కేటీఆర్‌ చుట్టూ.. ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు! | ACB has started investigation to KTR in Formula-E race case | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ చుట్టూ.. ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు!

Published Tue, Nov 5 2024 4:33 AM | Last Updated on Tue, Nov 5 2024 4:33 AM

ACB has started investigation to KTR in Formula-E race case

ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ. 55 కోట్ల చెల్లింపు ఆధారంగా సర్కారు చర్యలు

రాజకీయ బాంబులు పేలుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ఆ దిశగా సంకేతాలేననే చర్చ

ఈ వ్యవహారంలో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమారే కీలకం 

సీఎస్‌కు ఇచ్చిన వివరణలో నాటి మంత్రి కేటీఆర్‌ మౌఖిక ఆదేశాలతోనే సొమ్ము ఇచ్చామన్న అర్వింద్‌కుమార్‌! 

ఫార్ములా–ఈ రేస్‌ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ

సాక్షి, హైదరాబాద్‌:  ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసింగ్‌ అంశంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్‌ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో)కు కేటీఆర్‌ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. 

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సియోల్‌ పర్యటన సందర్భంగా రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన కామెంట్లు.. తాజాగా అర్వింద్‌ కుమార్‌కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్‌ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు.. కేటీఆర్‌ లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు వంటి పరిణామాలన్నీ కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దిశగా వస్తున్న సంకేతాలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయా­లంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. 

రంగంలోకి ఈడీ? 
ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్‌ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు.  

ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? 
హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్‌ఈవో, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్‌ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్‌ (సెషన్‌–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్‌ ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్‌ తప్పుకొన్నారు. 

2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్‌–10) ఈ–కార్‌ రేసు నుంచి హైదరాబాద్‌ పేరును ఎఫ్‌ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్‌ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్‌ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్‌ నిర్వహించే బాధ్యతలను నోడల్‌ ఏజెన్సీగా హెచ్‌ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్‌ఈవోకు స్పష్టం చేశారు. 

ఈ మేరకు రెండో దఫా ఈ కార్‌ రేస్‌ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్‌ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్‌ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్‌ఈవోకు చెల్లించింది. 

ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. 
డిసెంబర్‌ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్‌ఈవో సెషన్‌–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. 

ఆ మెమోకు అర్వింద్‌కుమార్‌ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్‌ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement