సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్ చేసిన అవకతవకలు, అక్రమాల్లో పాలుపంచుకున్న వృక్షశాస్త్రం ప్రొఫెసర్ విద్యావర్ధినిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పాలకమండలి తీర్మానించింది. బుధవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో టీయూ పాలకమండలి సమావేశం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ ఆధ్వర్యంలో జరిగింది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ హాజరు కాకపోవడంతో వాకా టి కరుణ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చ నిర్వహించి కొన్ని తీర్మానాలు చేశారు.
పాలకమండలి అను మతి లేకుండా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన విద్యావర్ధిని పదవీకాలాన్ని గుర్తించేది లేదని నిర్ణయించారు. పైగా వీసీ విచ్చలవిడిగా చేపట్టిన అక్రమ నియామకాలు, ఆర్థిక అవకతవకల్లో పాలుపంచుకుని ఇష్టారీతిన సంతకాలు పెట్టినందున విద్యావర్ధినిని ప్రొఫెసర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానించారు. ఈ సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తుందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు.
ఆర్థిక అవకతవకలపై విచారణ పూర్తయ్యేవరకు విద్యావర్ధిని వర్సిటీలోకి రావొద్దని ఆంక్షలు పెట్టారు. విద్యావర్ధిని నిర్ధోషిగా నిరూపించుకుంటేనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు అక్రమ మార్గంలో రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న అకడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ పాలకమండలి తీర్మానించింది.
Comments
Please login to add a commentAdd a comment