ఇప్పటికే సెబీ, చైర్‌పర్సన్ ప్రకటనలు చేశారు
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ తాజా నివేదికకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, దాని చైర్‌పర్సన్ మాధవీ పురీ బుచ్ ఇప్పటికే ప్రకటనలు చేశారని, దీనిపై తాము చెప్పడానికి ఇంకేమీ లేదని ఆర్థిక శాఖ సోమవారం పేర్కొంది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ డొల్ల కంపెనీల్లో సెబీ చీఫ్, ఆమె భర్త ధవళ్ బుచ్‌కు వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
కాగా, ఇది పూర్తిగా నిరాధారమని, తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కోసం ఇలాంటి అవాస్తవ నివేదికను హిండెన్‌బర్గ్ ఇచి్చందని బుచ్ దంపతులు ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెబీ కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలన్నింటినీ సెబీ చీఫ్ వెల్లడించారని స్పష్టం చేసింది. ‘సెబీతో పాటు చైర్‌పర్సన్ కూడా ఇప్పటికే స్పష్టంగా ప్రకటనలు చేశారు. ఈ ఉందంతపై ప్రభుత్వం చెప్పడానికేమీ లేదు’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యాఖ్యానించారు. కాగా, అదానీ గ్రూప్ కూడా ఈ నివేదిక దురుద్దేశపూరితమని, సెబీ చీఫ్‌తో తమకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ఖండించింది.
బచ్‌కు రీట్స్ అసోసియేషన్ మద్దతు
హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ బుచ్‌కు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (రీట్స్), ఆల్టర్నేట్ క్యాపిటల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పరిశ్రమ చాంబర్‌లు మద్దతుగా నిలిచాయి. కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా సెబీ రీట్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు ‘నిరాధారం, తప్పుదోవ పట్టించేవి’గా ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్‌ఏ) పేర్కొంది.
ఈ కఠిన పరిస్థితు ల్లో తాము సెబీ చీఫ్ బుచ్ వెన్నంటే ఉన్నామని, మార్కె ట్ సమగ్రత, నియంత్రణపరమైన నియమావళి, ఇన్వెస్టర్ల రక్షణ విషయంలో సెబీ తిరుగులేని నిబద్ధతను కనబరిచిందని ఇండియన్ వెంచర్, ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసో సియేషన్ (ఐవీసీఏ) తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ చాంబర్ యాంఫీ కూడా ఇప్పటికే బుచ్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే.
తప్పు చేయలేదని నిరూపించుకోవాలి: హిండెన్‌బర్గ్
సెబీ చీఫ్ బుచ్‌పై హిండెన్‌బర్గ్ తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉంది. సెబీ పదవిలో కొనసాగుతున్న సమయంలో కూడా అదానీతో లింకులున్న ఫండ్స్‌లో వాటాలను కలిగి ఉండటంపై తాను ఎలాంటి తప్పు చేయలేదని బుచ్ నిరూపించుకోవాలని హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తమపై హిండెన్‌బర్గ్ కావాలనే బురదజల్లుతోందని, సెబీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఇలా రాద్ధాంతం చేస్తోందని బుచ్ ఈ ఆరోపణలను తిప్పికొట్టిన నేపథ్యంలో హిండెన్‌బర్గ్ ఇలా స్పందించింది. ‘బెర్ముడా/మారిషస్ విదేశీ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని బుచ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, సంబంధిత ఫండ్‌ను తన భర్త చిన్ననాటి స్నేహితుడు నిర్వహించారని, దానిలో వినోద్ అదానీ అప్పుడు డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు’ అని కూడా హిండెన్‌బర్గ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment