న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో హాస్టల్ వసతే తమ ప్రధాన ఎజెండా అని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) ప్రకటించింది. డీయూ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ ఎజెండాను నిర్ణయించింది. ఎన్‌ఎస్‌యూఐ అందజేసిన ఫారాలను స్వీకరించిన దాదాపు 20 వేలమంది విద్యార్థులు హాస్టల్ వసతినే అందులో ప్రస్తావించారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని లేవనెత్తాల్సిందిగా తమను కోరారు.
ఈ విషయాన్ని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు రోజి ఎం జాన్ వెల్లడించారు. దేశంలోని అత్యంత ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన డీయూలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రతి ఏడాది లక్షలమంది చేరుతుంటారన్నారు. అయితే అందులో కొందరికి హాస్టల్ వసతి లభించడం లేదన్నారు. డీయూ సెక్షన్ 33 చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ డీయూ వెలుపల 15 హాస్టళ్లు ఉన్నాయన్నారు. ఇంకా తొమ్మిది కళాశాలల్లో బోర్డింగ్ వసతి ఉందన్నారు. డీయూలో మొత్తం 1.8 లక్షలమంది విద్యార్థులు ఉండగా కేవలం తొమ్మిది వేల హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కారణంగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్లనే ఈ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా నిర్ణయించామని వివరించారు.
లాటరీ ద్వారా కేటాయింపుకోసం కోర్టుకు
బ్యాలట్ క్రమసంఖ్యలను లాటరీ ద్వారా కేటాయించాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్‌ఏ) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. సంబంధిత అధికారులకు తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సదరు పిటిషన్‌లో కోరామని ఏఐఎస్‌ఏ నాయకుడు అమన్ గౌతం పేర్కొన్నారు. కాగా సెప్టెంబర్ 12వ తేదీన డూసూ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఆయా విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అదే నెల మూడో తేదీలోగా అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
డూసూ ఎన్నికలు హాస్టల్ వసతే ప్రధాన ఎజెండా
Published Tue, Aug 26 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement