సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జేఎన్‌యూలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పీహెచ్‌డీ విద్యార్థిని ఆరోపిస్తూ అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జేఎన్‌యూలో లైఫ్ సైన్స్ మొదటి సంవత్సరం స్కాలర్ పూజ కసానా రెండు రోజుల క్రితం హాస్టల్ విడిచి వెళ్లిపోయింది. ఆమె జాడ తెలియకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం లక్నోలో పూజని గుర్తించి, ఢిల్లీకి తీసుకొచ్చారు. తాను హాస్టల్ విడిచి వెళ్లడానికి తన మెంటర్ ప్రొఫెసర్ అతుల్ కుమార్ జోహ్రీ లైంగిక వేధింపులే కారణమని పూజ పోలీసులకు తెలిపింది.
అతుల్‌ను తన ప్రవర్తన మార్చుకోవాలని ఈ మెయిల్ ద్వారా సూచించినా మార్పు రాలేదని తెలిపింది. ‘అతుల్ నువ్వు జేఎన్‌యూలోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ గైడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు నీ పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేయాలని ఆశపడవచ్చు, కానీ చదువుకోనివారు కూడా బుద్ధిలో నీ కన్నా నూరుపాళ్లు నయం. నేను పీహెచ్‌డీని వదిలి వెళ్లడానికి నీ ప్రవర్తనే కారణం. నీకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, నీ ప్రవర్తనతో ఎన్నో సార్లు విసుగు చెందిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని పూజ ఆ మెయిల్‌లో పేర్కొంది.
మరోవైపు పూజ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అనుహ్యంగా గురువారం సాయంత్రం మరో 12 మంది లైఫ్ సైన్స్ విద్యార్థినిలు అతుల్‌పై ఇదే రకమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. అతుల్ తమకు అసభ్యకరమైన మెసెజ్‌లు చేయడం, శరీరాకృతి మీద కామెంట్లు చేసేవాడని వారు తెలిపారు. అతుల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్టూడెంట్ ఫ్యాకల్టీ కమిటీ మెంబర్ ఒకరు వెల్లడించారు. దీంతో ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment