బాల సంధ్యారాణి (ఫైల్)
గుంటూరు: ఓ వైద్య విద్యార్థిని కుటుంబం ప్రొఫెసర్ వేధింపులకు బలైంది. గుంటూరు వైద్య కళాశాలలో గైనకాలజీ (డీజీఓ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ తన డైరీలో రాసి సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ చిట్టిప్రోలు రవితో సంధ్యారాణి వివాహమైంది. సంధ్యారాణి మృతిని తట్టుకోలేక రవి బుధవారం ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రొఫెసర్ వేధింపులకు కుటుంబం చిన్నాభిన్నమైందని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంధ్యారాణి మృతితో గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ లక్ష్మి పరారీలో ఉన్నారు. నెల రోజులపాటు సెలవు పెడుతున్నట్లు ప్రిన్సిపాల్‌కు లెటర్ పంపారు. మృతురాలి తల్లిదండ్రులు తనపై నేరుగా ఫిర్యాదు చేయడం, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకుని పరారయ్యారు.
సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని మెడికోలు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం కలెక్టర్‌ను కలిసిన వైద్య విద్యార్థులు ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. మూడు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.