సంపాదకీయం: మనకు ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు లేవనీ, మన చదువులు సమాజం గురించి ఆలోచించగల మేథస్సులను రూపొందించడం మాట అటుంచి...కనీసం పొట్టనింపడానికి పనికొచ్చే జ్ఞానాన్ని కూడా అందించలేకపోతున్నాయని అందరూ వాపోతుంటే హస్తినలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వేదికగా నాలుగైదు రోజులనుంచి పెద్ద ప్రహసనం సాగుతున్నది. ఒకరేమో విశ్వవిద్యాలయానికి ఉండగల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న హీరోగా కనబడుతుంటే మరొకరు ఆ స్వయంప్రతిపత్తిని కబళించబోతున్న దుష్టపాత్రలా దర్శనమిస్తున్నారు. విషాదమేమంటే...కనిపిస్తున్న ఈ రెండు పాత్రలూ నిజమైనవి కాదు. ఆ పాత్రల మధ్య సాగుతున్న పోరాటమూ వాళ్లు చెబుతున్న విలువలకు సంబంధించినది కాదు. దేశంలో మనకున్న అతి కొద్ది ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి. ఆ యూనివర్సిటీ ఏడాదిక్రితం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న వివాదానికి కేంద్ర బిందువు. ఆ కోర్సుపై అప్పట్లోనే నిరసనలు వెల్లువెత్తాయి. దాన్ని ప్రవేశపెట్ట వద్దంటూ ఆందోళనలు జరిగాయి. విద్యార్థులు మాత్రమే కాదు...విద్యా రంగ నిపుణులు సైతం ఇది సరైన నిర్ణయం కాదని ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్ల కోర్సులో చివరి సంవత్సరం ఉపాధితో ముడిపడి ఉండే ఐటీ, డాటా అనాలిసిస్ వంటి 12 రకాల కోర్సుల్లో దేనిలోనైనా ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుకల్పిస్తారు.
అమెరికావంటి దేశాల్లో అమల్లో ఉంటున్న ఈ విధానాన్ని భవిష్యత్తులో దేశమంతటా పెట్టాలన్నది అప్పటి యూపీఏ సర్కారు ఆలోచన. జాతీయస్థాయిలో అమలవుతున్న 10+2+3 విద్యావిధానానికి భిన్నంగా ఢిల్లీ వర్సిటీలో దీన్ని ఎలా ప్రారంభిస్తారన్నది విద్యార్థి సంఘాల, విద్యావేత్తల అభిప్రాయం. కేవలం అమెరికా యూనివర్సిటీల వ్యాపారానికి పనికొచ్చేవిధంగా దీన్ని రుద్దుతున్నారని, పేద విద్యార్థులకు దీనివల్ల అదనపు భారం తప్ప ప్రయోజనం ఉండదని వారి వాదన. ఢిల్లీ యూనివర్సిటీ పాలక మండలిలోగానీ, పిల్లలకు చదువు చెబుతున్న అధ్యాపకులతో గానీ చర్చించ కుండా వైస్ చాన్సలర్ దినేష్ సింగ్ యూనివర్సిటీ పరిధిలో ఉండే దాదాపు 70 కళాశాలల్లో ఆ కోర్సును ప్రవేశపెట్టారు.
అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆశీస్సులతో, ఆయన సలహాతో ఇదంతా జరిగిపోయిందని అందరికీ తెలుసు. ఆయన ఆశీస్సులు ఉండబట్టే విద్యార్థిలోకంనుంచి వెల్లువెత్తిన నిరసనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అప్పుడు పట్టించుకోలేదు. పైగా విశ్వవిద్యాలయానికి స్వయంప్రతిపత్తి ఉంటుందని, ఎలాంటి కోర్సులను ఉంచాలో తొలగించాలో దాని ఇష్టమని, అందులో తాము జోక్యం చేసుకోబోమని అన్నది. ఢిల్లీ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థ స్వతంత్రతకు ఆటంకం కల్పించే పాపానికి తాము ఒడిగట్టబోమని గంభీరమైన పలుకులు పలికింది. యూజీసీ పాలకమండలి సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తబోయిన యోగేంద్ర యాదవ్, ఎంఎం అన్సారీ వంటివారిని బేఖాతరు చేసింది. సరే... ఆ కోర్సు మొదలై ఏడాది దాటిపోయింది.
