Ajay Seth
-
హిండెన్‌బర్గ్ వివాదం.. ప్రభుత్వం చెప్పడానికేమీ లేదు
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ తాజా నివేదికకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, దాని చైర్పర్సన్ మాధవీ పురీ బుచ్ ఇప్పటికే ప్రకటనలు చేశారని, దీనిపై తాము చెప్పడానికి ఇంకేమీ లేదని ఆర్థిక శాఖ సోమవారం పేర్కొంది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ డొల్ల కంపెనీల్లో సెబీ చీఫ్, ఆమె భర్త ధవళ్ బుచ్‌కు వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఇది పూర్తిగా నిరాధారమని, తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కోసం ఇలాంటి అవాస్తవ నివేదికను హిండెన్‌బర్గ్ ఇచి్చందని బుచ్ దంపతులు ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెబీ కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలన్నింటినీ సెబీ చీఫ్ వెల్లడించారని స్పష్టం చేసింది. ‘సెబీతో పాటు చైర్పర్సన్ కూడా ఇప్పటికే స్పష్టంగా ప్రకటనలు చేశారు. ఈ ఉందంతపై ప్రభుత్వం చెప్పడానికేమీ లేదు’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యాఖ్యానించారు. కాగా, అదానీ గ్రూప్ కూడా ఈ నివేదిక దురుద్దేశపూరితమని, సెబీ చీఫ్‌తో తమకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ఖండించింది.బచ్‌కు రీట్స్ అసోసియేషన్ మద్దతుహిండెన్బర్గ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ బుచ్‌కు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్స్), ఆల్టర్నేట్ క్యాపిటల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పరిశ్రమ చాంబర్లు మద్దతుగా నిలిచాయి. కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా సెబీ రీట్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు ‘నిరాధారం, తప్పుదోవ పట్టించేవి’గా ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) పేర్కొంది. ఈ కఠిన పరిస్థితు ల్లో తాము సెబీ చీఫ్ బుచ్ వెన్నంటే ఉన్నామని, మార్కె ట్ సమగ్రత, నియంత్రణపరమైన నియమావళి, ఇన్వెస్టర్ల రక్షణ విషయంలో సెబీ తిరుగులేని నిబద్ధతను కనబరిచిందని ఇండియన్ వెంచర్, ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసో సియేషన్ (ఐవీసీఏ) తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ చాంబర్ యాంఫీ కూడా ఇప్పటికే బుచ్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పు చేయలేదని నిరూపించుకోవాలి: హిండెన్‌బర్గ్ సెబీ చీఫ్ బుచ్‌పై హిండెన్‌బర్గ్ తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉంది. సెబీ పదవిలో కొనసాగుతున్న సమయంలో కూడా అదానీతో లింకులున్న ఫండ్స్‌లో వాటాలను కలిగి ఉండటంపై తాను ఎలాంటి తప్పు చేయలేదని బుచ్ నిరూపించుకోవాలని హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తమపై హిండెన్‌బర్గ్ కావాలనే బురదజల్లుతోందని, సెబీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఇలా రాద్ధాంతం చేస్తోందని బుచ్ ఈ ఆరోపణలను తిప్పికొట్టిన నేపథ్యంలో హిండెన్‌బర్గ్ ఇలా స్పందించింది. ‘బెర్ముడా/మారిషస్ విదేశీ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని బుచ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, సంబంధిత ఫండ్‌ను తన భర్త చిన్ననాటి స్నేహితుడు నిర్వహించారని, దానిలో వినోద్ అదానీ అప్పుడు డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు’ అని కూడా హిండెన్‌బర్గ్ పేర్కొంది. -
Interim Budget 2024: ఆర్థికమంత్రి హల్వా విందు...
2024 మధ్యంతర బడ్జెట్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు ప్రతీకాత్మకంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికశాఖ నార్త్‌బ్లాక్‌లో హల్వా విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ అధికారికంగా ప్రారంభమవుతుంది. లోక్‌సభలో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంతవరకూ ముద్రణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు అందరూ ‘లాక్–ఇన్’లో ఉంటారు. బడ్జెట్‌కు ముందు సంప్రదాయంగా వస్తున్న ఈ హల్వా రుచుల ఆస్వాదన కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి కరాద్, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంతా పాండే తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
డిజిటల్ సదుపాయాలతో 27 బిలియన్ డాలర్ల ఆదా - అజయ్సేథ్
న్యూఢిల్లీ: డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వల్ల ప్రభుత్వ పథకాల అమలులో 27 బిలియన్ డాలర్లను (రూ.2.24 లక్షల కోట్లు) ఆదా చేయగలిగినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ ప్రకటించారు. అంతేకాదు స్వల్ప కాలంలోనే అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. గత దశాబ్ద కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల లకి‡్ష్యత లబ్ధిదారులను చేరుకోగలిగినట్టు, బోగస్ ఖాతాలను తొలగించినట్టు తెలిపారు. ఫలితంగా పన్ను చెల్లింపుదారుల ధనం పెద్ద ఎత్తున ఆదా అయినట్టు పేర్కొన్నారు. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో సాధించిన పురోగతిని అజయ్సేథ్ వివరించారు. బ్యాంకు ఖాతాల విషయంలో 20 శాతంగా ఉన్న విస్తరణను కేవలం 7–8 ఏళ్లలోనే 80 శాతానికి డీపీఐ సాయంతో పెంచినట్టు తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికీ మెరుగైన సేవలు అందేలా పరిష్కారాలను అమలు చేసినట్టు చెప్పారు. 2014లో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ప్రారంభించగా, 50 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నట్టు వెల్లడించారు. ఇందులో 56 శాతం మహిళలకు చెందినవిగా పేర్కొన్నారు. అలాగే, 67 శాతం ఖాతాలు గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో భారత్ తన జ్ఞానాన్ని, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సేథ్ ప్రకటించారు. -
అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు
ముంబై: కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌సేత్ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల్లో రెండో అతి పెద్ద వాటా కలిగిన కార్పొరేట్ పన్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్–జూలై) 10.4 శాతం తగ్గడం గమనార్హం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో పన్నుల ఆదాయం 14 శాతం తగ్గడంపై వస్తున్న ఆందోళలను సేత్ తోసిపుచ్చారు. పన్నుల వసూళ్లను దీర్ఘకాలానికి చూడాలని సూచించారు. ‘‘కేవలం కొన్ని నెలల డేటా చూసి, దీర్ఘకాల ధోరణిని అంచనా వేయకూడదు. కనీసం మరో త్రైమాసికం వేచి చూసిన తర్వాత దీర్ఘకాలంపై అంచనాకు రావాలి. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు ఉంటాయన్నది నా ఉద్దేశ్యం’’అని వివరించారు. ఎస్ఎంఈ రుణాలపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా సేత్ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఏప్రిల్–జూలై కాలానికి స్థూల పన్నుల ఆదాయం రూ.8.94 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.8 శాతం అధికం. 2023–24 సంవత్సరానికి రూ.33.61 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొనడం గమనార్హం. -
భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత ఫైనాన్షియల్ వ్యవస్థ నియంత్రణలకు అనుగుణంగా పటిష్ట బాటలో ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 27వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ, ‘‘భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఏదైనా తీవ్ర సమస్య సూచిక కనిపించిన వెంటనే మనం ఎల్లప్పుడూ అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన కాలిపై మనం నిలబడాలి’’ అని అన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం అలాగే క్రెడిట్ సూచీ ఎదుర్కొంటున్న ద్రవ్య పరమైన ఒత్తిడి గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. వీటి ప్రభావం మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై లేదని భావిస్తున్నాం. ► ప్రభుత్వ బాండ్ల మార్కెట్ విషయంలో సాంకేతికత వినియోగం మరింత పెంపొందేలా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడిదారులు ఆర్బీఐ లేదా సెబీ ఇన్ఫ్రా ద్వారా ఇందుకు సంబంధించి పొందుతున్న సదుపాయాలకన్నా, సాంకేతికత ద్వారా పొందుతున్న ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇవే సాంకేతిక చర్యల మరింత పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. ► అంతర్జాతీయంగా వస్తున్న ముందస్తు హెచ్చరిక సూచికలకు అనుగుణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకోవడం, ఆయా అంశాల్లో భారత్ సంసిద్ధత, నియంత్రణ నాణ్యతను మెరుగుపరచడం, దేశంలో కార్పొరేట్లు అలాగే గృహాల రుణ స్థాయిలు, కేవైసీ సరళీకరణ–క్రమబద్ధీకరణ, తద్వారా ఆర్థిక రంగంలో నియంత్రిత సంస్థలపై అనవసర భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై కౌన్సిల్ చర్చించింది. ఆయా అంశాలన్నీ డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చడానికి మరింత పటిష్ట ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తాయని భేటీ భావించింది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ నిర్ణయాలు, ఎఫ్ఎస్డీసీ గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కార్యాచరణ వంటి అంశాలపైనా తాజా కౌన్సిల్ దృష్టి సారించింది. ► ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాషిస్ పాండా, దివాలా బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ రవి మిట్టల్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా కొత్తగా నియమితులైన దీపక్ మెహంతీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కృష్టారావు కరాద్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్‌జోషి, తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై దృష్టి... కాగా, ఎఫ్ఎస్డీసీ సమావేశం ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రెగ్యులేటర్లకు సూచించింది. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ చేశాయి. దాదాపు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించిన ఈ మొత్తాలను గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. డిపాజిటర్లు, లబ్ధిదారులు వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగల కేంద్రీకృత పోర్టల్ మూడు లేదా నాలుగు నెలల్లో సిద్ధమవుతుందని గత నెలలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. -
చిప్‌ల కొరతతో ఉత్పత్తిపై ప్రభావం
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత ఇంకా కొనసాగుతూనే ఉందని, చిప్‌ల సరఫరాపైనా అనిశ్చితి నెలకొనే ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సీఎఫ్‌వో అజయ్ సేఠ్ తెలిపారు. ఫలితంగా కార్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాలతోనే గరిష్ట స్థాయిలో ఉత్పత్తిని పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని అజయ్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో క్వార్టర్లో సరఫరా కొంత మెరుగుపడినప్పటికీ .. ఇంకా పరిస్థితి పూర్తిగా చక్కబడకపోవడంతో డిసెంబర్ క్వార్టర్లో మారుతీ 46,000 పైచిలుకు వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మారుతీ దగ్గర 3.63 లక్షల వాహనాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్లకు (మానేసర్, గురుగ్రామ్) మొత్తం 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మరోవైపు, కొత్తగా ప్రవేశపెడుతున్న జిమ్నీ, ఫ్రాంక్స్ వాహనాల ద్వారా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల విభాగంలో లీడర్‌గా ఎదగాలని భావిస్తున్నట్లు అజయ్ చెప్పారు. అటు అమ్మకాలపరంగా చూస్తే పరిశ్రమను మించే స్థాయిలోనే తమ సంస్థ విక్రయాల వృద్ధి ఉండగలదని భావిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతీ తెలిపారు. మూడో క్వార్టర్లో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం 4,65,911 వాహనాలను విక్రయించింది. ఆదాయం రూ. 22,188 కోట్ల నుంచి రూ. 27,849 కోట్లకు, లాభం రెండు రెట్లు పెరిగి రూ. 2,351 కోట్లకు పెరిగింది. -
ఫారెక్స్ నిల్వలు పుష్కలం పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయంటూ నెలకొన్న ఆందోళనలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ తోసిపుచ్చారు. దీన్ని ‘మరీ ఎక్కువగా‘ చేసి చూపుతున్నారని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ దగ్గర పుష్కలంగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని సేఠ్ చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహం తగ్గడం, వాణిజ్య లోటు అధికంగా ఉండటం వల్ల మారక నిల్వలు తగ్గాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఆయన చెప్పారు. వరుసగా ఏడో వారం ఫారెక్స్ నిల్వలు తగ్గిన నేపథ్యంలో సేథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 2.23 బిలియన్ డాలర్లు తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81ని కూడా దాటేసి ఆల్‌టైం కనిష్టానికి పడింది. మరోవైపు, దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, అంతర్జాతీయంగా డాలరు బలపడుతుండటమే రూపాయి క్షీణతకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
రూపాయి పతనంపై అందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి పతనంపై ఆందోళనలను తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. రూపాయి విలువ బాగానే ఉందని, అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ క్షీణతపై ‘మరీ’ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి (డీఈఏ) అజయ్ సేథ్ మంగళవారం స్పష్టం చేశారు. బ్రిటీష్ పౌండ్, జపాన్ యెన్, యూరో వంటి అనేక ప్రపంచ కరెన్సీల మారకంలో భారత కరెన్సీ మెరుగ్గా ఉందని అన్నారు. ఈ పరిస్థితి అమెరికా డాలర్‌తో పోలిస్తే ఈ కరెన్సీలలో భారత్ దిగుమతుల వ్యయాన్ని చౌకగా మార్చిందని కూడి వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది కూడా రాజ్యసభలో ఇదే తరహా ప్రకటన చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడినప్పటికీ బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్ యూరో వంటి ప్రధాన కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి బలపడిందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారకపు మార్కెట్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని, తీవ్ర అస్థిరత పరిస్థితులలో జోక్యం చేసుకుంటుందని ఒక లిఖితపూర్వక సమాధానంలో చతుర్వేది తెలిపారు. ఏప్రిల్–జూన్ క్వార్టర్ ప్రాతిపదిక పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం మేర నమోదవుతుందన్న ధీమాను రాజ్యసభలో వ్యక్తం చేశారు. కారణం ఏమిటంటే... ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రూపాయి భారీ పతనానికి కారణాన్ని వివరిస్తూ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును కఠినతరం చేయడం వల్ల డాలర్‌పై రూపాయి పతనమవుతోందని అన్నారు. ఫెడ్ ఫండ్ రేటు పెంపు వల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్లు అమెరికాకు ప్రవహిస్తున్నాయని అన్నారు. దీనితో పలు దేశాల కరెన్సీలు పతన బాట పట్టాయని వివరించారు. నిజానికి పలు ఇతర కరెన్సీలతో పోల్చితే భారత్ కరెన్సీ పతనం తక్కువేనని అన్నారు. దేశంలోకి ఫారెక్స్ భారీగా రావడానికి ఆర్బీఐ రెండు వారాల క్రితమే విస్తృతమైన చర్యలు తీసుకుందని ఆయన గుర్తుచేస్తూ, ఈ దిశలో అవసరమైన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. డాలర్ మారకంలో రూపాయి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తీవ్ర ఒడిదుడుకుల నివారణకూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఇంట్రాడేలో 80 దాటిన రూపాయి ఇదిలాఉండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్‌లో మొదటిసారి 80 దాటిపోయి, 80.05ను తాకింది. అయితే చివరకు క్రితంతో పోల్చితే 6పైసలు బలపడి 79.92 వద్ద ముగిసింది. రూపాయి విలువ సోమవారం (18వ తేదీ) మొదటిసారి 80ని తాకి చరిత్రాత్మక కనిష్టాన్ని చూసింది. అయితే అటు తర్వాత తేరుకుని 79.98 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ చరిత్రాత్మక కనిష్ట ముగింపు 79.9975. గత గురువారం (14వ తేదీ 18 పైసలు క్షీణతతో) ఈ స్థాయిని తాకింది. 2022లో ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి 7.5 శాతం (563 పైసలు) నష్టపోయింది. -
క్రిప్టో కరెన్సీలపై సంప్రదింపుల పత్రం!
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై వివిధ భాగస్వాములు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ తదితర సంస్థల అభిప్రాయాలతో సంప్రదింపుల పత్రాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్ వెల్లడించారు. వర్చువల్ (ఆన్లైన్)గా చేతులు మారే క్రిప్టో కరెన్సీల నియంత్రణలో సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్పందన అవసరమన్నారు. క్రిప్టో కరెన్సీలు స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అని, దేశీయంగా నియంత్రించలేని పరిస్థితుల్లో వీటిని అనుమతించొద్దంటూ ఆర్బీఐ కేంద్రానికి తన అభిప్రాయాలను స్పష్టం చేయడం తెలిసిందే. అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించే ‘ఐకానిక్ వీక్’ కర్టెన్ రైజర్ కార్యక్రమం సందర్భంగా సేత్ మాట్లాడారు. ‘‘దేశీయ భాగస్వాములు, సంస్థలతోపాటు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నాం. దీంతో అతి త్వరలోనే సంప్రదింపుల పత్రం సిద్ధం కానుంది’’అని తెలిపారు. కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీలను నిషేధించిన అంశాన్ని సేత్ ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ ఏకాభిప్రాయం లేకుండా ఈ విషయంలో అవి విజయం సాధించలేవన్నారు. ‘‘డిజిటల్ ఆస్తులను డీల్ చేసే విషయంలో విస్తృతమైన కార్యాచరణ అవసరం. ఈ విషయంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కలసికట్టుగా నడవాలి. ఏ దేశం కూడా ఏదో ఒక వైపున ఉండడాన్ని ఎంపిక చేసుకోకూడదు. క్రిప్టోల నియంత్రణలపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం అవసరం’’అని సేత్ వివరించారు. వేగవంతమైన వృద్ధి దిశగా ప్రయాణం అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని సేత్ వ్యక్తం చేశారు. ప్రస్తుత సవాళ్లే కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సైతం అధిగమిస్తామని చెప్పారు. ద్రవ్య, మానిటరీ పరమైన చర్యలతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణపై కొనసాగుతున్న కసరత్తు రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించే విషయంలో ముందస్తు చర్యలు కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. కనీసం రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించనున్నట్టు 2021–22 బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదన చేయడం గమనార్హం. బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి నివేదిక పార్లమెంటు ముందున్నట్టు మల్హోత్రా గుర్తు చేశారు. -
వ్యయాల పెంపుతో డిమాండ్‌కు పునరుత్తేజం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యయాల పెంపు వ్యవస్థలో డిమాండ్ పునరుత్తేజం, పటిష్టతకు అలాగే ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్, క్యాపిటల్ గూడ్స్ విభాగాలకు ఈ నిర్ణయం మంచి ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. ప్రత్యక్ష మద్దతు చర్యలు పరిమిత స్థాయిలోనే సానుకూల ప్రభావం చూపిస్తాయని పేర్కొన్న ఆయన, ఆర్థిక వ్యవస్థను స్థిరమైన పద్ధతిలో మెరుగుపరచడానికి దీర్ఘకాలం నుండి మధ్యకాలిక ప్రభావాన్ని కలిగి ఉండే చర్యలు అవసరమని చెప్పారు. ‘‘ఆర్థికాభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలు ఏదో ఒక ఏడాదికి సంబంధించి అంశం కాదు. ఇవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అంశాలతో ఇమిడి ఉంటాయి. ప్రత్యక్ష ఆదాయ మద్దతు స్వల్పకాలిక ప్రయోజనాలకు తగిన విధంగా ఉపయోగపడుతుందనికానీ, మధ్యకాలి, దీర్ఘకాలిక ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. ఇక్కడ మూలధన వ్యయాల కీలకమైనవి. దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలు సమకూర్చుతాయి. ఈ చర్యల వల్ల ముడి పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడుల ప్రక్రియ పురోగమిస్తుంది’’ అని ఆయన అన్నారు. వినియోగ ధోరణి పట్ల దీర్ఘకాలిక రీతిన ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రధానమని ఆయన అన్నారు. పెట్టుబడులకు సంబంధించి మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) భారీగా 35.4% పెంచుతూ 2022–23 బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే, 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు బడ్జెట్ పేర్కొంది.