీకరిస్తున్నట్టు 57 కళాశాలలు ప్రకటించాయి. అంతక్రితం స్వయంప్రతిపత్తిలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన యూజీసీకి ఇప్పుడేమైంది? నిరుడు యోగేంద్రయాదవ్, అన్సారీ వంటివారు చెప్పిన అభ్యంతరాలనే ఇప్పుడు తానూ వల్లిస్తున్నది ఎందుకని? కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మారి ఎన్డీయే సర్కారు వచ్చేసరికి కొత్త వైఖరి ఎందుకు తీసుకున్నది? తనకంటూ సొంత వ్యక్తిత్వమూ, అభిప్రాయాలూ ఉండవా? విద్యారంగ నిపుణులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఉన్నత శ్రేణి నిపుణులనూ, మేథావులనూ తయారుచేయాల్సిన విశ్వవిద్యాలయాలపై అజ్మాయిషీ చేసే యూజీసీ ఇంతటి బలహీన స్థితిలో మనుగడ సాగిస్తున్నదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎంతో చరిత్రగల ఢిల్లీ యూనివర్సిటీ ఈ సమస్యతో ఇప్పుడు నవ్వులపాలవుతున్నది. పాలకమండలిని సైతం సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న దినేష్సింగ్కు యూజీసీ తాజా హుకుంలో అప్రజాస్వామికత కనిపిస్తున్నది. యూజీసీకేమో వర్సిటీ నిర్ణయంలో ఇంతకుమునుపు గమనించని లొసుగులు కనబడుతున్నాయి. ఒకపక్క నాలుగేళ్ల కోర్సులో చేరిన విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగటిల్లుతుంటే...మొత్తం అడ్మిషన్ల వ్యవహారం తాజా వివాదంతో ఎటుపోతుందోనని కొత్త విద్యార్థులు ఆందోళనపడుతుంటే వైస్ చాన్సలర్ రాజీనామా చేశారన్న వదంతులు వ్యాపించాయి. ఆయన తనంత తాను బయటికొచ్చి యూజీసీ నిరంకుశత్వానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు చెబితే అందరూ ఆ నిర్ణయాన్ని హర్షించేవారు. ఎందుకంటే... నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకించినవారు సైతం యూజీసీ ఇలా ప్రభుత్వాలకు తోకగా మారి అభిప్రాయాలు మార్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి ప్రవర్తన భవిష్యత్తులో ప్రమాదకర పర్యవసానాలకు దారితీసినా తీయొచ్చని భయపడుతున్నారు. విజ్ఞానకేంద్రాలుగా ప్రకాశించవలసిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు ఇలా రాజకీయ వివాదంలో కూరుకుపోవడం విచారకరమైన పరిణామం. -
డీయూకు విదేశీ విద్యార్థుల క్యూ
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. వివిధ కోర్సుల కోసం విదేశీ విద్యార్థులుకూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 2,098 మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకే వీరిలో అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,259 మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు, 609 మంది నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని డీయూ ఫారిన్ రిజిస్ట్రీ విభాగం అధిపతి కౌర్ బస్రా వెల్లడించారు. వీరిలో టిబెటన్లు 475 మంది కాగా 237 మంది నేపాలీయులని ఆయన చెప్పారు. గత ఏడాది 248 మంది టిబెటన్లు, 222 మంది నేపాలీయులు దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ‘ఇక దక్షిణ కొరియాకు చెందిన విద్యార్థులు సైతం డీయూలో వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు నగరానికి వచ్చారని బస్రా చెప్పారు. వారికి కొరియా రాయబార కార్యాలయం అవసరమైన వసతులు కల్పిస్తోందన్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదన్నారు. అయితే దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన విద్యార్థినులు సరైన వసతి దొరక్క నానాఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారికి తగు వసతులు కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. దక్షిణ కొరియాకు చెందిన 54 మంది విద్యార్థులు గత ఏడాది తమ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరారన్నారు. -
నాలుగేళ్ల కోర్సుపై నిరసన వ్యతిరేకోద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: ఒకవైపు నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)కు ప్రవేశ ప్రక్రియ జరుతుండగా, మరోవైపు ఈ కోర్సు ఉపసంహరణకోసం చేపట్టిన ఉద్యమం మరింత ఊపందుకుంది.ఈ కోర్సు విషయంలో గత సంవత్సరం తటస్థంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూ) ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణంలో శుక్రవారం నుంచి నిరాహార దీక్షకు దిగింది. ఈ విషయమై ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే దీక్షా శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘గత ఏడాది కొత్తగా ఈ కోర్సును ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రవేశపెట్టింది. అది ఏవిధంగా ఉంటుందనే విషయం సరిగా అర్ధం కాకపోవడంతో మేము నిరసించడంగానీ మద్దతు పలకడం చేయకుండా ఉండిపోయాం. అయితే ఈ కోర్సును ప్రవేశపెట్టి ఏడాది కాలం గడిచిపోయింది. దీనిపై ఓ అధ్యయనం చేశాం. ఇది విద్యార్థులకు అంత ఉపయుక్తం కాదనే విషయం ఆ అధ్యయనంలో తేలింది. మరోవైపు విద్యార్థులు కూడా ఈ విషయంలో సంతృప్తి చెందడం లేదు’ అని అన్నారు. ఇదిలాఉంచితే ఈ కోర్సుకు వ్యతిరేకంగా కొంతకాలంగా ప్రతిరోజూ ఆందోళనకు దిగుతున్న ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శుక్రవారం ఉదయం కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ విషయమై ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సాకేత్ బహుగుణ మీడియాతో మాట్లాడుతూ ‘డీయూ కోర్సును ప్రారంభించిననాటినుంచీ తాము ఆందోళన చేస్తూనే ఉన్నాం. యూజీసీ అత్యున్నత ప్రాధికార సంస్థ. