Under graducation courses
-
ఉన్నత విద్యలో ‘షేరింగ్’
సాక్షి, అమరావతి: సెంట్రల్ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోని వనరులను సద్వినియోగం చేయడం, సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది. సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వనరులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వనరులను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది. రెట్టింపు ఫలితాలు ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలుచేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాసంస్థలు పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది. ప్రస్తుతం ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగేఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరుతుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్సైట్ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకోవాలనుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సంస్థల మధ్య ఒప్పందాలు ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకోవాలని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్‌టేబుల్‌ను రూపొందించి ఆ ప్రకారం కార్యక్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ విధానంతో విద్యార్థులకు మేలు.. తరగతి గదులు, మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్ అంశాలకు సంబంధించి ఆన్లైన్ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్‌లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఖర్చులపై ముందుగానే ప్రణాళిక వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలుచేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణయించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. -
యూజీ.. పీజీ విద్యపై సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై సమగ్ర సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) స్థాయిల్లో ప్రస్తుత పరిస్థితి, విద్యాసంస్థల్లో వనరులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు, మారుతున్న సమాజ అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలోనే వసతులు కల్పించి విద్యార్థులను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతోంది. అనుభవం గల ప్రముఖ సంస్థలతో సర్వే చేయిస్తారు. ఇందుకోసం ఉన్నత విద్యామండలి టెండర్లు్ల పిలవడం, ఇతర కార్యాచరణకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఈ సర్వే జరుగుతుంది. ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల్లో ప్రస్తుత పరిస్థితిని సశాస్త్రీయంగా విశ్లేషిస్తారు. ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు! యూజీ, పీజీ కోర్సులు చేసేందుకు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయాన్ని సర్వేలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. దీనిని గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా, మిశ్రమ విధానంలో చేపడతారు. ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక, లింగ తదితర విభాగాల వారీగా సర్వే కొనసాగిస్తారు. ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, కేస్ స్టడీలు సర్వేలో ఉంటాయి. విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ అధికారులు, జిల్లా, రాష్టస్థాయి నియామక అధికారులు, పూర్వ విద్యార్థులు తదితరులందరి అభిప్రాయాలు తీసుకుంటారు. సర్వే పూర్తిగా హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతుంది. సర్వేను 3 నెలల్లో పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సర్వే పరిధిలోకి వచ్చే సంస్థలివీ.. రాష్ట్రంలోని యూనివర్సిటీలు (ఆర్జీయూకేటీ, ఐఐఐటీలు సహా), యూనివర్సిటీల పీజీ సెంటర్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు, మైనార్టీ కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజీలు, బీఈడీ–ఎంఈడీ కాలేజీలు, మహిళా కాలేజీలు, లా కాలేజీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు శాంపిల్ సైజ్ 12 శాతానికి తగ్గకూడదు సర్వేలో జనరల్, టెక్నికల్, లా, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ తదితర విభాగాల విద్యార్థుల సంఖ్యలో 12 శాతానికి తగ్గకుండా శాంపిళ్లను తీసుకుంటారు. ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులందరి భాగస్వామ్యం ఇందులో ఉండాలి. ఇందులోనూ 8 శాతం ఆన్లైన్ ద్వారా, 4 శాతం ఆఫ్‌లైన్ ద్వారా చేపట్టాలి. సర్వే శాంపిల్స్‌లో ఎస్సీలు 15, ఎస్టీలు 7.5, బీసీలు 25 శాతం ఉండాలి. మహిళలు, పురుçషుల శాతం సగం చొప్పున ఉండాలి. జిల్లా యూనిట్‌గా ఈ సర్వే సాగాలి. ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా మూడేసి బృంద చర్చలు చేపట్టాలి. ఇవి విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల వారీగా ఉండాలి. ప్రవేశాలు.. విద్యార్థుల పరిస్థితిపైనా అధ్యయనం ► గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలు, విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులలో పరిశ్రమలపై అవగాహన ఎలా ఉంది, రాష్ట్రస్థాయిలోనే వారికి పారిశ్రామిక ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశాలేమిటనేది కూడా అంచనా వేయాలి. విద్యార్థుల్లో నైపుణ్యాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రస్తుత అవసరాలకు తగ్గ నైపుణ్యాలు లేకపోతే ఆ గ్యాప్ ఎంత? అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇవ్వాలి. ►విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంపై కారణాలు. వారికి ఇక్కడే ఉన్నత విద్యావకాశాలకు వీలైన ఏర్పాట్లపై సూచనలు. ఇలా వివిధ అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించి.. రానున్న ఐదేళ్లలో ఉన్నత విద్యారంగంలో చేపట్టాల్సిన విధాన కార్యక్రమాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. -
వివాదాల వర్సిటీ!
