సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారితో అతలాకుతలమవుతున్న వేళ ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం అయిదు సెకన్లలో కరోనా వైరస్ వ్యాధిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి ఎక్స్-రే ఉపయోగించి ఐదు సెకన్లలోను వైరస్ ఉనికిని గుర్తించవచ్చని చెప్పారు. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!)
ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్‌రే చిత్రాల ద్వారా సాఫ్ట్‌వేర్ రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాదు, అది కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చన్నారు. తద్వారా ఈ వ్యాధి విస్తరణను అడ్డుకోవచ్చని తెలిపారు. దీని పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం)
ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ వెల్లడించారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్‌లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతీఎక్స్-రే డేటాబేస్ ను కూడా విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్ పరీక్ష ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ నిపుణులు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నారు అయితే జైన్ వాదనకు వైద్య సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ రాలేదు. కాగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటేసింది. మరణాల సంఖ్య 718కి పెరిగింది. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్)
Comments
Please login to add a commentAdd a comment