Employees pension
-
ప్రధాని దృష్టికి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు
సైదాబాద్ (హైదరాబాద్): రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ పెంపు.. తదితర అపరిష్కృత సమస్యలను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి హామీ ఇచ్చారు. గురువారం ఆయన సైదాబాద్‌లోని ఎస్బీహెచ్ ఏ కాలనీ కమ్యూనిటీహాల్లో నిర్వహించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రోహిణిరావు, అసోసియేషన్ సభ్యులతో కలసి కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. గత మూడు దశాబ్దాలుగా బ్యాంక్ ఉద్యోగుల ప్రాథమిక పెన్షన్‌ను సవరించలేదని ఆయన పేర్కొన్నారు. 2002కు ముందు పదవీ విరమణ పొందిన సీనియర్ మేనేజర్లు, టాప్ మేనేజర్లలో చాలామంది రూ. 35 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారని వివరించారు. పెరిగిన ఖర్చులతో పెద్ద హోదాలోనివారి పరిస్థితే ఇలా ఉంటే తక్కువ క్యాడర్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. కాగా, పెన్షన్ రివిజన్, 100 శాతం డీఏ న్యూట్రలైజేషన్ సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని వారు కోరారు. అసోసియేషన్ వినతులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు భద్రత కల్పించేలా ‘జీపీఎస్’
సాక్షి, అమరావతి: ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించిన తర్వాతే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) తెస్తున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిటీ స్పష్టం చేసింది. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అంశంపై మంత్రుల కమిటీ సభ్యులైన బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. సీపీఎస్ కంటే మెరుగ్గా జీపీఎస్‌ను తెస్తున్నామని, ఇది ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉంటుందని వివరించారు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్)చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్, హెచ్ఆర్) హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. చట్టపరమైన సదుపాయాలు: బుగ్గన జీపీఎస్ విధానంలో హామీ పింఛను, హామీ కుటుంబ భద్రత, హామీ కనీస పింఛను–ఆరోగ్య భద్రత, ప్రమాదవశాత్తు మరణం–వైకల్య బీమా సౌకర్యాన్ని చట్టపరంగా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఈ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆమోదాన్ని తెలపాలని కోరారు. మరోసారి చర్చలు : బొత్స జీపీఎస్‌పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించామని, ఫైనల్ అయ్యాక దానికి చట్ట బద్ధత కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తుది డ్రాఫ్ట్ గురించి ఉద్యోగులకు వివరించామని చెప్పారు. రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10 వేలు పెన్షన్ ఉండేలా మార్పు చేశామన్నారు. పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ వస్తుందని, హెల్త్ కార్డులు కూడా ఉంటాయని చెప్పారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. వారిపై పెట్టిన కేసుల ఎత్తివేతపై సీఎంతో చర్చిస్తామన్నారు. గురుకులాలు, యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వారికి బుద్ధి ఉండాలి సీఎం సతీమణి గురించి మాట్లాడేవారికి బుద్ధి ఉండాలని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏదైనా ఉంటే రాజకీయంగా పోరాడాలన్నారు. ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడటం నీచమన్నారు. ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం: సజ్జల ఉద్యోగులపై ప్రేమ ఉండబట్టే వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేలా జీపీఎస్ తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించాలని కోరారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా ఉన్నంతలో బెస్ట్ ప్యాకేజీగా జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రానికి విపత్తు లాంటిదని చెప్పారు. జీపీఎస్ రూపకల్పన చర్చల్లో సీఎం జగన్ నేరుగా పాల్గొని సూచనలు, సవరణలు చేశారని తెలిపారు. జీపీఎస్ కూడా భారమని ఆర్థిక నిపుణులు చెప్పినా, ఉద్యోగులకు కనీస భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని భావించినట్లు చెప్పారు. దీనిపై ఇంకా ఏమైనా మెరుగ్గా చేయగలమా... అనే అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. కనీస పింఛన్ రూ.10 వేలు, ఉద్యోగం చేస్తూ చనిపోతే బీమా, అతి తక్కువ బేసిక్ ఉన్న వారికి రూ.50 లక్షలు, ఎక్కువ బేసిక్ ఉన్న వారికి కొంత తక్కువ బీమా కవరేజీ ఉంటుందన్నారు. ఉద్యోగి చనిపోయినా, అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి అండగా ఉండేలా బీమా, పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే భార్యకు 60 శాతం పెన్షన్, ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న ఈహెచ్ఎస్ను రిటైర్ అయ్యాక కూడా కొనసాగించడం లాంటివి జీపీఎస్‌లో ఉన్నాయన్నారు. సీఎం జగన్ అవకాశవాదంతో ఆలోచించే వ్యక్తి కాదు కాబట్టే, ఉద్యోగులకు మేలు చేసేందుకు అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. నిజంగా ఉద్యోగుల ప్రయోజనాలను ఆకాంక్షిస్తుంటే ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని సూచించారు. -
భారీగా పెరగనున్న ఉద్యోగుల పింఛన్ల వ్యయం
సాక్షి, అమరావతి: ఉద్యోగుల పింఛన్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా పెరిగిపోతోంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్ల వ్యయం ఏటా వేల కోట్ల రూపాయల మేర పెరిగిపోతోందని ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రం వెల్లడించింది. ముగిసిన ఆర్థిక (2021–22) సంవత్సరంలో పింఛన్ల ఖర్చు రూ.20,326.67 కోట్లు ఉండగా 2024వ సంవత్సరంలో ఏకంగా రూ.25,520.04 కోట్లకు పెరుగుతోంది. అంటే రూ.5 వేల కోట్లకు పైగా పెరుగుతోంది. 2031వ సంవత్సరం నాటికి ఈ ఖర్చు ఏకంగా రూ.34,251.89 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచడంతో 2022 సంవత్సరం, 2023 సంవత్సరాల్లో రిటైరయ్యే ఉద్యోగులు లేరు. అయితే 2024 సంవత్సరం నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. 2024 నుంచి 2031 నాటికి 1.17 లక్షల మంది పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే పింఛన్ల వ్యయం కూడా భారీగా పెరుగుతోందని ద్రవ్య విధాన పత్రం స్పష్టంచేసింది. -
పెన్షన్ సొమ్మునూ వదలని బాబు, ఇప్పుడు మాత్రం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పెన్షన్ సొమ్మును వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా మళ్లించి ఇప్పుడు ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కార్చడంపై ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు జరపాలని తాము కోరుతుంటే టీడీపీ నేతలు సీపీఎస్, జీపీఎఫ్ గురించి మాట్లాడుతున్నారని పేర్కొంటున్నాయి. 2017-18లో సీపీఎస్ ఉద్యోగులకు చెందిన రూ.730.94 కోట్ల పెన్షన్ సొమ్మును నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా వాయిదా వేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. నేషనల్ డిపాజిటరీ లిమిటెడ్‌కు బదిలీ చేయనందున వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడటమే కాకుండా ఉద్యోగుల సొమ్మును సరికాని రీతిలో వినియోగించినట్లైందని కాగ్ స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం రేటులో అనిశ్చితి ఏర్పడటమే కాకుండా మొత్తానికి పథకమే విఫలమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. 2018-19లో మార్చి 31 నాటికి సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ సొమ్ము రూ.663.63 కోట్లను గత ప్రభుత్వం నేషనల్ సెక్యురిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా తరువాత సంవత్సరానికి వాయిదా వేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. నిబంధనల మేరకు ఉద్యోగుల చందాకు సమానంగా ప్రభుత్వం కూడా చందా చెల్లించాల్సి ఉంది. అయితే ఉద్యోగుల నుంచి రూ.765.02 కోట్లను వసూలు చేసినప్పటికీ గత ప్రభుత్వం తన వాటా కింద కేవలం రూ.320.58 కోట్లనే చెల్లించిందని, రూ.444.44 కోట్ల మేర తక్కువగా చెల్లించిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. జీపీఎఫ్ డబ్బులూ ఇవ్వకుండా.. పిల్లల వివాహాలు, ఇతర అవసరాలకు అక్కరకు వస్తాయని ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను గత ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు ఇవ్వకుండా వేల సంఖ్యలో బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఉద్యోగులకు డీఏలను కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు పోస్ట్ డేటెడ్ జీవోలు జారీ చేసి మోసగించింది. ఎన్నికల ముందు పీఆర్సీ అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు కాలయాపన చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక పీఆర్సీ నివేదిక రాకపోయినప్పటికీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వడమే కాకుండా చంద్రబాబు సర్కారు పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలను సైతం మంజూరు చేశారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ నేతలు ఉద్యోగుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. -
పెన్షన్.. పెద్ద టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ అంశం తీవ్ర చిక్కుముడిగా మారనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేయలేదు. జనాభా ప్రాతిపదికన పెన్షన్ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని మాత్రం పేర్కొంది. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో.. కేంద్రం ఇలాంటి సూచనే చేసినా, భవిష్యత్తులో అది వాటిల్లో పెద్ద సమస్యగా మారింది. తుదకు కోర్టుల్లో కేసులు దాఖలవటం, వివాదాల కారణంగా ఏ రాష్ట్రం కూడా పెన్షన్ మొత్తం విడుదల చే యకపోవటంతో వేలాది మందికి పెన్షన్ నిలిచిపోయిన దాఖలాలున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవటం ఖాయమని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన అంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న జనాభా నిష్పత్తిని ఆధారంగా చేసుకుని పెన్షన్ మొత్తాన్ని విభజించి ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించే తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్‌ను ఇలా విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఈ లెక్కలో ఏమైనా తేడాలొచ్చి జనాభా నిష్పత్తి కంటే భిన్నంగా పంచుకోవాల్సి వస్తే, తక్కువ మొత్తం భరించాల్సిన రాష్ట్రం ఎక్కువ మొత్తం భరించే రాష్ట్రానికి ఆ తేడా మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెక్కన 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ భారం పడుతుంది. దీన్ని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణకు ఎక్కువ ఆదాయం ఉండటం, పెన్షన్ల భారం ఆంధ్రప్రదేశ్‌పై పడటం ఏమాత్రం సహేతుకం కాదనేది వారి వాదన. ప్రస్తుతం ప్రభుత్వం సాలీనా రూ.13 వేల కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తోంది. తాజా ముసాయిదా బిల్లు ప్రతిపాదన ప్రకారం ఇందులో రూ. 8.5 వేల కోట్లకుపైగా ఆంధ్రప్రదేశ్‌పై పడుతుందని, రెవెన్యూ షేర్ తక్కువగా ఉన్నందున ఇది ఆ రాష్ట్రానికి తలకుమించిన భారమే అవుతుందనేది సీమాంధ్ర ఉద్యోగుల వాదన. ఇలాంటి చిక్కులున్నందునే రాష్ట్ర విభజన వద్దని గట్టిగా వాదిస్తున్నామని ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యద ర్శి చంద్రశేఖరరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.