సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) విచారణకు ఆమోదించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పీఏసీ ఈ నెలాఖరులో సెబీ పనితీరును సమీక్షించనుందని చెప్పారు.
ఆగస్టు 29న జరిగిన పీఏసీ ప్యానెల్ సమావేశంలో సెబీ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలకు అనుగుణంగా సంస్థ పనితీరుపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. దాంతో కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే పీఏసీకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నాయకత్వం వహించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు అధికార ఎన్‌డీఏ పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ కమిటీలో భాగంగా ఉంటారు.
పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరుపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ క్షణమైనా విచారణ జరిపే అధికారం కలిగి ఉంది. అందుకోసం ఆయా సంస్థలకు ముందుగా సమాచారం అందించాల్సిన అవసరం ఉండదు. సెబీ కూడా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థ. పీఏసీ తన తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్ 10న నిర్వహించనుంది. ఆ తేదీన సెబీ విచారణ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సెబీ చీఫ్ పనితీరుపై ఉద్యోగుల ఫిర్యాదు
సెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.
ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’
అదానీ కంపెనీలో పెట్టుబడులు
ఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment