పరారీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్
► వైద్య విద్యార్థిని మృతిచెందిన రోజే అదృశ్యం
► ప్రకాశంజిల్లా పుల్లలచెరువు వద్ద సెల్ సిగ్నల్ గుర్తింపు
► ఆమె కోసం మూడు పోలీస్ బృందాల గాలింపు
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ప్రొఫెసర్ పరారీలో ఉన్నారు. గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎ.వి.వి.లక్ష్మి వేధింపులు తట్టుకోలేకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు మృతురాలు తన డైరీలో సూసైడ్ నోట్ రాసింది. ఆమె మృతితో గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీన్ని గుర్తించిన ప్రొఫెసర్ లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల రోజులపాటు సెలవు పెడుతున్నట్లు ప్రిన్సిపాల్‌కు లెటర్ పంపారు.
మృతురాలి తల్లిదండ్రులు తనపై నేరుగా ఫిర్యాదు చేయడం, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకుని పరారయ్యారు. పోలీసులు సెల్ నెట్‌వర్క్‌ను పరిశీలించగా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వద్ద ఆ ప్రొఫెసర్ ఉన్నట్లు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుర్తించారు. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలంటూ మృతురాలి బంధువులు, వైద్య విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం తెలుసుకుని సిమ్‌ను వేరుచేసి పక్కనపడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్ష్మి కర్నూలు, కడప, అనంతపురం, బెంగళూరు వైపు వెళ్లిందా లేక ఎవరితోనైనా తన సెల్‌ను పంపి పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగరంపాలెం సీఐ మొహమ్మద్ హుస్సేన్ నేతృత్వంలో మూడు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి ప్రొఫెసర్ లక్ష్మి జీమెయిల్ ద్వారా మృతురాలిపై ఆరోపణలతోపాటు తన వివరణతో కూడిన ప్రకటనను అన్ని పత్రికా కార్యాలయాలకు పంపడంపై సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రొఫెసర్ లక్ష్మిపై సస్పెన్షన్ వేటు:
లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గుంటుపల్లి సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఎంఈ ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.