రూ.36.9 కోట్ల విలువైన లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్
మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా
సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ పనితీరుపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. 2017-23 మధ్యకాలంలో రూ.36.9 కోట్ల విలువైన లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఆమె సంస్థ పూర్తికాల డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత ఈ వ్యవహారం జరిగిందని చెప్పారు. ఇది సెబీ నిబంధనలను బేఖాతరు చేయడమేనన్నారు. మాధబి సెబీ నియమాలను ఉల్లంఘించడంతోపాటు చైనీస్ ఫండ్‌ల్లో పెట్టుబడులు, విదేశాల్లో ఆస్తులను కలిగి ఉన్నారని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘2017-21 సంవత్సరాల మధ్య మాధబి పురీ బచ్‌కి విదేశీ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మొదటిసారిగా ఆమె ఏ ప్రభుత్వ సంస్థకు ఎప్పుడు తెలియజేసిందో ప్రకటించాలి. సింగపూర్‌లోని అగోరా పార్ట్‌నర్స్‌తో మాధబి బ్యాంక్ అకౌంట్‌పై సంతకం చేసింది నిజమో కాదో చెప్పాలి. వాన్‌గార్డ్ టోటల్ స్టాక్ మార్కెట్ ఈటీఎఫ్, ఏఆర్‌కే ఇన్నోవేషన్ ఈటీఎఫ్, గ్లోబల్ ఎక్స్ ఎంఎస్‌సీఐ చైనా కన్స్యూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్‌ల్లో ఈమె పెట్టుబడులు పెట్టారు. సెబీ ఛైర్‌పర్సన్ స్థాయిలో ఉన్న వ్యక్తి చైనాలో పెట్టుబడులు పెట్టడం నిజంగా ఆందోళనకరం’ అని చెప్పారు. భారత్, చైనా సంబంధాలపై స్పందిస్తూ చైనా ఉత్పత్తులను వాడకూడదని ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాని చైనా నుంచి పీఎం కేర్స్ విభాగం ఎందుకు నిధులు పొందుతోందో చెప్పాలన్నారు.
అదానీ కంపెనీలో పెట్టుబడులు
సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని ఇటీవల హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని గతంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.
ఇదీ చదవండి: ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చే రంగం
ఉద్యోగుల ఫిర్యాదు
సెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment