న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత ఇంకా కొనసాగుతూనే ఉందని, చిప్‌ల సరఫరాపైనా అనిశ్చితి నెలకొనే ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సీఎఫ్‌వో అజయ్ సేఠ్ తెలిపారు. ఫలితంగా కార్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాలతోనే గరిష్ట స్థాయిలో ఉత్పత్తిని పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని అజయ్ వివరించారు.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో క్వార్టర్‌లో సరఫరా కొంత మెరుగుపడినప్పటికీ .. ఇంకా పరిస్థితి పూర్తిగా చక్కబడకపోవడంతో డిసెంబర్ క్వార్టర్‌లో మారుతీ 46,000 పైచిలుకు వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మారుతీ దగ్గర 3.63 లక్షల వాహనాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్లకు (మానేసర్, గురుగ్రామ్) మొత్తం 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
మరోవైపు, కొత్తగా ప్రవేశపెడుతున్న జిమ్నీ, ఫ్రాంక్స్ వాహనాల ద్వారా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల విభాగంలో లీడర్‌గా ఎదగాలని భావిస్తున్నట్లు అజయ్ చెప్పారు. అటు అమ్మకాలపరంగా చూస్తే పరిశ్రమను మించే స్థాయిలోనే తమ సంస్థ విక్రయాల వృద్ధి ఉండగలదని భావిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతీ తెలిపారు. మూడో క్వార్టర్‌లో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం 4,65,911 వాహనాలను విక్రయించింది. ఆదాయం రూ. 22,188 కోట్ల నుంచి రూ. 27,849 కోట్లకు, లాభం రెండు రెట్లు పెరిగి రూ. 2,351 కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment