IIT Roorkee
-
ఇక శ్వాసతోనే క్యాన్సర్‌ను కనిపెట్టొచ్చు!
రూర్కీ: రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను వ్యయప్రయాసలు లేకుండా కేవలం శ్వాస ఆధారంగానే కనుగొనే కొత్త విధానాన్ని ఐఐటీ–రూర్కీ పరిశోధకులు అభివృద్ధిచేశారు. ప్రొఫెసర్ ఇంద్రాణి లాహిరి, ప్రొఫెసర్ పార్థా రాయ్, ప్రొఫెసర్ దిబ్రుపా లాహిరి తదితరులు రూపొందించిన ఈ డిటెక్టర్ రంగుల వేర్వేరు గాఢతలను వివరించే కలరీమెట్రీ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ‘ చిన్న పరిమాణంలో ఉండే ఈ స్క్రీనింగ్ డివైజ్‌ను ఉపయోగించడం చాలా తేలిక. ఈ డివైజ్‌లోకి సంబంధిత వ్యక్తి గట్టిగా గాలి ఊదితే చాలు వెంటనే డివైజ్‌లో ఒక కలర్ కనిపిస్తుంది. ఏ రోగానికి ఏ రంగు అనేది ముందే నిర్దేశితమై ఉంటుందిగనుక వాటిని పోలిచూసి రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లలో ఏదైనా వ్యాధి ప్రబలిందా లేదా చెక్ చేయవచ్చు’ అని పరిశోధనలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ ఇంద్రాణి లాహిరి వివరించారు. ‘క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే కనుగొంటే చాలా ఉత్తమం. అప్పుడే దాని నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని ఐఐటీ–రూర్కీ తాత్కాలిక డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంఎల్ శర్మ అన్నారు. ‘ఈ ఉపకరణంతో కోట్లాదిమంది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రాణాంతక రోగం ముదిరి వ్యాధి చికిత్సకు లక్షలు పోసే బదులు ముందే వ్యాధిని గుర్తించేందుకు ఇది సాయపడనుంది’ అని ఆయన అన్నారు. ఈ పరికరం ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీని సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. డిటెక్టర్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు టాటా స్టీల్‌తో సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని ఐఐటీ–రూర్కీ చేసుకుంది. హెల్త్ టెక్నాలజీలో విదేశాలపై ఆధారపడకుండా దేశీయ జ్ఞానాన్ని ఒడిసిపట్టేందుకే టెక్నాలజీ, న్యూ మెటీరియల్స్ బిజినెస్ పేరిట టాటా స్టీల్ విడిగా ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తోంది. ఆరోగ్య ఉపకరణాల రంగంలో స్వావలంబనకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ప్రధాని మోదీ నినదించిన ఆత్మనిర్భరత భారత్ కోసం శ్రమిస్తోంది. ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కోసం రక్తం అమ్ముకునే యత్నం.. -
ఐఐటీ రూర్కిలో ఏడు కొత్త కోర్సులు
న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఐటీ రూర్కి 7 కొత్త కోర్సులను తయారు చేసింది. ఇవి రానున్న విద్యా సంవత్సరం (2021-22) నుంచే అందుబాటులో ఉంటాయని సోమవారం తెలిపింది. ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్, ఎకానమిక్స్–మేనేజ్మెంట్, డేటాసైన్స్ –ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఈ కోర్సులను డిజైన్ చేసినట్లు తెలిపింది. కొత్త కోర్సులివే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎం.టెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంటెక్ (డేటా సైన్స్); డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ విభాగంలో డేటా సైన్స్(సీఏఐడీఎస్), ఎం.డెస్ (ఇండస్ట్రియల్ డిజైన్), ఎంఐఎం (మాస్టర్స్ ఇన్ ఇన్నొవేషన్ మేనేజ్మెంట్); ఎలక్ట్రాన్సిక్స్ విభాగంలో ఎం.టెక్ (మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ); హ్యుమానిటీస్, సోషల్ జస్టిస్ విభాగంలో ఎంఎస్ ఎకానమిక్స్ (5 ఏళ్ల కోర్సు), హైడ్రాలజీ విభాగంలో ఎం.టెక్ (డ్యామ్ సేఫ్టీ అండ్ రిహాబిలిటేషన్). -
5 సెకన్లలో కరోనా నిర్ధారణ పరీక్ష
న్యూఢిల్లీ: ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ కేవలం 5 సెకన్లలో కోవిడ్ ఉందో లేదో తెలిపే ఎక్స్ రే ఆధారిత నిర్థారణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ దీనిని తయారు చేశారు. ఇందులో భాగంగా కోవిడ్ కేసులు సహా ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 వేల ఎక్స్‌రే స్కాన్లను డేటాబేస్ రూపంలో స్టోర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచేలా తయారు చేసినట్లు చెప్పారు. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలనకు పంపినట్లు తెలిపారు. -
5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారితో అతలాకుతలమవుతున్న వేళ ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం అయిదు సెకన్లలో కరోనా వైరస్ వ్యాధిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి ఎక్స్-రే ఉపయోగించి ఐదు సెకన్లలోను వైరస్ ఉనికిని గుర్తించవచ్చని చెప్పారు. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్‌రే చిత్రాల ద్వారా సాఫ్ట్వేర్ రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాదు, అది కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చన్నారు. తద్వారా ఈ వ్యాధి విస్తరణను అడ్డుకోవచ్చని తెలిపారు. దీని పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం) ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ వెల్లడించారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతీఎక్స్-రే డేటాబేస్ ను కూడా విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్వేర్ పరీక్ష ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ నిపుణులు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నారు అయితే జైన్ వాదనకు వైద్య సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ రాలేదు. కాగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటేసింది. మరణాల సంఖ్య 718కి పెరిగింది. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్) -
‘అస్సలు ఊహించలేదు’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికై ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకున్నఅభ్యర్థులందరికి ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పంపనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో మహారాష్ట్ర విద్యార్థి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. బల్లార్పూర్కి చెందిన కార్తికేయ గుప్తా 372 మార్కులకు గానూ 346 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక అలహాబాద్‌కి చెందిన హిమాన్షు సింగ్ రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీకి చెందిన ఈర్చిత్ బుబ్నా మూడో ర్యాంకు సాధించాడు. అస్సలు ఊహించలేదు.. ప్రతిష్టాత్మక పరీక్షలో టాపర్‌గా నిలవడం పట్ల కార్తికేయ హర్షం వ్యక్తం చేశాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో సీట్ లభిస్తుందని అనుకున్నాను గానీ.. ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నాడు. రోజుకు 6 నుంచి 7 గంటలు పరీక్ష కోసం సన్నద్ధమైనట్లు తెలిపాడు. సబ్జెక్టు నేర్చుకోవడాన్ని పూర్తిగా ఆస్వాదించినపుడే ఉత్తమైన ఫలితాలు పొందగలమన్నాడు. చదువుకునే సమయంలో సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. తన ప్రిపరేషన్లో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చంద్రేశ్ గుప్తా, పూనం కీలక పాత్ర పోషించారని వెల్లడించాడు. వారి సహకారంతోనే ఇంటర్మీడియట్లో 93.7 శాతం మార్కులు సాధించానని పేర్కొన్నాడు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 19న జరగాల్సిన జేఈఈ పరీక్షను.. మే 27న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్ష ఫలితాలను jeeadv.ac.in. తెలుసుకోవచ్చు. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంకులను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసేందుకు ఐఐటీ రూర్కీ చర్యలు చేపట్టింది. ఆ వెంటనే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీలలో ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. 16 నుంచి విద్యార్థులకు చాయిస్ ఫిల్లింగ్‌కు అవకాశం కల్పించనుంది. మే27న జరిగిన ఈ పరీక్షకు 1.74 లక్షల మంది హాజరయ్యారు. -