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం’ అని అన్నారు. మరోవైపు ఈ కోర్సుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా), ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) సైతం ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి విదతమే. ఇదిలాఉంచితే ‘సేవ్ డీయూ’ పేరిట ఏడాదికాలంగా మరికొంతమంది ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్న అభయ్ దేవ్ అనే విద్యార్థి మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన మరోసారి ఆందోళనకు దిగనున్నామన్నారు. ఇటువంటి సత్తాలేని కోర్సుల వల్ల విద్యార్థులు మున్ముందు జీవితంలో బాధితులు కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆందోళన చేస్తున్నామన్నారు. కాగా ఈ కోర్సు రద్దుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తి చూపుతున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఉద్యమ ఉధృతికి దోహదం చేస్తున్నాయి. -
ప్రొఫెసర్ సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలి
హైదరాబాద్: ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.నాగాసాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని పౌర, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ సంఘాల నాయకులు బొజ్జాతారకం, రవిచంద్ర, దుడ్డు ప్రభాకర్, ప్రొఫెసర్.లక్ష్మణ్, బల్లా రవీంద్రనాథ్, చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ వికలాంగుడైన సాయిబాబాను పోలీసులు చ ట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. సాయిబాబా కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మావోలు, టైస్ట్లతో సంబంధాలున్నాయని ప్రచారం చేస్తూ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సాయిబాబా ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మద్దతు కూడగడుతున్నారనే సాకుతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సాయిబాబా రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) సంయుక్త కార్యదర్శిగా ఉండి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, అందుకే ప్రభుత్వం కుట్రపన్ని పోలీసులతో కిడ్నాప్ చేయించిందన్నారు. సాయిబాబాను విడుదల చేసే వరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సాయిబాబా తల్లి సూర్యవతి మాట్లాడుతూ వికలాంగుడైన తన కూమారుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని, వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నకేసు అయితేనే పరిధి దాటిరాని పోలీసులు గడ్చిరౌలి నుండి ఢిల్లీకి వెళ్లి ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కోటి, రివేరా తదితరులు పాల్గొన్నారు. -
'పవిత్ర' ఆందోళలనకు మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పవిత్ర ఆత్మాహుతి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడంలో నగర పోలీసులు ప్రదర్శిస్తున్న తాత్సారాన్ని నిరసిస్తూ ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసొసియేషన్, ఢిల్లీ యూనివర్సిటీ అండ్ కాలేజీ కర్మచారి యూనియన్, విద్యార్థుల యూనియన్లు కదంతొక్కాయి. వీరు చేసిన ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొని పూర్తి మద్దతును ప్రకటించారు. ఢిల్లీ గేట్ సమీపంలోని సహిది పార్క్ నుంచి ఐటీవోలోని ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు వందలాది మంది ర్యాలీగా వెళ్లారు. ల్యాబ్ అసిస్టెంట్ పవిత్ర భరద్వాజ ఆత్మాహుతికి కారణమైన భీమ్రావ్ అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపల్ జీకే అరోరాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు నింపాదిగా వ్యవహరించడంపై మండిపడ్డారు. పవిత్రకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీ ప్రిన్సిపల్ ఎక్కువ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో దర్యాప్తుపై ఏమైనా ప్రభావం చూపుతున్నాడా అని ప్రశ్నించారు. ప్రిన్సిపల్‌పై వచ్చిన ఆరోపణలతో పాటు పవిత్ర ఆత్మహత్య కేసులో స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాధారణ పరిస్థితుల్లో మరణ వాంగ్మూలమనేది గట్టి ఆధారమన్నారు. పవిత్ర ఇచ్చిన మరణ వాంగ్మూలమున్న పోలీసులు ప్రిన్సిపల్‌ను వెంటనే అరెస్టు చేసి ఉండాల్సిందన్నారు. అయితే దురదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదని తెలిపారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికీ ఎందుకూ ప్రశ్నించలేదన్నారు. ఇది ప్రత్యేక కేసేమీ కాదని, ప్రిన్సిపల్‌ను అరెస్టు చేయాలని సామాజిక కార్యకర్త కవిత కృష్ణన్ డిమాండ్ చేశారు. ‘ఇదొక్క కేసే