ఈ విద్యా సంవత్సరం కూడా అడ్మిషన్లు మొదలుకావలసి ఉన్న తరుణంలో హఠాత్తుగా యూజీసీకి జ్ఞానోదయమైంది. ఆ కోర్సును రద్దుచేసి అంతకు ముందున్న మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించాలని ఢిల్లీ యూనివర్సిటీకి హుకుం జారీచేసింది. పర్యవసానంగా రెండురోజుల క్రితం ప్రారంభించాల్సిన అడ్మిషన్‌ల ప్రక్రియ ఆగిపోయింది. 2 లక్షల 70వేలమంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఆ కోర్సుకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు వీధికెక్కారు. తాము యూజీసీ హుకుంనే అంగీకరిస్తున్నట్టు 57 కళాశాలలు ప్రకటించాయి. అంతక్రితం స్వయంప్రతిపత్తిలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన యూజీసీకి ఇప్పుడేమైంది? నిరుడు యోగేంద్రయాదవ్, అన్సారీ వంటివారు చెప్పిన అభ్యంతరాలనే ఇప్పుడు తానూ వల్లిస్తున్నది ఎందుకని? కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మారి ఎన్డీయే సర్కారు వచ్చేసరికి కొత్త వైఖరి ఎందుకు తీసుకున్నది? తనకంటూ సొంత వ్యక్తిత్వమూ, అభిప్రాయాలూ ఉండవా? విద్యారంగ నిపుణులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఉన్నత శ్రేణి నిపుణులనూ, మేథావులనూ తయారుచేయాల్సిన విశ్వవిద్యాలయాలపై అజ్మాయిషీ చేసే యూజీసీ ఇంతటి బలహీన స్థితిలో మనుగడ సాగిస్తున్నదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ఎంతో చరిత్రగల ఢిల్లీ యూనివర్సిటీ ఈ సమస్యతో ఇప్పుడు నవ్వులపాలవుతున్నది. పాలకమండలిని సైతం సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న దినేష్‌సింగ్‌కు యూజీసీ తాజా హుకుంలో అప్రజాస్వామికత కనిపిస్తున్నది. యూజీసీకేమో వర్సిటీ నిర్ణయంలో ఇంతకుమునుపు గమనించని లొసుగులు కనబడుతున్నాయి. ఒకపక్క నాలుగేళ్ల కోర్సులో చేరిన విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగటిల్లుతుంటే...మొత్తం అడ్మిషన్‌ల వ్యవహారం తాజా వివాదంతో ఎటుపోతుందోనని కొత్త విద్యార్థులు ఆందోళనపడుతుంటే వైస్ చాన్సలర్ రాజీనామా చేశారన్న వదంతులు వ్యాపించాయి.
ఆయన తనంత తాను బయటికొచ్చి యూజీసీ నిరంకుశత్వానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు చెబితే అందరూ ఆ నిర్ణయాన్ని హర్షించేవారు. ఎందుకంటే... నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకించినవారు సైతం యూజీసీ ఇలా ప్రభుత్వాలకు తోకగా మారి అభిప్రాయాలు మార్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి ప్రవర్తన భవిష్యత్తులో ప్రమాదకర పర్యవసానాలకు దారితీసినా తీయొచ్చని భయపడుతున్నారు. విజ్ఞానకేంద్రాలుగా ప్రకాశించవలసిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు ఇలా రాజకీయ వివాదంలో కూరుకుపోవడం విచారకరమైన పరిణామం.
వివాదాల వర్సిటీ!
Published Thu, Jun 26 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM
Advertisement
Advertisement