ప్రొఫెసర్..బరిలోనే | Professor .. ring | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్..బరిలోనే

Published Sat, Apr 12 2014 5:27 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

ప్రొఫెసర్..బరిలోనే - Sakshi

ప్రొఫెసర్..బరిలోనే

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఇరవై నాలుగు గంటల ఉత్కంఠకు తెరపడింది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున ఏ.సీతారాంనాయక్ దాఖలు చేసిన నామినేషన్‌ను అంగీకరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ పౌసుమిబసు తెలిపారు.  జిల్లాతో పాటు తెంగాణవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
 
ఇదీ.. గొడవ

వరంగల్‌లోని కాకతీయూ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఏ.సీతారాంనాయక్ తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రతినిధిగా ఉన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరగా... జేఏసీ ప్రతినిధుల కోటా కింద ఆయనను మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు.

ఈ మేరకు ఆయన చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈనెల 10వ తేదీన నామినేషన్ల పరీశీలన క్రమంలో సీతారాంనాయక్ అభ్యర్థిత్వంపై మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కేంద్ర సహాయ మంత్రి బలరాంనాయక్ ఆర్‌ఓ వద్ద అభ్యంతరం లేవనెత్తారు.

ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ లాభదాయక పదవిలో ఉన్న సీతారాంనాయక్ ఆ పదవికి రాజీనామా చేయకుండా నామినేషన్ వేశారని..  ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆయన చెల్లదని పేర్కొంటూ తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. దీంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇరుపక్షాలను పిలిచిన ఆర్‌ఓ.. ఇరువురు తమ వద్ద ఉన్న ఆధారాలతో శుక్రవారం సాయంత్రం 5గంటలకు రావాలని సూచించారు.
 
కలెక్టరేట్‌కు హైకోర్టు న్యాయవాదులు
 
ఎవరికి వారు తమ వాదన నెగ్గించుకునేందుకు హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దింపారు. బలరాం నాయక్ తరపున పట్టాభిరామారావు, సీతారాంనాయక్ తరఫున జె.రాచందర్‌రావు వాదనలు వినిపించారు. ఇలాంటి సందర్భాల్లో అభర్థులకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వారిద్దరు ఆర్‌ఓ ముందు ఉంచగా.. స్వతంత్య్ర ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారు ఎన్నికల్లో పోటీకి అర్హులేనని సీతారాంనాయక్ తరఫు న్యాయవాది రాంచందర్‌రావు వివరించారు. ఆయన వాదనతో ఆర్‌ఓ, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఏకీభవిస్తూ సీతారాంనాయక్ నామినేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
 
ఉదయం నుంచి హైడ్రామా

 
టీఆర్‌ఎస్ అభ్యర్థి సీతారాంనాయక్‌కు సంబంధించి అభ్యర్థిత్వంపై ఫిర్యాదు చేసిందికేంద్ర మంత్రి కావడంతో జిల్లా అధికారులు కాస్త సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో గురువారం సాయంత్రం విచారణ చేపట్టకుండా శుక్రవారానికి వాయిదా వేశారు. అలాగే, విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకు వెళ్లారు. అక్కడినుంచి సమాచారం వచ్చేలోగా నామినేషన్‌పై అభ్యంతరాలు లేవనెత్తిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

దీనికి  తోడు శుక్రవారం ఉదయం నుంచి తమ వకాలత్ నామా స్వీకరించాలని సీతారాంనాయక్‌తో పాటు ప్రత్యర్థి వర్గం వారు ఆర్‌ఓపై త్రీస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆర్‌ఓ నిరాకరించి అభ్యంతరం మాత్రమే స్వీకరిస్తామని, విచారణ తర్వాతేనిర్ణయం ప్రకటిస్తామని స్పష్టచేశారు. అలాగే, తమ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించడంతో అందరూ సాయంత్రం 4గంటలవరకు ఎదరుచూశారు.

ఎట్టకేలకు 4.30నుంచి సుమారు రెండు గంటల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి బసు.. సీతారాంనాయక్ నామినేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. సీతారాంనాయక్ వెంట టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, న్యాయవాదుల జేఏసీకి చెందిన నబీ తదితరులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.
 
న్యాయమే గెలిచింది..

తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన తనను ఎన్నికల్లో ఎదుర్కోలేకే దొంగదారిలో దెబ్బ తీసేందుకు బలరాం నాయక్ యత్నించారు. అయితే, తెలంగా ణ ఉద్యమం మాదిరిగానే ఇక్కడ కూడా న్యాయమే గెలిచింది. నర్కసంపేటలో కూ డా జేఏసీ నేతకు టికెట్ ఇస్తే బలరాంనాయక్ అడ్డుకున్నారు. మంత్రి గా ఉండి భద్రాచలం ప్రాంతంలోని మండలాలు సీమాంధ్రలో కలిపేందుకు సహకరించిన బలరాంనాయక్ మళ్లీ గెలిపిస్తే పూర్తి భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేను లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయం.     
 - సీతారాంనాయక్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement