ఇడ్లీని అంతమాట అంటాడా | British Professor Calls Idley Is Boring Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇడ్లీని అంతమాట అంటాడా

Published Sun, Oct 11 2020 8:27 AM | Last Updated on Sun, Oct 11 2020 9:45 AM

British Professor Calls Idley Is Boring Viral On Social Media - Sakshi

‘మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది’ అని సామెత. నాలుక మీద అదుపును కోల్పోవద్దని చెప్పడమే ఈ సూక్తి ఉద్దేశం. అలా అదుపు కోల్పోయాడు బ్రిటన్‌లో ఒక ప్రొఫెసర్‌. అంతే... ఇడ్లీప్రియులు సంఘటితం అయ్యారు. దక్షిణ భారతావని శక్తి ఏమిటో తెలుసుకుంటున్నాడు ప్రొఫెసర్‌. ఇడ్లీ తన చావుకు తెచ్చిందని విచారిస్తున్నాడు.
ఇంతకీ ఆ ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ ఆండర్సన్‌ గారు అన్న మాట ఏంటంటే... ‘ప్రపంచంలో ఇడ్లీ అంతటి బోర్‌ కొట్టే పదార్థం మరొకటి ఉండదు’ అని. అంతే! సోషల్‌ మీడియాలో ఏకంగా యుద్ధమే మొదలైంది.

‘జీవితంలో ఎప్పుడైనా ఇడ్లీ తిన్నావా బాసూ’ అని ఒకరు, ‘ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా’ అని ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 
‘వేడి వేడి మినీ ఇడ్లీ మీద నెయ్యి, కారం పొడి చల్లి తిని చూడు బ్రదర్‌’ అని ఒకరు సూచన విసిరారు.
‘ఇడ్లీ రుచి తెలిసేటంతటి నాగరకత అలవడడం కష్టమే. ఆ ప్రొఫెసర్‌ ఇడ్లీ రుచి ఎలా ఉంటుందో తెలియకుండా జీవించేశాడు పాపం’ అని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కొడుకు ట్వీట్‌కు జతకలుపుతూ ప్రొఫెసర్‌ పట్ల జాలి ప్రకటించారు.
‘ఇడ్లీ మీద సాంబార్‌ పోసి జారుడుగా తినవచ్చు. చట్నీతో గట్టిగా తినవచ్చు. యాపిల్‌ సాస్‌తో కూడా తినవచ్చు. తక్కువ సమయం లో తయారు చేసుకోగలిగిన బలవర్ధకమైన ఆహారం ఇడ్లీ. ఇడ్లీ మీద వచ్చిన విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి, ఇడ్లీ ప్రాధాన్యతను కాపాడుకోవడానికి తమిళ రక్తం సిద్ధమవుతోంది’ అని మనస్విని రాజగోపాలన్‌ అనే నెటిజన్‌ ఓ హెచ్చరికను జారీ చేసింది.
‘మెత్తటి ఇడ్లీలను మటన్‌ షోరువాతో తిని చూడు’ అని నవీన్‌ చమత్కరించాడు.
 

‘ఇడ్లీని సాంబార్, కొబ్బరి చట్నీ, మటన్‌ ఖీమా, చికెన్‌ కర్రీ దేనితోనైనా సరే ఎనిమిది నుంచి పది ఇడ్లీల వరకు తింటాను. నా దగ్గరకు రా... ఇడ్లీ ఎలా తినాలో చూపిస్తాను. ఇడ్లీ చేయడం చేతరాని వాళ్లంతా ఇడ్లీని విమర్శించే వాళ్లయ్యారు’ అని కోపగించుకున్నాడు ఓ తంబి.
‘లండన్‌లో కూర్చుని మాట్లాడడం కాదు, కోయంబత్తూర్‌కొచ్చి అన్నపూర్ణ హోటల్‌లో రాత్రి ఏడు గంటలకు సాంబార్‌ ఇడ్లీ తిని అప్పుడు చెప్పమనండి’ అని శుభ విసుక్కుంది.
తమిళులతోపాటు కన్నడిగులు కూడా ఈ ఇడ్లీ మద్దతు బృందంలో చేరిపోయారు. కర్ణాటక లో చేసే రకరకాల సాంబార్‌లు, బాంబూ ఇడ్లీ వంటి ప్రయోగాల గురించి తెలుసుకోకుండా ఏదో అనేస్తే ఎలా... ప్రదీప్‌ అనే మైసూరు నెటిజన్‌ గొంతు కలిపాడు. రెండు రాష్ట్రాలు ఏకమై పోరాడుతుంటే మనం చూస్తూ ఊరుకోవడం ఏమిటని ‘ఆంధ్రాలో ఇడ్లీలోకి ఎన్ని రకాల చట్నీలు చేస్తారో తెలుసుకోండి. ఒక్కో చట్నీతో ఒక్కోరకమైన రుచినిచ్చే ఇడ్లీని ఇంత మాట అంటారా’ అని అనిరుథ్‌ భృకుటి ముడివేశాడు. 
జ్యోతి మెనన్‌ అందుకుంటూ ‘నార్త్‌ మలబార్‌లో చేసే సాంబార్‌తో ఇడ్లీ తినండి’ అని ఆండర్సన్‌ను ఒక పోటు పొడిచింది.

నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆండర్సన్‌ ‘నాకు సౌతిండియన్‌ ఫుడ్‌లో దోశె, ఆప్పం చాలా ఇష్టం. ఇడ్లీ అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు’ అని సవరించుకున్నాడు. అయినా ఆ రెండో మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదటి మాట వేడి ఇంకా తగ్గనే లేదు. ఈ బృందం మరింత మందితో బలోపేతం అవుతూనే ఉంది. ఒక జాతిని ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఓ చిన్న మాట చాలు... అని ఇప్పుడు ఇడ్లీ నిరూపించింది. ఈ టీ కప్పులో తుపానుకు కారణం జొమాటో. ‘జనం ఎందుకు అంతగా ఇష్టపడతారో అర్థం కాని ఒక వంటకం పేరు చెప్పండి’ అని అడిగింది. అప్పుడు ఎడ్వర్డ్‌ ‘ఇడ్లీ’ అని నోరు జారాడు.

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో అమ్మ ఇడ్లీ పెడితే... ‘నాన్నా! ఈ రోజు డెడ్లీ బ్రేక్‌ఫాస్ట్‌’ అని ఇడ్లీ పట్ల నిరసన వ్యక్తం చేసే పిల్లలు మన ఇళ్లలోనూ ఉంటారు. ఇదే పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చే సరికి వేడి వేడి ఇడ్లీ పెడితే ఆవురావురుమని తింటారు. ఇడ్లీని ఇడ్లీలా తినవచ్చు, ఉప్మాగా మార్చుకోవచ్చు.. ఇడ్లీని పొడవు ముక్కలుగా కట్‌ చేసి కార్న్‌ఫ్లోర్‌లో కానీ మంచూరియా మిక్స్‌లో కానీ ముంచి నూనెలో వేయించి కరకరలాడే స్నాక్‌గా తినవచ్చు. ఎన్ని రకాలుగా తిన్నా ఆ రుచికి మరేదీ సాటి రాదు. ఈ సంగతి తెలియక పాపం ఆండర్సన్‌ ఇలా చిక్కుకుపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement