మళ్లీ విధుల్లోకి కోదండరామ్
సుదీర్ఘ సెలవు తర్వాత ఓయూలో రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ సారథి ప్రొఫెసర్ కోదండరామ్ మళ్లీ అధ్యాపకుడిగా అవతారం ఎత్తనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన కళాశాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిపోర్ట్ కూడా చేశారు. మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్ పీజీ కళాశాలలో రాజనీతిశాస్త్ర అధ్యాపకునిగా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. 2015 సెప్టెంబర్‌లో ఆయన అధ్యాపకుడిగా పదవి విరమణ చేయనున్నారు. 2009 నవ ంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడిన మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు 2010లో అధ్యాపక విధులకు సెలవు పెట్టారు. ప్రస్తుతం పోలవరం ముంపు బాధితులకు అండగా పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు ఉద్యమ వ్యూహరచన చేస్తూనే మరో వైపు మధ్యమధ్యలో ఆరు మాసాల పాటు విద్యార్థులకు పాఠాలు బోధించారు.