జూన్ 19 నుంచి ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీని (జోసా) కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది. అందుకు అనుగుణంగా జోసా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను వచ్చే నెల 14న ఐఐటీ రూర్కీ ప్రకటించనుంది. దీంతో వచ్చే నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాలను చేపట్టేందుకు జోసా చర్యలు చేపట్టింది. మొత్తానికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో మొత్తం 42 వేల సీట్ల భర్తీని జూలై 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 39,425 సీట్ల భర్తీకి ఏడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించిన జోసా ఈసారి అవసరమైతే 8 దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి 2 వేలకు పైగా ఈడబ్ల్యూఎస్ కోటా, బాలికల కోటా కింద సూపర్‌న్యూమరరీ సీట్లు రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 42 వేలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 39 వేల సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొదట్లో 2.24 లక్షల మంది విద్యార్థులనే ఎంపిక చేసింది. అయితే అర్హుల సంఖ్య తక్కువగా ఉండటంతో చివరకు 2,31,024 మందిని అడ్వాన్స్డ్ రాసేందుకు అనుమతి ఇచ్చింది. కానీ అందులోనూ అడ్వాన్స్‌డ్‌కు 1,65,656 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పలు కాలే జీల్లో సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి జేఈఈ మెయిన్‌లో టాప్ 2.45 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పించింది. అయితే ఈసారి ఎంత మంది దరఖాస్తు చేస్తారో వేచిచూడాల్సిందే. నేటి నుంచి దరఖాస్తులు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులను ఈనెల 3 నుంచి స్వీకరించేందుకు ఐఐటీ రూర్కీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.45 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన దాదాపు 35 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోనున్నారు. అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసిన వారిలో ఓపెన్ కేటగిరీలో 1,13,925 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 9,800 మంది, ఓబీసీలో 66,150 మంది, ఎస్సీలో 36,750 మంది, ఎస్టీల్లో 18,375 మంది ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రధాన తేదీలు ఈనెల 3 ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 9 సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు అవకాశం. ఈనెల 20 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ ఈనెల 27న: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు పేపరు–2 పరీక్ష. జూన్ 4న జవాబు పత్రాల కీలు విడుదల. జూన్ 14న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 14, 15 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 17న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు 21న ఫలితాలు జూన్ 19 నుంచి జూలై 15 వరకు సీట్ల కేటాయింపు -
మే 19న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2019 మే 19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించాలని ఐఐటీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీకి అప్పగించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌ను ( jeeadv. ac. in) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుల స్వీరణ, పరీక్ష ఫీజు తదితర పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొంది. ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్‌ను రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దఫా పరీక్షలను 2019 జనవరి 6 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించనుంది. వాటి ఫలితాలను అదే నెల 31 నాటికి వెల్లడించనుంది. రెండో దఫా పరీక్షలను 2019 ఏప్రిల్ 6 నుంచి 20 వరకు నిర్వహించి ఫలితాలను ఏప్రిల్ 30 నాటికి విడుదల చేయనుంది. మొత్తానికి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులను మే 1 నుంచి ప్రారంభించనుంది. రెండు దఫాల్లో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకోనుంది. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం మే 19న పరీక్ష నిర్వహించనుంది. అందులో పేపర్–1, పేపర్–2కు హాజరైన అభ్యర్థులకే ర్యాంకులను ఇవ్వనుంది. వాటి ఆధారంగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలతోపాటు ఐఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ నెలాఖరులోగా జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల షెడ్యూల్‌తోపాటు ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీ షెడ్యూల్ విడుదల కానుంది. గతేడాది దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.24 లక్షల మంది అర్హత సాధించారు. జేఈఈ మెయిన్‌లో టాప్ మార్కులు సాధించిన 2.24 లక్షల మందిలో 1.68 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో ఆ వివరాలను వెల్లడించనుంది. -
తెలంగాణ రీసెర్చర్‌కు రూ.80 లక్షల ఫెలోషిప్
-
తెలంగాణ రీసెర్చర్‌కు రూ.80 లక్షల ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: జనగాం జిల్లాలోని రఘునాథ్‌పల్లి మండలం బానాజీ పేట గ్రామానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ గవ్వల కృష్ణకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఫెలోషిఫ్ లభించింది. కృష్ణ ఫ్రాన్స్‌లోని స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీలో 2016 నుంచి పరిశోధకుడిగా పని చేస్తున్నారు. ఈయన సేవలను గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం లక్ష యూరోల ఫెలోషిప్(రూ.80 లక్షలు)ను ప్రకటించింది. కృష్ణ ఐఐఎస్ఈఆర్, పుణె నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఐఐటీ రూర్కీలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ), ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. గ్రామీణ నేపధ్యం, పేదరికం నుంచి వచ్చిన కృష్ణకు ఈ అవార్డు రావడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు, ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ ప్రాథమిక విధ్యను స్థానిక ప్రభుత్వ స్కూల్లోనే పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. -
ఐఐటీల స్పెషల్ డ్రైవ్స్
న్యూఢిల్లీ : ఉద్యోగ ఆఫర్ పొందని విద్యార్థుల సంఖ్యను తగ్గించుకోవడానికి, ఉద్యోగవకాశాలను పెంపొందించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ టెక్నాలజీ(ఐఐటీలు) కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. ప్రీ ప్లేస్‌మెంట్‌గా వచ్చే ఇంటర్న్‌షిప్ ఆఫర్లను ఇంజనీరింగ్ విద్యార్థులు స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఫైనల్ ప్లేస్మెంట్ల ఒత్తిడిని ఐఐటీలు తగ్గించుకోవాలనుకుంటున్నాయని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు. ఖరగ్‌పూర్, చెన్నై, కాన్పూర్, గౌహతి, రూర్కే, వారణాసి, హైదరాబాద్ ఐఐటీలు ఈ విధంగా ఓవర్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఎంప్లాయర్స్ నుంచి వచ్చే ఇంటర్న్‌షిప్‌లకు ఓకే చెప్పేలా విద్యార్థులను ఐఐటీలు సన్నద్ధం చేస్తున్నాయి. ఇంటర్న్‌షిప్, విద్యార్థులో విశ్వాసాన్ని మరింతగా నింపుతుందని ఐఐటీ రూర్కే ప్రొఫెసర్, ప్లేస్‌మెంట్స్ ఇన్ఛార్జ్ ఎన్పీ పాధే తెలిపారు. ఇంటర్న్‌షిప్ పొందిన 90 శాతం మంది ఐఐటీ విద్యార్థులు కంపెనీల్లోనే ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారని ఐఐటీ హైదరాబాద్ ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్, ట్రైనింగ్ సెల్ ఫ్యాకల్టీ మెంబర్ బీ వెంకటేశం చెప్పారు. చాలా ఐఐటీలు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నట్టు వెల్లడించారు. తమ విద్యార్థులకు ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్‌లపై ఇన్స్టిట్యూట్లు సీరియస్‌గా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జాబ్ ఆఫర్లపై సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ ఇంటర్న్‌షిప్ ఎక్కువగా దోహదం చేయనుందని, ఇటు కంపెనీలకు, అటు స్టూడెంట్లకు ఇది ఓ పునాది మార్గంగా ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతేడాది 5-15 శాతం విద్యార్థులు జాబ్ ఆఫర్లను పొందలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఐఐటీలకు సహజమైన అడుగని ఐఐటీ ఖరగ్ పూర్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ దేవాసిస్ దేవ్ చెప్పారు. దీంతో పైనల్ ప్లేస్ మెంట్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. 300 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లను ఈ ఏడాది ఐఐటీ ఖరగ్‌పూర్ పొందిందని, గతేడాదితో పోలిస్తే ఇది డబుల్ అయిందని పేర్కొన్నారు. కొన్ని వారాల్లోనే ఐఐటీల్లో ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్లు ప్రారంభంకాబోతున్నాయి.