
సాక్షి, అమరావతి: ఉద్యోగుల పింఛన్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా పెరిగిపోతోంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్ల వ్యయం ఏటా వేల కోట్ల రూపాయల మేర పెరిగిపోతోందని ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రం వెల్లడించింది. ముగిసిన ఆర్థిక (2021–22) సంవత్సరంలో పింఛన్ల ఖర్చు రూ.20,326.67 కోట్లు ఉండగా 2024వ సంవత్సరంలో ఏకంగా రూ.25,520.04 కోట్లకు పెరుగుతోంది. అంటే రూ.5 వేల కోట్లకు పైగా పెరుగుతోంది.
2031వ సంవత్సరం నాటికి ఈ ఖర్చు ఏకంగా రూ.34,251.89 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచడంతో 2022 సంవత్సరం, 2023 సంవత్సరాల్లో రిటైరయ్యే ఉద్యోగులు లేరు. అయితే 2024 సంవత్సరం నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. 2024 నుంచి 2031 నాటికి 1.17 లక్షల మంది పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే పింఛన్ల వ్యయం కూడా భారీగా పెరుగుతోందని ద్రవ్య విధాన పత్రం స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment