సూర్యాపేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ప్రజాస్వామికీకరణ జరుగుతుందని, మూడు ప్రాంతాల్లో కొత్త అభివృద్ధికి అవకాశం కలుగుతుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మూడు ప్రాంతాల ఉద్యమ నేతల ఉమ్మడి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1990 దశకంలో అంతర్జాతీయ పెట్టుబడులు తేవాలనే ప్రయత్నంలో మురికివాడలను తొలగిం చడం, రైతుల భూములు గుంజుకోవడం, చెరువులు పూడ్చివేయడం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఐటీ, ఇతర రంగాల్లో కంపెనీలు పేరిట భూముల విలువలు విచ్చలవిడిగా పెంచుకున్నారని, ఇది రియల్ ఎస్టేట్ ప్రేరిత అభివృద్ధి తప్ప మరోటి కాదన్నారు. న్యాయం, స్వేచ్ఛ సమానత్వం కోసం జరిగిందే తెలంగాణ పోరాటమన్నారు. సమైక్య ఉద్యమం యాసిడ్ దాడి చేసే ప్రేమోన్మాదం లాంటిదని విమర్శించారు.
సమైక్యాంధ్ర.. బూటకం, కమ్మ, రెడ్డిల నాటకం : పల్నాటి శ్రీరాములు
సమైక్యాంధ్ర బూటకం.. కమ్మ, రెడ్డిల నాటకమని బహుజనాంధ్ర ఉద్యమ నేత పల్నాటి శ్రీరాములు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రలో ఉద్యమం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు సమైక్య పదం ఉచ్ఛరించడానికి అర్హత లేదన్నారు. ఏనాడైనా దళిత బహుజనులను కలుపుకునిపోయారా అని ప్రశ్నించారు. నిజమైన సమైక్యత ఉంటే సీమాంధ్ర, తెలంగాణలో రెండు కులాల చేతుల్లోనే పరిపాలన ఎందుకుంటుందని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర పాలనలో దళిత బహుజనులకు జీవించే హక్కు కాలరాశారని, అందుకు ఉదాహరణే కారంచేడు, చుండూరు మారణహోమాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక మనస్తత్వంతో ప్రజలంతా కదం తొక్కడం చాలా సంతోషకరమన్నారు. పెట్టుబడులు, ఆధిపత్యం కాపాడుకోవడం కోసం సమైకాంధ్ర ఉద్యమం నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు, కార్పొరేట్ విద్యార్థులు తప్ప ఉద్యమంలో ప్రజలు లేరన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే సమైకాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు
.
రాయలసీమ, సర్కారాంధ్ర కలిసి ఉండడం అసంభవం : డాక్టర్ భూమన్
తెలంగాణ వేరైతే రాయలసీమ, సర్కారాంధ్ర కలిసి ఉండడం అసంభవమని రాయలసీమ అధ్యయన వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ భూమన్ అన్నారు. సర్కారాంధ్రలో 112, రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏ తీర్మానం పెట్టినా తాము నెగ్గేదెలా అని ప్రశ్నించారు. మూడు ముక్కలాట.. మూడు రాష్ట్రాల మాట అని తాము ఆశామాషిగా మాట్లాడడం లేదని పేర్కొన్నారు. 1913 నుంచే తాము ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుతున్నామని గుర్తు చేశారు. మీ రాష్ట్రం మీకేర్పడితే మిగలబోయేది మా సమస్యలు, మా కన్నీళ్లేనని, మా పట్ల ఓ కన్నేయండని తెలంగాణ ప్రజలను కోరారు. రాయలసీమ రతనాల సీమా, రత్నగర్భ, అపారమైన ఖనిజ సంపద ఉన్న ప్రాంతమన్నారు. వైశాల్యం రీత్యా 10 జిల్లాలతో కూడిన రాష్ట్రమవుతుందన్నారు. మీకు బొగ్గు గనులు ఉంటే.. మాకు ఎర్రచందనం, ముగ్గు రాళ్లు, ఆస్బేస్టాస్‌లాంటి సంపద ఉందన్నారు. కేవలం ఫ్యాక్షనిజం వల్లే అక్కడ పరిశ్రమలు పెట్టలేకపోతున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో రెవెన్యూ ఉందనడం అపోహే : ఎంవీ రమణారెడ్డి
హైదరాబాద్‌లో రెవెన్యూ ఉందంటూ అది ఉమ్మడి రాజధాని కావాలని కోరడం సమంజసం కాదని రాయలసీమ జేఏసీ కన్వీనర్ ఎంవీ రమణారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలతో కలిసి ఉంది కాబట్టే సేల్స్ టాక్సీ ఎక్కువ రావడం సహజమని, ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత ఎవరి రెవెన్యూ వారికే వస్తుందన్నారు. నదీ జలాల విషయంలోనూ ప్రజలకు అపోహలు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి నుంచి 1500 టీఎంసీల నీరు, కృష్ణా నుంచి 300 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఆనకట్టలు కట్టి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అన్ని ప్రాంతాల వారు కూర్చొని చర్చించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు తొందరపడాల్సిన అవసరం లేదని, నిగ్రహం, సంయమనం పాటించాలన్నారు. సచివాలయం నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సి వస్తుందనడంతో ఉద్యమం బలం పుంజుకుందన్నారు.
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం : కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తెలంగాణలో ఎవరైనా ఉండొచ్చని.. ఇదొక పుష్ప గుచ్ఛంలాంటిదని కోదండరాం అన్నారని గుర్తు చేశారు. పొట్టకూటి కోసం వచ్చారని మాత్రం అనొద్దని విజ్ఞప్తి చేశారు. గ్లోబలైజేషన్‌లో ఎక్కడ నాగరికత ఉంటే అక్కడికి వెళ్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి హాని జరగలేదన్నారు. భవిష్యత్‌లో మాకొన్ని చట్టాలు కావాలని కోరడం తప్పులేదని భావిస్తున్నానన్నారు.
నీళ్లు రావనుకోవడం రాయలసీమ
వాసుల భ్రమ :విద్యాసాగర్‌రావు
జల నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కృష్ణా బేసిన్‌లో ఉన్న 18శాతం వాటానే తప్ప తెలంగాణ ఏర్పడితే మాకు నీళ్లు రావని రాయలసీమ వాసులు అనుకోవడం భ్రమ అన్నారు. అదనపు నీళ్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నదుల అనుసంధానం ద్వారా న్యాయం చేయాలని అడగాలన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాకెలాంటి అభ్యంతరమూ లేదన్నారు. చట్టబద్ధంగా నికరజలాలైనా, మిగులు జలాలైనా తీసుకోవాలి తప్ప హక్కు లేని దానిని హక్కుగా భావించి అన్యాయం జరుగుతుందనడం భావ్యం కాదన్నారు. మా నీళ్లు.. మా నిధులు.. మా నియామకాల కోసమే పోట్లాడుతున్నాం తప్ప ఎవరికి అన్యాయం చేయమన్నారు. టీజేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ శాంతిని కోరుకుంటున్నాం.. రాష్ట్రాలుగా విడిపోవాలనుకుంటున్నామన్నారు. అడ్డుకుంటే మిగిలి ఉన్న సాయుధ పోరాట శకలాలను కొనసాగించడానికి వెనుకాడబోమన్నారు. ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యతి రేకించే హక్కు ఎవరికి లేదన్నారు. విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పే మాటల్లో వాస్తవం లేదన్నారు. కార్యక్రమానికి జన చైతన్య వేదిక అధ్యక్షుడు పశ్య ఇంద్రసేనారెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి బద్దం అశోక్‌రెడ్డి కార్యదర్శి నివేదిక సమర్పించారు. ఇంకా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక సభ్యులు డాక్టర్ రామయ్య, కొల్లు మధుసూదన్‌రావు, యానాల యాదగిరిరెడ్డి, మర్రు హన్మంతరావు, ఏనుగు లింగారెడ్డి పాల్గొన్నారు.
విభజనతో..అంతటా అభివృద్ధి
Published Mon, Sep 2 2013 4:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement