ప్రొఫెసర్ సుబూసింగ్‌ను సన్మానిస్తున్న తెయూ టూటా అధ్యక్ష, కార్యదర్శులు, కెమిస్ట్రీ అధ్యాపకులు
తెయూ(డిచ్‌పల్లి): కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ రంగాలలో పరిశోధనలకు దక్షిణాఫ్రికా దేశంలో అపార అవకాశాలున్నాయని దక్షిణాఫ్రికాలోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ సుబూసింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు కాలం చెల్లుతుందని, రాబోయే రోజులన్నీ పునరుత్పాదక ఇంధనాలదేనన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘భవిష్యత్ ఇంధనాలు’ అనే అంశంపై సుబూసింగ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నిల్వలు తరిగిపోతున్నాయని, వాటి వాడకం వల్ల పర్యావరణం కలుషితమై భూతాపం పెరిగిందన్నారు.
పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా, సుస్థిర అభివృద్ధి, ఇంధన స్వయం సమృద్ధి సాధించాలన్నా పునరుత్పాదక ఇంధనాల వినియోగం, ఉత్పత్తి పెరగాలని ఆయన సూచించారు. శిలాజ ఇంధనాలు రాజకీయ, భౌగోళిక, ఆర్థిక కారణాలతో సరఫరా ఆగిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. హైడ్రోజన్ ఆధారిత ఇంధనాల అభివృద్ధి దిశగా తాము ప్రయోగాలు చేస్తున్నామని, ఇది భవిష్యత్ అవసరాలకు అనువుగా ఉంటుందన్నారు. దక్షిణాఫ్రికాలో పరిశోధనలకు విస్తృత అవకాశాలున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఎంఎస్, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లో చేరవచ్చన్నారు.
అనంతరం సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ముఖాముఖిలో ఆయన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుబూసింగ్ డర్బన్‌లోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీలో మూడు దశాబ్దాలుగా కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. టూటా అధ్యక్షుడు రాజారాం, కార్యదర్శి పున్నయ్య, పరీక్షల నియంత్రణాధికారి యాదగిరి, ఫార్మా విభాగం హెడ్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ శిరీష, సత్యనారాయణ, నాగరాజు, సాయిలు తదితరులు సుబూసింగ్‌ను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment