ఇస్లామాబాద్ : విద్యార్థినులను పార్టీకి ఆహ్వానించాడనే కారణంతో ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపాడో స్టూడెంట్. ఈ సంఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఖలీద్ హమీద్ అనే వ్యక్తి బహవాల్‌పూర్‌లోని ప్రభుత్వ సాదిఖ్ ఎగెర్టన్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కాలేజీలో నిర్వహించిన ఫేర్‌వెల్ పార్టీకి విద్యార్థినులను కూడా ఆహ్వానించాడు. అయితే ఆడపిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధం అంటూ ఓ విద్యార్థి కత్తితో సదరు ప్రొఫెసర్ మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనక ఎలాంటి మతతత్వ సంస్థల ప్రమేయం లేదని తెలిపారు పోలీసులు. అయితే విద్యార్థి గత జీవితం, మానసిక పరిస్థితి వంటి అంశాల గురించి వాకబు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్‌లోని ఎగెర్టన్ కాలేజీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కళాశాలలో 4 వేల మంది ఆడ పిల్లలు చదువుతుండగా.. అబ్బాయిలు కేవలం 2000 మంది మాత్రమే ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment