నిఘా నీడలో డీయూ ఎన్నికలు
Published Mon, Sep 2 2013 1:49 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) విద్యార్థి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేం దుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు యూనివర్సిటీలో ఎన్నికల కార్యకలాపాలను చిత్రీకరించేందుకు వీడియోగ్రాఫర్లను అద్దెకు నియమించడంతోపాటు వర్సిటీ పరిధిలో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటుచేయాలని వర్సిటీ పాలనా విభాగం నిర్ణయించింది. ఈ నెల 13న జరుగనున్న ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నిర్వహణపై అధికారులు సమావేశం నిర్వహించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు వర్సిటీ వైస్ చాన్సలర్ దినేష్ సింగ్ నేతృత్వంలో ఎలక్షన్, రిటర్నింగ్ అధికారులను నియమించాలని నిర్ణయించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను ఎలక్షన్ అధికారులు భద్రం చేస్తారు. దీని కోసం వీడియోగ్రాఫర్లను అద్దెకు నియమించనున్నారు.
కళాశాల గేటు వద్ద, పోలింగ్ జరిగే గదుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నట్లు చీఫ్ ఎలక్షన్ అధికారి అశోక్ వోహ్రా తెలిపారు. వర్సిటీలో ఎన్నికల విషయమై రాజకీయ నాయకులైన సోనియాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్‌కారత్, బృందాకారత్ తదితరులకు రాతపూర్వకంగా సమాచారమిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల రోజు కళాశాల గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు కూడా ఆయా కళాశాలల్లో ఎన్నికల ప్రచార నిమిత్తం సదరు కళాశాల ప్రిన్సిపాల్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అలాగే ప్రచారం సమయంలో అభ్యర్థి వెంట మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారన్నారు. ప్రచారానికి సంబంధించిన పోస్టర్లను నిషేధిత ప్రాంతాల్లో అంటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశానికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, పలువురు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు హాజరయ్యారు.
నేటి నుంచి ‘కాలేజ్ ఆన్ వీల్స్’
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు వారం పాటు నిర్వహించనున్న ‘విద్యా శిక్షణ యాత్ర’ సోమవారం ప్రారంభం కానున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ‘కాలేజ్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రతి ఏడాదిలాగే ఈసారి జ్ఞానోదయ -3 రైలు యాత్ర నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ యాత్రలో లండన్, ఎడిన్‌బర్గ్‌కు చెందిన 150 మందితోపాటు 900 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు ప్రయాణించే ఈ రైలులో ఇంటర్నెట్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. ఇది అమృత్‌సర్, లూధియానా, చండీగఢ్, కురుక్షేత్రలో ఆగుతుందన్నారు. ఈ యాత్ర వల్ల విద్యార్థులకు పంజాబ్ గ్రామీణ, వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధిని దగ్గర నుంచి చూసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement