
కళాశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న తిరుపతిరెడ్డి డాక్టరేట్ డిగ్రీతో తిరుపతిరెడ్డి
చీపురు పట్టిన చేతులే సాహిత్యాన్ని బోధిస్తున్నాయి. ఒక కళాశాలలో స్వీపర్‌గా చేరి... అదే కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ డాక్టరేట్ డిగ్రీ పొంది అటు విద్యార్థులకు...ఇటు తోటి లెక్చరర్లకు ఆదర్శంగా నిలిచారు డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి. నేడు గురుపూజోత్సవం సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం.
ప్రకాశం, మార్కాపురం: చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగిన వారు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాను స్వీపర్‌గా పనిచేసిన కళాశాలలోనే ఏకంగా లెక్చరర్ అయ్యారు తిరుపతిరెడ్డి. మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన మందటి అనంతయ్య ఉపాధ్యాయుడు. ఆయన కుమారుడు తిరుపతిరెడ్డి మార్కాపురం ఎస్వీకేపీ ఎయిడెడ్ కాలేజీలో ఇంటర్మీడియెట్ అయిపోగానే 1980లో అదే కళాశాలలో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా స్వీపర్‌గా చేరాడు. అప్పట్లో ఆయనకు రూ.130 జీతం ఇచ్చేవారు. ఒక వైపు ఉదయం 8 గంటలకే కళాశాలకు వచ్చి చీపురు, బుట్ట చేతపట్టుకుని గదులు శుభ్రం చేసి లెక్చరర్లు, విద్యార్థులు వచ్చేసరికి తరగతి గదులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేవాడు. తన వయసులో ఉన్న వారు డిగ్రీలు చదువుతుంటే తాను ఇలాగే ఉండిపోవాలా అని ఆలోచించి కళాశాలలోనే తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కన్నెకంటి రాజమల్లాచారి స్ఫూర్తితో ప్రైవేటుగా తెలుగు సాహిత్యంలో బీఏ, ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు. అప్పుడే (1996)కళాశాలలో తెలుగు లెక్చరర్ పోస్టు ఖాళీ అయింది. దరఖాస్తు చేసుకోగా యాజమాన్యం రూల్స్ ఒప్పుకోవంటూ చెప్పటంతో కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు డివిజన్ బెంచ్ తిరుపతిరెడ్డికి అనుకూలంగా తీర్పు చెప్పటంతో 2001 ఫిబ్రవరి 9న అదే కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరాడు.
అటు బోధన..ఇటు రచనలు:
ఒక వైపు కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేస్తుంటే, మరో వైపు కథరేఖలు, ప్రేమ మందిరం, విజ్ఞాన దీపికలు, దైవచిద్విలాసాలు ఇలా అనేక రచనలు చేశారు. విశేషం ఏమిటంటే రచనలతో పాటు 2016 డిసెంబర్‌లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ పొందారు. ఎంఏ హిస్టరీ, ఎల్‌ఎల్‌ఎం (న్యాయశాస్త్రం)లో డిస్టెన్స్ ద్వారా పట్టాలు పొందారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షునిగా ఉండే తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌లో సభ్యునిగా ఉన్న తిరుపతిరెడ్డి సుమారు 500 కథలు రిజిస్ట్రేషన్ చేయించాడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు. 7వ తరగతి వరకు మార్కాపురం మండలంలోని వేములకోట, 10వ తరగతి వరకు మార్కాపురం జెడ్పీ బాలుర పాఠశాలలో చదివిన తిరుపతిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ ఏకలవ్యుడే తనకు గురువని, చదువుకోవాలన్న తపన ఉంటే ఎలాంటి కష్టానైనా ఎదిరించవచ్చన్నారు. తాను రాసిన పుస్తకాలు, సాహిత్యం (లీటరేచర్)ఆధారంగా ఈ ఏడాది నోబెల్ బహుమతికి నామినేషన్ కూడా పంపినట్లు తెలిపారు.