
'లెక్క' తప్పింది.. విమానం ఆగింది!
న్యూయార్క్: ఓ ప్రొఫెసర్ విమానం ఎక్కి.. సీరియస్‌గా లెక్కలు చేసుకోవడం.. ఆయనను చిక్కుల్లో పడేసింది. తోటి ప్రయాణికుల్లో అనుకోని భయాందోళనకు కారణమైంది. సదరు ప్రొఫెసర్ తన మానాన తాను గణిత సూత్రాల మీద కసరత్తు చేస్తుండగా.. ఓ మహిళ ఆ లెక్కలను చూసి 'సీక్రెట్ టెర్రరిస్టు కోడ్' అనుకొంది. అంతే గగ్గోలు పెట్టింది. విమానం సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో విమానాన్ని రెండు గంటలపాటు ఆపి.. ఆ ప్రొఫెసర్ గారి లెక్కలు.. ఉగ్రవాదుల 'కోడ్ భాష' కాదని నిర్ధారించుకున్నారు.
ఇటలీకి చెందిన ఆర్థిక వేత్త, పెన్సిల్వేనియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గైడో మెంజియో (40)కు ఈ చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి గురువారం కెనడాలోని సైరాకస్‌కు ఎయిర్ విస్కాన్సిన్ విమానంలో వెళుతుండగా ఆయన పక్కన ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు ఈమేరకు అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఆయనను ఫిలడెల్ఫియాలోనే దింపేసి.. భద్రతా సిబ్బంది ప్రశ్నించారు. విమానాన్ని రెండు గంటలపాటు నిలిపేశారు. కెనడా ఒంటారియోలోని క్వీన్స్ యూనివర్సిటీలో ఉపన్యసించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని మెంజియో వెల్లడించారు. ఈ ఘటనను ధ్రువీకరించిన సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ.. ప్రొఫెసర్ పక్కన కూర్చున్న 30 ఏళ్ల మహిళ అనుమానాలు వ్యక్తం చేయడం, తాను చాలా అస్వస్థతకు గురయ్యానని చెప్పడంతో ఇలా చేశామని చెప్పుకొచ్చింది.