కంపెనీ మారిన మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ (Jatin Dalal)కు భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఝలక్ ఇచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అంతే కాకుండా వడ్డీ కూడా కట్టాలని కోర్టులో దావా వేసింది.
కాగ్నిజెంట్ (Cognizant) లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌పై ఐటీ కంపెనీ విప్రో బెంగళూరులోని సివిల్ కోర్టులో ఇటీవల దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు తమకు లభించిన కోర్టు పత్రాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబర్ 29 నుంచి చెల్లింపు తేదీ వరకు 18 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాలని దలాల్‌ను కోరింది.
అంతేకాకుండా దలాల్ తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా, తమ కస్టమర్‌లు లేదా ఉద్యోగులను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా జతిన్ దలాల్‌పై విప్రో శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయాలని కోర్టును కోరుతూ దలాల్ దరఖాస్తు చేసుకున్నారు. తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలా వద్దా అనే దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యవర్తిత్వం అనేది కోర్టులతో పని లేకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ మార్గం. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌లో దీనికి అవకాశం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు.
జతిన్ దలాల్ డిసెంబర్ 1న కాగ్నిజెంట్‌లో సీఎఫ్‌వోగా చేరారు. ఈ కేసులో మొదటి విచారణ నవంబర్ 28న జరిగింది. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి సూచించే అధికారం కోర్టులకు లభిస్తుంది.
జతిన్ దలాల్‌కు విప్రోలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి ఆయన ఇక్కడ సీఎఫ్‌వోగా పనిచేశారు. 2019 నుంచి ప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలను సైతం నిర్వహించారు. కాగ్నిజెంట్‌లో ఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత యూఎస్ లేదా యూకే వెళ్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment