సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై సమగ్ర సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) స్థాయిల్లో ప్రస్తుత పరిస్థితి, విద్యాసంస్థల్లో వనరులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు, మారుతున్న సమాజ అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలోనే వసతులు కల్పించి విద్యార్థులను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతోంది. అనుభవం గల ప్రముఖ సంస్థలతో సర్వే చేయిస్తారు. ఇందుకోసం ఉన్నత విద్యామండలి టెండర్లు్ల పిలవడం, ఇతర కార్యాచరణకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఈ సర్వే జరుగుతుంది. ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల్లో ప్రస్తుత పరిస్థితిని సశాస్త్రీయంగా విశ్లేషిస్తారు.
ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు!
యూజీ, పీజీ కోర్సులు చేసేందుకు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయాన్ని సర్వేలో ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. దీనిని గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా, మిశ్రమ విధానంలో చేపడతారు. ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక, లింగ తదితర విభాగాల వారీగా సర్వే కొనసాగిస్తారు. ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, కేస్ స్టడీలు సర్వేలో ఉంటాయి. విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ అధికారులు, జిల్లా, రాష్టస్థాయి నియామక అధికారులు, పూర్వ విద్యార్థులు తదితరులందరి అభిప్రాయాలు తీసుకుంటారు. సర్వే పూర్తిగా హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతుంది. సర్వేను 3 నెలల్లో పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
సర్వే పరిధిలోకి వచ్చే సంస్థలివీ..
రాష్ట్రంలోని యూనివర్సిటీలు (ఆర్జీయూకేటీ, ఐఐఐటీలు సహా), యూనివర్సిటీల పీజీ సెంటర్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు, మైనార్టీ కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజీలు, బీఈడీ–ఎంఈడీ కాలేజీలు, మహిళా కాలేజీలు, లా కాలేజీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు
శాంపిల్ సైజ్ 12 శాతానికి తగ్గకూడదు
సర్వేలో జనరల్, టెక్నికల్, లా, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ తదితర విభాగాల విద్యార్థుల సంఖ్యలో 12 శాతానికి తగ్గకుండా శాంపిళ్లను తీసుకుంటారు. ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులందరి భాగస్వామ్యం ఇందులో ఉండాలి. ఇందులోనూ 8 శాతం ఆన్‌లైన్ ద్వారా, 4 శాతం ఆఫ్‌లైన్ ద్వారా చేపట్టాలి. సర్వే శాంపిల్స్‌లో ఎస్సీలు 15, ఎస్టీలు 7.5, బీసీలు 25 శాతం ఉండాలి. మహిళలు, పురుçషుల శాతం సగం చొప్పున ఉండాలి. జిల్లా యూనిట్‌గా ఈ సర్వే సాగాలి. ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా మూడేసి బృంద చర్చలు చేపట్టాలి. ఇవి విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల వారీగా ఉండాలి.
ప్రవేశాలు.. విద్యార్థుల పరిస్థితిపైనా అధ్యయనం
► గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలు, విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులలో పరిశ్రమలపై అవగాహన ఎలా ఉంది, రాష్ట్రస్థాయిలోనే వారికి పారిశ్రామిక ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశాలేమిటనేది కూడా అంచనా వేయాలి. విద్యార్థుల్లో నైపుణ్యాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రస్తుత అవసరాలకు తగ్గ నైపుణ్యాలు లేకపోతే ఆ గ్యాప్ ఎంత? అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇవ్వాలి.
►విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంపై కారణాలు. వారికి ఇక్కడే ఉన్నత విద్యావకాశాలకు వీలైన ఏర్పాట్లపై సూచనలు. ఇలా వివిధ అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించి.. రానున్న ఐదేళ్లలో ఉన్నత విద్యారంగంలో చేపట్టాల్సిన విధాన కార్యక్రమాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.
యూజీ.. పీజీ విద్యపై సమగ్ర సర్వే
Published Mon, Feb 22 2021 5:50 AM | Last Updated on Mon, Feb 22 2021 5:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment