నిరసనలతో ఇరానీ గైర్హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీ వర్సిటీలో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో.. అక్కడ శుక్రవారం తాను ప్రారంభించాల్సిన ఉర్దూ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరుకాలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో ఇరానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సదస్సును ప్రారంభించేందుకు ఆమె హాజరుకావాల్సి ఉండగా.. వేలాది మంది విద్యార్థులు సదస్సు వేదిక వద్దకు చేరి నిరసన చేపట్టారు.
పునర్నియామకానికి మాంఝీ ఖండన
పట్నా: రోహిత్ వేముల మృతికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌సీయూ వీసీ అప్పారావును కేంద్రం ఆ పదవిలో తిరిగి నియమించినట్లు వార్తలు వచ్చాయని.. ఆయన నియామకాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బిహార్‌లో బీజేపీ మిత్రపక్షమైన హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితన్‌రామ్ మాంఝీ మీడియాతో పేర్కొన్నారు.