అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు! | family members Agitation for abducted Professor in libiya | Sakshi
Sakshi News home page

అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు!

Published Wed, Feb 24 2016 1:51 AM | Last Updated on Mon, May 28 2018 1:37 PM

అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు! - Sakshi

అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు!

లిబియాలో కిడ్నాపైన ప్రొఫెసర్ల కోసం వారి కుటుంబ సభ్యుల ఆవేదన
* 7 నెలల కింద బలరాం, గోపీకృష్ణలను బంధించిన ఐసిస్ ఉగ్రవాదులు
* ఇప్పటికీ అందని క్షేమ సమాచారాలు 
* కన్నీటితో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు
* లిబియా, ట్రిపోలీ, ఢిల్లీ.. ఎక్కడా లభించని భరోసా
* ఇల్లు గడవడం కష్టంగా ఉందన్న గోపీకృష్ణ కుటుంబం
* ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బలరాం భార్యాపిల్లలు


 సాక్షి  ప్రతినిధి, హైదరాబాద్: ఎలా ఉన్నారో.. ఎప్పుడొస్తారో తెలియదు.. నాన్న ఎప్పుడొస్తాడన్న పిల్లలకు ఏం చెప్పాలో తెలియదు.. నాన్నపై బెంగతో పిల్లలు ఏడుస్తుంటే, తమ కంట కన్నీటిని అదిమిపెట్టి వారినెలా ఓదార్చాలో తెలియదు.. తోడు నీడగా ఉండే వారు లేక, అసలు తమవారి పరిస్థితి ఏమిటో తెలి యక కుమిలిపోవడమే వారికి మిగిలింది. లిబి యాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో చిక్కిన తెలంగాణ, ఏపీలకు చెందిన ప్రొఫెసర్లు చిలువేరు బలరాం కిషన్, తిరువీధుల గోపీకృష్ణ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది.. గతేడాది జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అందులో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లను 2 రోజుల్లోనే విడిచి పెట్టిన ఉగ్రవాదులు... కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరాం కిషన్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను విడుదల చేయలేదు. దీంతో దాదాపు ఏడు నెలలుగా వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు లిబియాలోని భారత అధికారులతో నిత్యం సంప్రదిస్తున్నా.. తమ వారి క్షేమ సమాచారం తెలియక విలవిల్లాడుతున్నారు.

 గడువులన్నీ తీరినా..
 బలరాం కిషన్, గోపీకృష్ణల విడుదలకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి విడుదలైన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు, భారత దౌత్య అధికారులు చెప్పిన గడువులన్నీ ఇప్పటికే తీరిపోయాయి. బందీల కుటుంబ సభ్యులైతే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు ప్రధాని మోదీని సైతం కలసి వారిని విడిపించాలని వేడుకున్నారు. విదేశాంగ శాఖ కార్యాలయం బందీల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు భరోసానిస్తూ వచ్చింది. అటు లిబియాలోని దౌత్యాధికారులు సైతం సిర్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల సహాయంతో సంప్రదింపులు జరిపి ఇద్దరు ప్రొఫెసర్ల విడుదల కోసం ప్రయత్నించారు. కానీ పురోగతి లేకపోవడంతో ఏం చేయాలో, బందీల కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

 ఈ వారమే కీలకం
 లిబియాలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఉగ్రవాదులతో చర్చలు జరిపేం దుకు సానుకూల వాతావరణం ఏర్పడుతోం దని దౌత్యాధికారులు చెబుతున్నారు. ఈ వారంలో కొంత పురోగతి ఉండొచ్చని బందీల కుటుంబ సభ్యులకు భరోసానిస్తున్నారు. ఈనెల 29న ప్రొఫెసర్ గోపీకృష్ణ పుట్టినరోజు కావడంతో.. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన పుట్టినరోజుకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యే అవకాశముందని.. అది విడుదలపై సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఇక వారం కింద బలరాం, గోపీకృష్ణల సెల్‌ఫోన్లు పనిచేశాయని... దీంతో వారు క్షేమంగానే ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఏ ఘటన జరిగినా సిర్త్ ఆస్పత్రికి తప్పక సమాచారం వస్తుందని చెబుతున్నారు.

 ఏమీ అర్థం కావడం లేదు
 ‘‘రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. సిర్త్ యూనివర్సిటీ, ఢిల్లీ అధికారులకు రోజూ ఫోన్లు చేస్తున్నా.. స్పందన కనిపించడం లేదు. ఇప్పటికే ఏడు నెలలవుతోంది. పిల్లల ఫీజులు, కుటుంబ వ్యయం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈనెల 29న నా భర్త (గోపీకృష్ణ) పుట్టినరోజు. ఆ రోజుకయినా ఆయన క్షేమ సమాచారం తెలుస్తుందన్న ఆశతో బతుకుతున్నాం. మా వారి విడుదల కోసం మరింతగా ప్రయత్నించాలని ప్రధాని మోదీని కోరుకుంటున్నాం..’’
 - కల్యాణి, గోపీకృష్ణ సతీమణి

 ఇంత పెద్ద దేశం ఇద్దరినీ విడిపించలేదా?
 ‘‘మనది ఎంతో పెద్దదేశం.. శక్తివంతమైనది.. ఈ ఇద్దరిని ఎందుకు విడిపించలేకపోతోంది? మా వారు క్షేమంగా ఉన్నారని చెబుతున్నా... అసలు ఆచూకీని ఇంత వరకు చెప్పలేకపోతున్నారు. పెద్ద పదవుల్లో ఉన్న వారందరినీ కలసి వేడుకున్నాం. ఏమీ పాలుపోవడం లేదు. గత ఆదివారం మా వారికి ఫోన్ చేస్తే రింగ్ అయింది, కానీ ఎత్తలేదు. మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ లేదు. నాన్న ఎప్పుడొస్తారని పిల్లలు అడుగుతున్నారు. ఏం చెప్పాలి..? ఈ నెలాఖరులో లిబియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మా వారి విడుదల జరుగుతుందని దౌత్యాధికారులు చెబుతున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నాం..’’
 - శ్రీదేవి, బ లరాం సతీమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement