కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిగా ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు పదవీకా లం గత నెల 24వ తేదీతో ముగిసినా ఆయన ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్న వైనంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది.
విధుల్లోకి రాని రంగారావు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరీక్షల ని యంత్రణాధికారిగా ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు పదవీకా లం గత నెల 24వ తేదీతో ముగిసినా ఆయన ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్న వైనంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. ‘పదవీకాలం ము గిసినా కుర్చీ వదలని ప్రొఫెసర్’ శీర్షికన ఈ కథనం రావ డం తెలిసిందే. దీంతో రంగారావు పరీక్షల నియంత్రణాధికారి, ఇన్‌చార్‌జ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించేందుకు గురువారం క్యాంపస్‌కు రాలేదు. ఆ రెండు బాధ్యతల నుంచి రంగారావు తప్పుకున్నట్లేనని భావిస్తున్నారు. ఇక పరీక్షల నియంత్రణాధికారిగా పదవీకాలం ముగిసినందున ఇన్‌చార్‌జ రిజిస్ట్రార్‌గా కూడా బాధ్యతలు కూడా నిర్వర్తించే వీలు లేకుండా పోయింది.
మళ్లీ పరీక్షల నియంత్రణాధికారిగా ఆయన పదవీకాలం పొడిగించే అవకాశము న్నా దీనికి ఇన్‌చార్‌జ వీసీ అప్రూవల్ ఉండాలి. కానీ ఇన్‌చార్‌జ వీసీ కె.వీరారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రంగారావు విషయమై స్పష్టత రావడం లేదు. కా గా, పదవీకాలం ముగిసిన విషయాన్ని ఉన్నత విద్యా కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లకపోవడం నిబంధనలకు విరుద్ధమేనని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయం వ్యక్తం చేశా రు. అయితే, యూనివర్సిటీలో కీలకమైన వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో పాలన స్తంభించినట్లయింది. ఇన్‌చార్‌జ వీసీ వీరారెడ్డి రాజీనామా చేసి ఇరవై రోజులు దాటుతున్నా ఉన్నతాధికారులు ఆమోదించలేదని సమాచారం. ఆయన రాజీనామాను ఆమోదించి మరొకరిని నియమిస్తేనే నియామకాలు చేపట్టే అవకాశముంటుంది.
నిబంధనలకు విరుద్ధం
కేయూ పరీక్షల నియంత్రణాధికారిగా పదవీకాలం ముగిసి 12రోజులు గడిచినా ఎంవీ.రంగారావు ఆ పదవిలో కొనసాగడం సరికాదని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ ఎఫ్) ఇన్‌చార్‌జ వంగాల సుధాకర్, అధ్యక్షుడు గాదెపాక అనిల్‌కుమార్ పేర్కొన్నారు. యూనివర్సిటీలో గురువా రం జరిగిన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. పదవీకాలం ముగిసిన తర్వాత బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు సంతకాలు చేసిన ఫైళ్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వం వెంటనే కేయూ వీసీతో పాటు మిగతా పదవులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో మురళి, కె.సునీల్, నేరెళ్ల విఠల్, దాట్ల నరే ష్, వంశీ, కృష్ణ, కరుణాకర్, శ్రీను పాల్గొన్నారు.