
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రాణిస్తున్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గత వైభవ చరిత్రను మసకబారుస్తున్నాయి. పూర్వ విద్యార్థులు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.కోట్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే, అధ్యాపకులు మాత్రం వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కళాశాల పరువును బజారుకీడుస్తున్నారు.
పరీక్షల పేరు చెప్పి వసూలు
కళాశాలలో శనివారం నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పర్యవేక్షించేందుకు (ఎక్స్‌టర్నల్) ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లు వచ్చారు. వీరికి ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అయితే, ప్రభుత్వ వైద్య కళాశాలలోని నాలుగు వైద్య విభాగాలకు చెందిన ప్రొఫెసర్‌లు ఇన్విజిలేటర్లకు రూమ్‌లు, భోజన వసతులు కల్పించేందుకు అంటూ వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి రూ.20వేలు, హౌస్‌సర్జన్‌ల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టికల్స్‌లో ఎన్ని మార్కులు వేయాలనేది ప్రొఫెసర్ల నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో విద్యార్థులు భయపడి నగదు ఇస్తున్నట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి రూ.50 వేలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హాజరు శాతం పెంచాలన్నా నగదు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుపేద వైద్య విద్యార్థులను కూడా వదలకుండా వైద్యాధికారులు వసూళ్లకు పా ల్పడుతున్నారు.
నిరుపేదలనే కనికరం లేకుండా..
ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల ద్వారా పలువురికి వచ్చే పారితోషికాలను సైతం ప్రొఫెసర్లు బినామీ అకౌంట్లలోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత పరీక్ష విధానంలో మార్పులు తెస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనేకసార్టు వైద్య కళాశాలకు వచ్చిన సమయంలో వెల్లడించారు. అయితే.. ప్రకటనలు తప్ప ఆచరణలో మాత్రం చూపలేదు.
విచారణ జరుపుతాం..
కళాశాలలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఇన్విజిలేటర్లకు ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అందుకోసం ఎవరూ ఖర్చు పెట్టనవసరం లేదు. విచారణ జరిపి వసూళ్లకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ సుబ్బారావు, ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల
Comments
Please login to add a commentAdd a comment