
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డి ఉన్నత ప్రతిభావంతురాలని, చదువుతోపాటు సామాజిక సమస్యలపైనా ఆమె ఎప్పటికప్పుడు చురుగ్గా స్పందించేవారని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాంసింగ్ తెలిపారు. తమ వెటర్నరీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారని, ఆమెకు తాను చదువు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 2017లో చివరిసారి స్నాతకోత్సవం సందర్భంగా తనను కలిసి జాబ్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పారని ఆయన తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ ద్వారా ఆమె మెరిట్‌లో జాబ్ సంపాదించారని తెలిపారు.
యూనివర్సిటీలో ప్రియాంక చదువుకునేటప్పుడు హస్టల్ ఫుడ్, వాటర్ ఆమెకు పడకపోయేదని, అందుకే బుద్వేల్‌లో వాళ్ల అమ్మ దగ్గర ఉంటూ చదువుకున్నారని రాంసింగ్ చెప్పారు. కాలేజీ విద్యలో ప్రియాంక చాలా చురుకుగా ఉన్నారని చెప్పారు. క్యాంపస్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా అందరితో కలిసి ఆమె కూడా పాలుపంచుకునేవారని తెలిపారు. అయితే, ప్రియాంక సున్నిత మనస్కురాలని, కాలేజీలోనూ తన పని తాను చేసుకుంటూ పోయేవారని, తన చదువు. ఇల్లు తప్ప ఇతరత్రా పట్టించుకునేది కాదని, అలాంటి అమ్మాయిని రేప్ చేసి చంపేసిన మూర్ఖులకు కఠిన శిక్షలు పడాలని రాంసింగ్ కోరారు.