సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్‌డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు.
చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్‌సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment