ఇక్ఫాయ్ ప్రొఫెసర్ ఆత్మహత్య!
కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణం
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇక్ఫాయ్ యూనివర్సిటీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనాలసిస్ట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ) ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు ఆయన తనతో పాటు తీసుకెళ్లిన ఇద్దరు పిల్లల ఆచూకీ తెలియరాలేదు. దీంతో గురుప్రసాద్ భార్య సుహాసిని మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన రాఘవేంద్ర గురుప్రసాద్ (43)కు హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుహాసిని (38)తో 2004లో వివాహమైంది. వారికి విఠల్ విరించి (9), నంద విహారి (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో.. సుహాసిని గతేడాది ఏప్రిల్‌లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది.
ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి గురుప్రసాద్ అల్వాల్‌లోని బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్‌లో తన తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. సుహాసిని ఇద్దరు పిల్లలతో మల్కాజ్‌గిరిలోని పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో గురుప్రసాద్ తన భార్యతో కలసి ఉండేందుకు అనుమతివ్వాలంటూ రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టులో గతేడాది సెప్టెంబర్‌లో పిటిషన్ వేశాడు. దాంతోపాటు తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ కూడా వేశాడు.
దీనిపై స్పందించిన కోర్టు ప్రతి నెల మొదటి, మూడవ శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పిల్లలను గురుప్రసాద్‌కు అప్పగించాలని సుహాసినిని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురుప్రసాద్ శని, ఆదివారాల్లో పిల్లలను తీసుకెళ్లి తిరిగి భార్యకు అప్పగించేవాడు. ఈ వ్యవహారం నడుస్తుండగానే.. తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ గత నెల 2న ఫ్యామిలీ కోర్టులో మరో పిటిషన్ వేశాడు. ఇదిలా ఉండగానే గురుప్రసాద్ గత శనివారం సుహాసిని వద్దకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాడు. కానీ 12.30 గంటల ప్రాంతంలో ఒంటరిగా ఆమె దగ్గరకు వచ్చి కోర్టు వ్యవహారంపై నిలదీశాడు. పిల్లలు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించగా.. ఒక దేవాలయంలో భోజనం చేస్తున్నారని, ముగిశాక తెస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడున్నర గంటల వరకూ వారి రాక కోసం ఎదురుచూసిన సుహాసిని భర్త మొబైల్‌కు ఫోన్ చేయగా... ఘటనా స్థలంలో ఉన్న రైల్వే పోలీసులు గురుప్రసాద్ ఆత్మహత్య విషయానిన సుహాసినికి చెప్పారు. అయితే గురుప్రసాద్ వెంట ఉండాల్సిన వారి ఇద్దరు పిల్లలు మాత్రం కనిపించలేదు. పోలీసులు గురుప్రసాద్ ఇంటికి వెళ్లి చూడగా... ఇంట్లో ఫ్యాన్ కింద ఓ తాడు, ఒక లేఖ కనిపించింది. చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. ఆ నోట్‌లో గురుప్రసాద్ భార్యతో వివాహం జరిగిన నాటినుంచి ఉన్న పరిణామాలను రాశాడు. ఆత్మహత్య ప్రస్తావన మాత్రం చేయలేదు.