మంగళగిరి: మండలంలోని ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థినులను ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం వెలుగులోకి రావడంతో కళాశాలలో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా 11 మంది పీజీ మెడికల్ విద్యార్థినులను ఓ ప్రొఫెసర్ లైంగికంగా వేధించిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో విషయం బట్టబయలైంది. అయితే ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినులు స్టేషన్‌కు వెళ్లారనే సమాచారం అందుకున్న యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకుని ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకుని విద్యార్థినులకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
దీంతో మెత్తబడిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులపై విద్యార్థినులు తొలుత యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సదరు ప్రొఫెసర్ మరింత రెచ్చిపోయాడని, దీంతో విద్యార్థినులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే యాజమాన్యం జోక్యం చేసుకుని సదరు ప్రొఫెసర్‌ను తొలగించడంతో పాటు మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ కళాశాలలో పీజీ పూర్తిచేయాల్సి ఉండడంతో విద్యార్థినులు సైతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇదే కళాశాలలోని హాస్టల్‌లో విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వాడుతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment