
అలీగఢ్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ దారితప్పాడు. భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన సదరు ప్రబుద్ధుడు.. అనంతరం విడిగా భార్యపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటన అలీగఢ్‌లో జరిగింది. 58 ఏళ్ల నిందితుడిపై పోలీసులు లైంగిక దాడి (376), క్రిమినల్ బెదిరింపులు (506) తదితర ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన నిందితుడు ఏడాదిన్నర కిందట భార్యకు సత్వర త్రిపుల్ తలాఖ్ ద్వారా విడాకులు ఇచ్చాడు. 2017లో వాట్సాప్ ద్వారా, ఎస్సెమ్మెస్ ద్వారా అతడు తనకు ట్రిపుల్ తలాఖ్ చెప్పినట్టు భార్య తెలిపారు. ఈ క్రమంలో కొడుకు, కూతురితో కలిసి తాను అతనితో వేరుగా ఉంటున్నానని, కానీ, పిల్లలను చూసే నెపంతో అతడు తరచూ తన ఇంటికి వచ్చేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గత నెల 29న అతడు తాము ఉంటున్న ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనను తుపాకీతో బెదిరించి.. తనపై లైంగిక దాడి జరిపాడని ఆమె పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్‌తో తనకు భర్త అన్యాయం చేశాడని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని 2017లో బాధితురాలు ఆలీగఢ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎదుట ఆందోళన నిర్వహించారు.