'పవిత్ర' ఆందోళలనకు మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్ | Kejriwal joins protest against Delhi Police in Pavitra Bharadwaj case | Sakshi
Sakshi News home page

'పవిత్ర' ఆందోళలనకు మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్

Published Fri, Oct 11 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

Kejriwal joins protest against Delhi Police in Pavitra Bharadwaj case

న్యూఢిల్లీ: పవిత్ర ఆత్మాహుతి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడంలో నగర పోలీసులు ప్రదర్శిస్తున్న తాత్సారాన్ని నిరసిస్తూ ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసొసియేషన్, ఢిల్లీ యూనివర్సిటీ అండ్ కాలేజీ కర్మచారి యూనియన్, విద్యార్థుల యూనియన్‌లు కదంతొక్కాయి. వీరు చేసిన ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొని పూర్తి మద్దతును ప్రకటించారు. ఢిల్లీ గేట్ సమీపంలోని సహిది పార్క్ నుంచి ఐటీవోలోని ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు వందలాది మంది ర్యాలీగా వెళ్లారు. ల్యాబ్ అసిస్టెంట్ పవిత్ర భరద్వాజ ఆత్మాహుతికి కారణమైన భీమ్‌రావ్ అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపల్ జీకే అరోరాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.  
 
పోలీసులు నింపాదిగా వ్యవహరించడంపై మండిపడ్డారు. పవిత్రకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఆయన డిమాండ్ చేశారు.   ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీ ప్రిన్సిపల్ ఎక్కువ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో దర్యాప్తుపై ఏమైనా ప్రభావం చూపుతున్నాడా అని ప్రశ్నించారు. ప్రిన్సిపల్‌పై వచ్చిన ఆరోపణలతో పాటు పవిత్ర ఆత్మహత్య కేసులో స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాధారణ పరిస్థితుల్లో మరణ వాంగ్మూలమనేది గట్టి ఆధారమన్నారు. పవిత్ర ఇచ్చిన మరణ వాంగ్మూలమున్న పోలీసులు ప్రిన్సిపల్‌ను వెంటనే అరెస్టు చేసి ఉండాల్సిందన్నారు. అయితే దురదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదని తెలిపారు. కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికీ ఎందుకూ ప్రశ్నించలేదన్నారు. ఇది ప్రత్యేక కేసేమీ కాదని, ప్రిన్సిపల్‌ను అరెస్టు చేయాలని సామాజిక కార్యకర్త కవిత కృష్ణన్ డిమాండ్ చేశారు. ‘ఇదొక్క కేసే కాదు. అనేక కేసుల జాబితా ఉంది. ఈ కేసును కావాలనే పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నార’ని కృష్ణన్ మండిపడ్డారు. అనంతరం కేజ్రీవాల్‌తో పాటు ఇతర బృందం సభ్యులు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీని కలిసి పవిత్ర కేసులో న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
 
ఈ కేసులో న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, యమునా విహార్‌లోని బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ల్యాబొరేటరీ అసిస్టెంట్‌గా పనిచేసే 35 ఏళ్ల పవిత్ర  ప్రిన్సిపల్ జీకే అరోరా లైంగికంగా వేధించాడని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ సెక్రటేరియట్‌లోని గేట్ నంబర్ 6 వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆమెను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి ఈ నెల ఏడున మరణించింది. అయితే ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్‌లో భీమ్‌రావ్ అంబేద్కర్ కాలేజ్ ప్రిన్సిపల్ జీకే అరోరాతో పాటు మరో వ్యక్తి శారీరకంగా, మానసికంగా వేధింపులకు దిగడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని పేర్కొంది. అయితే పవిత్ర భరద్వాజ్ మరణించడంతో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. 
 
ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు జీకే అరోరాను ప్రిన్సిపల్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి పవిత్ర మృతిపై నిరసనలు వ్యక్తమవుతుండటంతో రిటైర్డ్ జడ్జి బీఎల్ గార్గ్ నేతృత్వంలోని కమిటీ విచారణను పూర్తి చేసి వారంలోగా నివేదిక సమర్పించాలని సర్కార్ బుధవారం ఆదేశించింది. ఘటనకు కారణాలు, పవిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి సమగ్ర నివేదికను వారంలోపు సమర్పించాలని సూచించింది. ఈ మేరకు ఇప్పటికే సదరు కమిటీ పవిత్ర కేసులో విచారణను వేగిరం చేసింది. ఈ కేసుతో సంబంధంమున్న వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement