బుర్ర తిరుగుడు
హ్యూమర్ ప్లస్
ఎవడికీ అర్థం కాకుండా మాట్లాడ్డమే జ్ఞానమని ఒకాయన కనిపెట్టాడు. ‘‘మారుతున్న విలువల మానవీకరణ నేపథ్యంలో నిర్దిష్ట కార్యాచరణ సూత్ర చందోబద్ధమైన మనిషి అశాస్త్రీయ ఆలోచనల వితర్కమే నేటి సమాజం’’ అనేవాడు. అంతా అర్థమైనట్టే వుండేది కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఇలాంటి బ్రహ్మ పదార్థాలను చూస్తే మన యూనివర్సిటీలకి అమితానందం. కర్రకి బుర్రకి అవినాభావ సంబంధముందని నమ్మి, ఈ అంశంపై తులనాత్మక పరిశోధన కూడా చేసి డాక్టరేట్ పుచ్చుకున్న ఒక ప్రొఫెసర్‌కి పైన చెప్పిన భాషా శాస్త్రవేత్త తగిలాడు. ఇద్దరూ కలిసి ఒక సెమినార్ ఏర్పాటు చేసుకున్నారు.
మన ప్రొఫెసర్ ప్రత్యేకత ఏమంటే ఆయన చేతిలో ఒక పొన్నుకర్ర వుంటుంది. తన వాగ్ధాటిని కంట్రోల్ చేయడం తనకే చేతకాని క్లిష్ట సమయాల్లో కర్రతో నెత్తిన ఒకటిచ్చుకుంటాడు. చేతివైద్యమన్నమాట. అప్పుడు రేడియోలో స్టేషన్ మారినట్టు ఆయన భావజాలం ట్యూనింగ్ మార్చుకుంటుంది. ఎదుటివాళ్లు ఎక్కువ మాట్లాడినా కూడా ఇదే ట్రీట్‌మెంట్. ఎవడైనా మైకుని కేకు కొరికినట్టు కొరకడం మొదలుపెడితే ఆయన బెల్లు కొట్టకుండా కర్రతో నెత్తిన కొడతాడు. తలాతోకా లేకుండా మాట్లాడేవాళ్లు కూడా ఈ దెబ్బకి కుదురుకుంటారు. లేదంటే తలకట్టే.
సెమినార్ ప్రారంభమైంది. కర్ర పుచ్చుకుని ప్రొఫెసర్ అధ్యక్షత వహించాడు. భాషా శాస్త్రవేత్త మైకు తీసుకున్నాడు.
‘‘సమాజ చలన సూత్ర కాలానుగుణ పరిశీలనా క్రమగతిని పరిశీలిస్తే, నిరూపిత సత్య సంక్లిష్ట భావావేశమే సాహిత్యం. ఎగసిన వాయు వీచికల విధ్వంస నిర్లక్ష్య నిర్హేతుక సకల చరాచర ఎగసిపడిన కెరటమే కవిత్వం..’’ అని మొదలుపెట్టాడు. కర్రతో బుర్ర గోక్కుంటూ ప్రొఫెసర్ కూచున్నాడు. స్టూడెంట్లకు ఏమీ అర్థంకాకపోయినా అర్థమైనట్టే ముఖకవళికలు మార్చి చూస్తున్నారు. ఒకడు లేచి డౌట్ కూడా అడిగాడు.
‘‘సామ్రాజ్యవాద దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్థీకృత సరళతలో సాహిత్య పరాన్నభుక్కులు గరిటెడు విషవాయువుకి లోనై అదనపు విలువను మరిచిన మార్కెట్ శక్తుల మృదంగ ధ్వనిలో సాహిత్యపు ఉనికి ఆధారభూతమా? భ్రమా భరితమా?’’ అని అడిగాడు.
తనకి సమవుజ్జీ దొరికాడని శాస్త్రవేత్త ఆనందపడ్డాడు.
‘‘నిరంకుశవాద దుష్టసంస్కృతి పరిరక్షణలో హక్కుల ఉద్యమ క్షీణదశ ఉత్థాన పతనాల ఆరోపిత పెట్టుబడిదారి సంక్షోభ విలయంలో సాహిత్యం హత్యాపాతక సదృశమై సన్నిహిత సామాజిక క్షణంలో...’’ ఇంకా ఏదో చెప్పబోతుండగా ప్రొఫెసర్ లేచి కర్రతో ఒకటిచ్చాడు.
శాస్త్రవేత్త ఒక్కక్షణం బుర్ర తడుముకుని, పదాల్లో తడబడ్డాడు.
‘‘గంభీర తటాక తరంగ ఉత్తేజిత గండరగండ, గండభేరుండ గండపెండేరాన్ని గ్రహించిన వారికి గడకర్రకి, దుడ్డుకర్రకి లవలేశ తేడా నిర్మాణం తెలియకపోవచ్చు. ఇంతకీ నన్నెందుకు కొట్టావు?’’ అని అడిగాడు.
‘‘చేతన్ చేన్ తోడన్ తోన్’’ అనేది ఏ విభక్తో నాకు తెలియదు కానీ, కోట్ కొట్టున్ కొడుతూనే వుండనేది భక్తి విభక్తి. దండం దశగుణమన్నారు. దండానికి దండం పెట్టనివాడు లేనే లేడు’’ అన్నాడు ప్రొఫెసర్.
ఇప్పుడు ప్రొఫెసర్ ప్రసంగ పాఠమొచ్చింది. కర్రని శాస్త్రవేత్త పుచ్చుకోబోతే ప్రొఫెసర్ వారించాడు.
‘‘నా బుర్ర తిరుగుడు నాకు చెడుగుడుతో సమానం. ఎవడి బుర్రని వాడు మరమ్మతు చేసుకోవడమే ఇప్పుడు సమాజానికి కావాల్సిన కసరత్తు. విద్వత్తు నత్తులు కొట్టదు. ఒత్తులు మరిస్తే భాషలో ఒత్తిడికి గురవుతాం’’ అని ప్రొఫెసర్ బుర్రని ఒకసారి టంగ్‌మనిపించుకుని మైకు తీసుకున్నాడు.
‘‘శూన్య పాలపుంత అంతరిక్ష మండల నక్షత్ర ధూళి సంవేదనా ధరిత్రిలో మనుగడ సాగిస్తూ, వాయుసమ్మిళిత బుడగలో ఆయువు వూదుతూ సంపూర్ణ అసంపూర్ణ అమానవీయ చారిత్రక విభాత సంధ్యల్లో విస్పష్ట వికసన...’’ ఇలా కాసేపు సాగిన తరువాత తనకి తానే బ్రేకు వేసుకుని బుర్రపై ఒకటిచ్చుకున్నాడు.
‘‘ఎవడికి వాడు హింసించుకోవడం నాగరికత, ఇతరుల్ని హింసించడం జరుగుతున్న కథ’’ అని గొణుక్కున్నాడు శాస్త్రవేత్త.
ఇదే అదునుగా ఒక స్టూడెంట్ లేచి ‘‘నిర్జర గర్జర సాగర సంభ్రమంలో విభ్రాంతికర సమ్మోహితమై నిశ్శబ్దయుద్ధవేళ మనమెటు వెళ్ళాలి ప్రొఫెసర్’’ అడిగాడు.
ప్రొఫెసర్ వెంటనే కర్రతో వాడి నోరు మూయించాడు.
జ్ఞాన సభ పూర్తయిన వెంటనే అక్కడున్న చెత్తని వూడుస్తున్న వ్యక్తి ‘‘పాపం, వీళ్లంతా మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నారు’’ అని నిట్టూర్చాడు.
‘‘మేధావులకి సామాన్యులు అర్థం కాకపోవడం, మేధావులు మేధావులకే అర్థం కాకపోవడం చాలా పాతకథ... ఇది అనంతం.’’
- జి.ఆర్. మహర్షి