కాదు. అనేక కేసుల జాబితా ఉంది. ఈ కేసును కావాలనే పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నార’ని కృష్ణన్ మండిపడ్డారు. అనంతరం కేజ్రీవాల్‌తో పాటు ఇతర బృందం సభ్యులు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీని కలిసి పవిత్ర కేసులో న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కేసులో న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, యమునా విహార్‌లోని బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ల్యాబొరేటరీ అసిస్టెంట్‌గా పనిచేసే 35 ఏళ్ల పవిత్ర ప్రిన్సిపల్ జీకే అరోరా లైంగికంగా వేధించాడని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ సెక్రటేరియట్‌లోని గేట్ నంబర్ 6 వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆమెను ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి ఈ నెల ఏడున మరణించింది. అయితే ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్లో భీమ్రావ్ అంబేద్కర్ కాలేజ్ ప్రిన్సిపల్ జీకే అరోరాతో పాటు మరో వ్యక్తి శారీరకంగా, మానసికంగా వేధింపులకు దిగడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని పేర్కొంది. అయితే పవిత్ర భరద్వాజ్ మరణించడంతో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు జీకే అరోరాను ప్రిన్సిపల్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి పవిత్ర మృతిపై నిరసనలు వ్యక్తమవుతుండటంతో రిటైర్డ్ జడ్జి బీఎల్ గార్గ్ నేతృత్వంలోని కమిటీ విచారణను పూర్తి చేసి వారంలోగా నివేదిక సమర్పించాలని సర్కార్ బుధవారం ఆదేశించింది. ఘటనకు కారణాలు, పవిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి సమగ్ర నివేదికను వారంలోపు సమర్పించాలని సూచించింది. ఈ మేరకు ఇప్పటికే సదరు కమిటీ పవిత్ర కేసులో విచారణను వేగిరం చేసింది. ఈ కేసుతో సంబంధంమున్న వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. -
నిఘా నీడలో డీయూ ఎన్నికలు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) విద్యార్థి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేం దుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు యూనివర్సిటీలో ఎన్నికల కార్యకలాపాలను చిత్రీకరించేందుకు వీడియోగ్రాఫర్లను అద్దెకు నియమించడంతోపాటు వర్సిటీ పరిధిలో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటుచేయాలని వర్సిటీ పాలనా విభాగం నిర్ణయించింది. ఈ నెల 13న జరుగనున్న ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నిర్వహణపై అధికారులు సమావేశం నిర్వహించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు వర్సిటీ వైస్ చాన్సలర్ దినేష్ సింగ్ నేతృత్వంలో ఎలక్షన్, రిటర్నింగ్ అధికారులను నియమించాలని నిర్ణయించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను ఎలక్షన్ అధికారులు భద్రం చేస్తారు. దీని కోసం వీడియోగ్రాఫర్లను అద్దెకు నియమించనున్నారు. కళాశాల గేటు వద్ద, పోలింగ్ జరిగే గదుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నట్లు చీఫ్ ఎలక్షన్ అధికారి అశోక్ వోహ్రా తెలిపారు. వర్సిటీలో ఎన్నికల విషయమై రాజకీయ నాయకులైన సోనియాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్‌కారత్, బృందాకారత్ తదితరులకు రాతపూర్వకంగా సమాచారమిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల రోజు కళాశాల గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు కూడా ఆయా కళాశాలల్లో ఎన్నికల ప్రచార నిమిత్తం సదరు కళాశాల ప్రిన్సిపాల్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అలాగే ప్రచారం సమయంలో అభ్యర్థి వెంట మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారన్నారు. ప్రచారానికి సంబంధించిన పోస్టర్లను నిషేధిత ప్రాంతాల్లో అంటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశానికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, పలువురు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. నేటి నుంచి ‘కాలేజ్ ఆన్ వీల్స్’ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు వారం పాటు నిర్వహించనున్న ‘విద్యా శిక్షణ యాత్ర’ సోమవారం ప్రారంభం కానున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ‘కాలేజ్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రతి ఏడాదిలాగే ఈసారి జ్ఞానోదయ -3 రైలు యాత్ర నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ యాత్రలో లండన్, ఎడిన్‌బర్గ్‌కు చెందిన 150 మందితోపాటు 900 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు ప్రయాణించే ఈ రైలులో ఇంటర్నెట్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. ఇది అమృత్సర్, లూధియానా, చండీగఢ్, కురుక్షేత్రలో ఆగుతుందన్నారు. ఈ యాత్ర వల్ల విద్యార్థులకు పంజాబ్ గ్రామీణ, వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధిని దగ్గర నుంచి చూసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.