సంపాదకీయం: మనకు ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు లేవనీ, మన చదువులు సమాజం గురించి ఆలోచించగల మేథస్సులను రూపొందించడం మాట అటుంచి...కనీసం పొట్టనింపడానికి పనికొచ్చే జ్ఞానాన్ని కూడా అందించలేకపోతున్నాయని అందరూ వాపోతుంటే హస్తినలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వేదికగా నాలుగైదు రోజులనుంచి పెద్ద ప్రహసనం సాగుతున్నది. ఒకరేమో విశ్వవిద్యాలయానికి ఉండగల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న హీరోగా కనబడుతుంటే మరొకరు ఆ స్వయంప్రతిపత్తిని కబళించబోతున్న దుష్టపాత్రలా దర్శనమిస్తున్నారు. విషాదమేమంటే...కనిపిస్తున్న ఈ రెండు పాత్రలూ నిజమైనవి కాదు. ఆ పాత్రల మధ్య సాగుతున్న పోరాటమూ వాళ్లు చెబుతున్న విలువలకు సంబంధించినది కాదు. దేశంలో మనకున్న అతి కొద్ది ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి. ఆ యూనివర్సిటీ ఏడాదిక్రితం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న వివాదానికి కేంద్ర బిందువు. ఆ కోర్సుపై అప్పట్లోనే నిరసనలు వెల్లువెత్తాయి. దాన్ని ప్రవేశపెట్ట వద్దంటూ ఆందోళనలు జరిగాయి. విద్యార్థులు మాత్రమే కాదు...విద్యా రంగ నిపుణులు సైతం ఇది సరైన నిర్ణయం కాదని ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్ల కోర్సులో చివరి సంవత్సరం ఉపాధితో ముడిపడి ఉండే ఐటీ, డాటా అనాలిసిస్ వంటి 12 రకాల కోర్సుల్లో దేనిలోనైనా ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుకల్పిస్తారు. అమెరికావంటి దేశాల్లో అమల్లో ఉంటున్న ఈ విధానాన్ని భవిష్యత్తులో దేశమంతటా పెట్టాలన్నది అప్పటి యూపీఏ సర్కారు ఆలోచన. జాతీయస్థాయిలో అమలవుతున్న 10+2+3 విద్యావిధానానికి భిన్నంగా ఢిల్లీ వర్సిటీలో దీన్ని ఎలా ప్రారంభిస్తారన్నది విద్యార్థి సంఘాల, విద్యావేత్తల అభిప్రాయం. కేవలం అమెరికా యూనివర్సిటీల వ్యాపారానికి పనికొచ్చేవిధంగా దీన్ని రుద్దుతున్నారని, పేద విద్యార్థులకు దీనివల్ల అదనపు భారం తప్ప ప్రయోజనం ఉండదని వారి వాదన. ఢిల్లీ యూనివర్సిటీ పాలక మండలిలోగానీ, పిల్లలకు చదువు చెబుతున్న అధ్యాపకులతో గానీ చర్చించ కుండా వైస్ చాన్సలర్ దినేష్ సింగ్ యూనివర్సిటీ పరిధిలో ఉండే దాదాపు 70 కళాశాలల్లో ఆ కోర్సును ప్రవేశపెట్టారు. అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆశీస్సులతో, ఆయన సలహాతో ఇదంతా జరిగిపోయిందని అందరికీ తెలుసు. ఆయన ఆశీస్సులు ఉండబట్టే విద్యార్థిలోకంనుంచి వెల్లువెత్తిన నిరసనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అప్పుడు పట్టించుకోలేదు. పైగా విశ్వవిద్యాలయానికి స్వయంప్రతిపత్తి ఉంటుందని, ఎలాంటి కోర్సులను ఉంచాలో తొలగించాలో దాని ఇష్టమని, అందులో తాము జోక్యం చేసుకోబోమని అన్నది. ఢిల్లీ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థ స్వతంత్రతకు ఆటంకం కల్పించే పాపానికి తాము ఒడిగట్టబోమని గంభీరమైన పలుకులు పలికింది. యూజీసీ పాలకమండలి సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తబోయిన యోగేంద్ర యాదవ్, ఎంఎం అన్సారీ వంటివారిని బేఖాతరు చేసింది. సరే... ఆ కోర్సు మొదలై ఏడాది దాటిపోయింది. ఈ విద్యా సంవత్సరం కూడా అడ్మిషన్లు మొదలుకావలసి ఉన్న తరుణంలో హఠాత్తుగా యూజీసీకి జ్ఞానోదయమైంది. ఆ కోర్సును రద్దుచేసి అంతకు ముందున్న మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించాలని ఢిల్లీ యూనివర్సిటీకి హుకుం జారీచేసింది. పర్యవసానంగా రెండురోజుల క్రితం ప్రారంభించాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోయింది. 2 లక్షల 70వేలమంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఆ కోర్సుకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు వీధికెక్కారు. తాము యూజీసీ హుకుంనే అంగీకరిస్తున్నట్టు 57 కళాశాలలు ప్రకటించాయి. అంతక్రితం స్వయంప్రతిపత్తిలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన యూజీసీకి ఇప్పుడేమైంది? నిరుడు యోగేంద్రయాదవ్, అన్సారీ వంటివారు చెప్పిన అభ్యంతరాలనే ఇప్పుడు తానూ వల్లిస్తున్నది ఎందుకని? కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మారి ఎన్డీయే సర్కారు వచ్చేసరికి కొత్త వైఖరి ఎందుకు తీసుకున్నది? తనకంటూ సొంత వ్యక్తిత్వమూ, అభిప్రాయాలూ ఉండవా? విద్యారంగ నిపుణులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఉన్నత శ్రేణి నిపుణులనూ, మేథావులనూ తయారుచేయాల్సిన విశ్వవిద్యాలయాలపై అజ్మాయిషీ చేసే యూజీసీ ఇంతటి బలహీన స్థితిలో మనుగడ సాగిస్తున్నదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎంతో చరిత్రగల ఢిల్లీ యూనివర్సిటీ ఈ సమస్యతో ఇప్పుడు నవ్వులపాలవుతున్నది. పాలకమండలిని సైతం సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న దినేష్సింగ్కు యూజీసీ తాజా హుకుంలో అప్రజాస్వామికత కనిపిస్తున్నది. యూజీసీకేమో వర్సిటీ నిర్ణయంలో ఇంతకుమునుపు గమనించని లొసుగులు కనబడుతున్నాయి. ఒకపక్క నాలుగేళ్ల కోర్సులో చేరిన విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగటిల్లుతుంటే...మొత్తం అడ్మిషన్ల వ్యవహారం తాజా వివాదంతో ఎటుపోతుందోనని కొత్త విద్యార్థులు ఆందోళనపడుతుంటే వైస్ చాన్సలర్ రాజీనామా చేశారన్న వదంతులు వ్యాపించాయి. ఆయన తనంత తాను బయటికొచ్చి యూజీసీ నిరంకుశత్వానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు చెబితే అందరూ ఆ నిర్ణయాన్ని హర్షించేవారు. ఎందుకంటే... నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకించినవారు సైతం యూజీసీ ఇలా ప్రభుత్వాలకు తోకగా మారి అభిప్రాయాలు మార్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి ప్రవర్తన భవిష్యత్తులో ప్రమాదకర పర్యవసానాలకు దారితీసినా తీయొచ్చని భయపడుతున్నారు. విజ్ఞానకేంద్రాలుగా ప్రకాశించవలసిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు ఇలా రాజకీయ వివాదంలో కూరుకుపోవడం విచారకరమైన పరిణామం.