రూ.10వేల కోట్ల సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం పావులు
కోకాపేట, రాయదుర్గంలో విలువైన భూముల గుర్తింపు
రూ.20 వేల కోట్ల విలువ చేసే 400 ఎకరాలు తనఖాకు సిద్ధమైన టీజీఐఐసీ
గతంలో ఇచ్చిన టెండర్ రద్దు.. మరోమారు టెండర్ పిలిచేందుకు సన్నద్ధం
బిడ్డర్ ఎంపికలో టీజీఐఐసీతోపాటు ఆర్థికశాఖకు బాధ్యతలు
రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు రూ.100 కోట్ల కమీషన్!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉన్న ప్రభుత్వం పరిశ్రమల భూము లను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణమార్కెట్ నుంచి కనీసం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కనీసం రూ.5 వేల కోట్లు వెంటనే సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ ను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.
దీనికోసం హైదరా బాద్‌లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలనుకుంటోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల ‘మర్చంట్ బ్యాంకర్’కు రుణసేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణ యించారు.
ఈ మర్చంట్ బ్యాంకర్ ప్రభు త్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటికి ప్రభుత్వ భూము లను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం 1% కమీషన్ చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీ షన్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
మర్చంట్ బ్యాంకర్ కోసం మళ్లీ టెండర్
బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి అప్పులు ఇప్పించడంలో అనువజ్ఞులైన ‘మర్చంట్ బ్యాంకర్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. అందులో భాగంగా గత నెల 23న తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనలు కోరుతూ టెండర్ ప్రకటన విడుదల చేసింది. అయితే టెండర్ ప్రకటనలో విధించిన పలు అంశాలపై మర్చంట్ బ్యాంకర్ల నుంచి కొన్ని విన్నపాలు అందాయి.
వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి గత నెల 28న టెండర్ నిబంధనలు సవరిస్తూ మరో ప్రకటన విడుదల చేయడంతోపాటు బిడ్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్‌లను తెరుస్తామని టీజీఐఐసీ ప్రకటించింది. అయితే టెండర్ డాక్యుమెంట్‌లో కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించిన టీజీఐఐసీ గత నెల 23న ఇచ్చిన టెండర్‌ను ఈనెల 2న రద్దు చేసింది. ఆ లోపాలను సరిదిద్ది తిరిగి ఒకటి రెండు రోజుల్లో తాజా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తోంది.
బ్యాంకర్ల ఎంపిక బాధ్యత టీజీఐఐసీకి
ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే అధికారం టీజీఐఐసీ నేతత్వంలోని కమిటీకి అప్పగించినా, ఆర్థికశాఖనే కీలక పాత్ర పోషించనుంది. ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే పక్షంలో సమపాళ్లలో బాధ్యతలు తీసుకొని నిర్దేశిత రుణం సేకరించాలి. పాత టెండర్ నోటిఫికేషన్ ప్రకారం బిడ్‌లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లు రూ.50 లక్షలు ధరావత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. భూములు తనఖా పెట్టడం సహా ఇతర సాంకేతిక, చట్టపరమైన అంశాలన్నీ మర్చంట్ బ్యాంకర్ ప్రభుత్వంతో సంప్రదిస్తూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన అరడజను మంది మర్చంట్ బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు ఆసక్తి చూపుతూ ఇప్పటికే బిడ్‌లు దాఖలు చేసినట్టు సమాచారం. అయితే టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడంతో బిడ్‌ల దాఖలు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.
రూ.10వేల కోట్లు సేకరణ లక్ష్యం...
హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడంతో భూముల వేలం సాధ్యం కాదని, ఆశించిన మొత్తంలో నిధులు సమకూరే అవకాశం లేదని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. దీంతో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా కనీసం రూ.10వేల కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే బిడ్‌లో దాఖలు చేసిన మర్చంట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు కూడా వేర్వేరుగా తాకట్టు కోసం ఎంపిక చేసిన భూముల విలువ (వాల్యూయేష¯Œన్) లెక్కగట్టినట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను రూ.20వేల కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ భూముల తాకట్టు ద్వారా లెక్కించిన విలువలో సగం మొత్తం అంటే.. రూ.10వేలు కోట్లు రుణ మార్కెట్ నుంచి అప్పు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు భావిస్తున్నట్టు తెలిసింది. 400 ఎకరాలను తాకట్టు పెట్టినా రూ.10వేల కోట్లు అప్పు పుట్టకుంటే.. అదనంగా మరింత భూమిని కూడా తాకట్టు పెట్టి అయినా రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు నెలల్లో రూ.10వేలు కోట్లు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా, కనీసం ఆరు నెలలు గడువు కావాలని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నట్టు సమాచారం.
ఆర్‌బీఐ అడ్డుకుంటుందనే అనుమానాలు
రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్‌ఆర్‌బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే భూముల తాకట్టు ద్వారా తెచ్చే అప్పులకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూములను కుదువపెట్టి తెచ్చే అప్పులకు ఆర్‌బీఐ అభ్యంతరాలు చెబితే ఏం చేయాలనే దానిపై ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment